Tuesday, 13 December 2011

వెతుకుతున్నాను ..వేల అడుగుల నీడల నడుమ,
వేల ఊపిరుల జాడల మధ్య ,
వెన్నంటి వచ్చే నీ వ్యక్తిత్వాన్ని
ఒంటరిగా వెతుకుతున్నాను ..

ఆశల  శిఖరపు అంచుల చివర
నిరాశల అగాధపు లోతుల లోపల 
విస్తరించిన నీ విశ్వరూపాన్ని
గుర్తుపట్టలేక వెతుకుతున్నను  ..

నా ఊపిరి అలలను మోసే కడలివై 
నా ఊహల మెరుపులను భరించే మిన్నువై
నా ఇంట్లోనే ఉన్న నిన్ను
ఊరంతా వెతుకుతున్నాను ... 

విరహం తొలగి
నిరీక్షణ కరిగి
నిన్ను చూసే ఒక్క క్షణం కోసం
లక్షల యేళ్ళుగా  వెతుకుతున్నాను   

Wednesday, 7 December 2011

నా మొదటి శతకం - కొన్ని పద్యాలు

తెలిసె నేఁడు నాకు తెలుగులో మాధుర్య
మందమైన భావమంకురింప
తెలుగు తరచి చూడఁ దేనె ధారలు జారు
చక్రి పలుకు వినుఁడు సత్య వాక్కు

అంబరంబునంటు హర్మ్యాళి  నిర్మించె
విశ్వమంత నిలిచి విస్తుబోవ
మనిషి మింటికేగె మరిచి తన భువిని
చక్రి పలుకు వినుఁడు సత్య వాక్కు

వింతగొలుపుఁ జూడ విత్తు మొలచు తీరు
నెదుగు నేల గుణముకెదురు నిలిచి
స్థితులు గతులు వెతలు స్థిరచిత్తునాపునే ?
 చక్రి పలుకు వినుఁడు సత్య వాక్కు

తాతలిడిన  యాస్తి తమగొప్పగన్ జూపి
విర్రవీగు చుంద్రు వింత గాను
తెలిసికొనఁగవారు తెలివైన సోమరుల్
చక్రి పలుకు వినుఁడు సత్య వాక్కు

కులము పేర ఖలులు కూడఁగట్టు బలిమి
మానవత్మమెదుట మనఁగఁబోదు
తిమిరచయము తొలఁగు దినకరద్యుతి సోక
చక్రి పలుకు వినుఁడు సత్య వాక్కు 

Wednesday, 23 November 2011

ఎదురీత..


దుడుకు అడుగుల శిశిర గాడ్పులకి ,
తల్లి ఒడి నుండి వేరు పడి ..
కొండలనకా , గుట్టలనకా ...
పిల్లగాలులతో కలిసి తిరిగి ....
దుమ్ము ధూళిలో కలిసిపోయి ,
వేల అలజడుల బరువు మోసి,
వేల అడుగుల కింద నలిగి ,
ఇల్లుని విడిచి , తల్లిని మరిచి
ఒక నిర్జీవ కుడ్యపు సన్నని బీటలో చేరి
సేదతీరింది ఒక చిన్ని విత్తనం.


హితులు కరువై , భవిత బరువై
బ్రతికే దారిని ,
ఆ బీటలో పరుచుకున్న నిశీధిలో వెతుక్కుంటూ ..
చిట్టి చేతులతో ఆ గట్టి గోడను
తవ్వుకుంటూ ...
సాగిపోతున్న ఆ విత్తుని
హత్తుకుంది
ఒక ఉదయపు అనాధ మంచుకణం.  


బ్రతుకు దొరికింది ..
భవిత నిలిచింది ...
వెతుక్కుంటూ ఒక సూర్య కిరణం
ఆ విత్తనాన్ని పలకరించింది ...
కలిసిరాని కాలంతోనే సాగుతూ
వెక్కిరించిన విధినీడనే  మెలుగుతూ , వెలుగుతూ
కొన్నాళ్ళకి ..
గుండెలేని ఆ గోడ పైన
పచ్చని హరితం , వసంతాన్ని స్వాగతించింది .. 

Tuesday, 22 November 2011

రిక్త హస్తాలతో...

నాకు నచ్చిన ముళ్ళ దారిని వదిలి ..
నలుగురూ నడిచే రాజ మార్గం లో అడుగులు వేసాను ..
దారి అనువుగా ఉందో లేదో చూసానే గాని ..
గమ్యం చేరుస్తుందో లేదో అడగడం మరిచాను ..

సాటివారి పై బురదజల్లాలని ..
ఆలోచిస్తూ కాలం గడిపాను ..
వాళ్ళని తిట్టే తాపత్రయంలో ..
నా చేతులకి  నేనే బురద చేసుకున్నాను ...

మళ్ళీ ఎదగమని నువ్వు ఇచ్చిన ..
ఎన్నో ఉదయాలని వ్యర్ధం చేసుకుని ...
మళ్ళి బ్రతకమని నువ్వు విదిల్చిన ..
ఎన్నో ఊపిరులని గాలికి వదిలేసి ..
రిక్త హస్తాలతో నీ ముంగిట..
యాచిస్తూ నిలిచున్నాను ..

కొత్త ఉదయం ప్రసాదించమని ..
కాస్త ఇంగితం ప్రచోదించమని .కాపీరైట్@కళ్యాణ్  2011

Wednesday, 2 November 2011

ఆత్మవిశ్వాసం

ఎదురొచ్చే కష్టాలని ,
ఎదిరించడంలోనే ఉంది విజయం ...
కదిలొచ్చే  కెరటాలని
చీల్చుకుంటూ పోయేదే పయనం ...కలిసి రాని కాలపు బలాన్ని తిట్టుకుంటూ వదిలేస్తామా ?
నిబ్బరంగా సంకల్పంతో తట్టుకుని నిలబడలేమా ?


వెన్నుచూపే వారిని , వారి నీడకూడ వెక్కిరిస్తుంది  ...
నిన్ను నువ్వే నమ్ముకుంటే , ఆ మిన్ను కూడా వంగి వస్తుంది ...

సమస్యల చీకటి లో ఇంక కన్నీరు తో మిగిలిపోదామా?
గెలుపనే వెలుతురు వెతుకుతూ , చిరునవ్వుతో సాగలేమా ?

Saturday, 29 October 2011

అవ్యక్తం

ఒక ఉదయం,


అటూ ఇటూ విచే అల్లరి గాలులకి,ఎగురుతూ సాగుతూన్న ఒక యెండుటాకు ,'చిటపటా' చప్పుడు చేసుకుంటూ , ఒక వృద్ధ వృక్షపు నీడలోకి వచ్చి ఆగింది ... ఒక సారి ఆ చెట్టుని ఎగా దిగా చూసి ఎదో గుర్తుకుతెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది ..


' మసక బారిన ఙ్ఞాపకాల గదుల్లారా !
  మరుపు నిండిన నా మస్తిష్కపు పొరల్లారా !
   ఏదో తెలియని అభిమానం ,
   ఈ నీడన నాలో చిగురిస్తోంది  
   ఎన్నో ఏళ్ళ ఒక పరిచయం ,
   మళ్ళీ ఇక్కడ పలకరిస్తోంది .
ఎక్కడిదర్రా , ఈ మధుర గానం , ఇంకా ఎదలో మోగుతోంది ..
ఎప్పటిదర్రా , ఈ  పులకింతల పరిచయం  , తలపుల్లో ఇంకా మెదులుతోంది ? '


అని ప్రశ్నించింది .. అది విని ఆ చెట్టుకి ఉన్న ఆకులు గల గలా నవ్వాయి , 'ఈ ముసలి ఆకుకి రాలిపొయినా ఇంకా మతిమరుపు పోలేదు ' అని కొన్ని పిల్ల గాలులు తమలో తాము  గుసగుసలాడుకున్నాయి .. అది విని ఆ ముసలి ఆకు మనసులో మొలిచిన చిన్న పౌరుషపు తాకిడికి తన స్వరం కాస్త హెచ్చించి ఇలా అంది ..
' నవ్వులాటలే  మీకు పిల్ల గాలుల్లారా ,
 దుడుకు నవ్వులే మీకు కొత్త ఆకుల్లారా ?
 ఉడుకు రక్తపు దుడుకు , ప్రాయముడుగినప్పుడు ఉండబోదు
 నేటి మీ సూర్యోదయం , నా రేపటి సంధ్య ముందు నిలువబోదు
అప్పుడు మీ బోసినోళ్ళతో వెర్రి నవ్వులు  నవ్వుదురులే
ఆనాడు మీ పలుకుల వాడి ఎంతో నేనూ చూస్తానులే '


అని ఉక్రోషంగా పలికింది , ఆ పలుకులకి నొచ్చుకుని కొన్ని పిల్లగాలులు గట్టిగా వీచాయి , ఆ గాలికి , చెట్టు నుంచి మరొక ఆకు రాలి ,కింద ఈ ఆకు పక్కనే పడింది , పడీ పడగానే తన నేస్తమైన ఈ ఎండుటాకుని చూసి ఆనందంతో హత్తుకుంది ,  


'  బాధల కెరటాలు , సంతోషపు ముత్యాలు
   గంభీరంగా మోసే కడలే ఈ కాలం
  కలిసీ కలువని  భూమీ ఆకాశపు 
  సరిహద్దు రాజ్యమే ఈ కాలం
ఆయువయ్యిందని , ఊపిరాగిందని , రాలిపొయిన నా మనసుకు
మరునిముషం లోనే నిన్ను చూపించి చిగురింపజేసింది ఈ కాలం  '


అని మురిసిపోతూ తను ఎవ్వరో ఆ ఎండుటాకుకి ఙ్ఞాపకం చేసింది , దూరంగా ఎప్పుడో తను రాలిపొయినప్పుడు ఏర్పడిన గుర్తుని చూపించింది .అప్పుడు గుర్తొచింది ఆ ముసలికి , అది తన ఇల్లని , ఆ చెట్టు తన అమ్మని ... తను రాలిపోయినా  ఇంకా తను వదిలి వెళ్ళిన గుర్తులని మోస్తున్న తన తల్లి ని చూసి ..
'గుండె తడి అయినా
మనసు చెమ్మగిల్లినా
చుక్క కన్నీరయినా మిగలని
అలసిపొయిన ఎండుటాకుని  '


అని బాధ పడుతూంటే , చెట్టు మీదున్న మంచు కరిగి , ఆ తల్లి వృక్షపు కన్నీటి బిందువై ఆ ఎండుటాకుని తడిపింది ..

Thursday, 27 October 2011

నా (పగటి)కలల సుందరికి ..

(సినెమాలు చుస్తూ , ఎవేవో ఊహించుకుంటూ పగటి కలలు కనే , ఆ అమాయకత్వం , కాలక్రమేణా కనుమరుగవుతుంది , కాని ఆ ఙ్ఞాపకాలు మాత్రం మిగిలిపొతాయి ..  )కలవై కనులకు కనిపించావు
చిరునగవై పెదవికి పరిచయమయ్యావు


ఊహల అలపై ఊయలలూపి
కొత్త తీరాలని మనసుకి చూపి


ఏ ఆవిరి తెరల మాటుకు మాయమయ్యావు?
ఒక మంచుశిల్పానివై మిగిలిపొయావు ..


పగటికలల నీ ధ్యానం లో , నా ప్రాయం
మధుర ఙ్ఞాపకమై మిగిలిపొయింది
పరిణితి అనే మౌనంలో , నా కర్తవ్యం
ఒక చేదు నిజంగా ఎగసి వచ్చింది .

ఒక రైతు కథ

తూర్పు తెల్లవారుతుండగా , గూళ్లలోని పక్షిపిల్లల సవ్వడులు పల్లెలో పరుచుకుంటూ , తెల్లవారిందని అందరికీ తెలియచేస్తూ ఉండగా , పెద్ద కరణం గారి ఇంటి సందుకి ఆనుకుని ఉన్న చిన్న బురద దారి గుండా సాగుతున్నాయి రాములు అడుగులు ...


'ఏరా రాముడూ , పొలానికా ? '
 ఏదో పరధ్యానం లో ఉన్న రాములుని ,అప్పుడే నిద్ర లేచి , చెంబు పట్టుకుని ఎదురు వస్తూ పలకరించాడు సూరి .
నోటితో ఏమీ చెప్పకుండానే అవునన్నట్టు తలూపాడు రాములు.


'ఏంటీడు , ఇలా ఉన్నాడు ?' అని మనసులో అనుకుంటూనే ,'మనకెందుకులే ఈ సమయంలో ' అనుకుని వడి వడి గా ముందుకు వెళ్ళిపొయాడు సూరి.


దూరంగా రామాలయం మైకు నుంచి పూజరి గారి వేద పాఠం వినపడుతోంది , ఆ మంత్రాలేంటో  అర్ధంకాకపోయినా , చిన్నప్పటినుంచి ఉన్న అలవాటు వల్ల చేతులు అప్రయత్నంగానే అటువైపు తిరిగి నమస్కారం పెట్టాయి , కళ్ళు ముసుకుని 'జై శ్రీరాం ' అనుకుని మళ్ళీ  తన నడక కొనసాగిస్తున్నడు  రాముడు.


కొద్దిగా ముందుకు సాగగానే , ఆ మంత్రాల మహిమ వల్లనేమో , తప్పుచేస్తున్న భావం మొలకెత్తింది రాముడిలో , నెమ్మదిగా ఙ్ఞాపకాలు దొంతరలుగా కళ్ళ ముందు కదలాడసాగాయి ...


చిన్నపుడు ఇలాగే తెల్లవారుతుండాగానే , తన తండ్రి  తనని పొలానికి తీసుకువెళ్ళేవాడు . దారిలో రాముడి గుడి ముందు ఆగి ఒక దణ్ణం పెట్టి , సన్నగ తనలో తాను ఒక పాత పాట పాడుకుంటూ , మధ్య మధ్యలో తన పంచె బొడ్దు లో దాచుకున్న చుట్టల్ని తడుముకుంటూ  , వచ్చేపోయేవాళ్ళని  మనసారా పలకరిస్తూ , వడివడిగా పెద్ద పెద్ద అంగలేస్తూ సాగిపొతున్న తన కన్నతండ్రి  , తన కళ్ళముందు ఇప్పటికీ కదలాడుతూనే ఉన్నాడు . ఎంత కష్టమైనా నవ్వుతూ  ధైర్యంగా ఎదుర్కొన్న తన తండ్రిని గుర్తుచేసుకుంటూంటే కొంచెం గర్వం , కొంచెం బాధ కలిగాయి రాములుకి .


అలా ఙ్ఞాపకాలని  నెమరువేసుకుంటూ  నాలుగు అడుగులు ముందుకు వేయగానే , పూజరిగారి ఇంటి ముందు కళ్ళాపు జల్లుతున్న పనిమనిషి కనపడింది .


వెంటనే తన తల్లి గుర్తుకు వచ్చింది. తెల్లవారకుండానే బయల్దేరి నాలుగిళ్ళల్లో పాచిపని చేసి , వాళ్ళ ఇంటెడు  సామాన్లూ తోమి ,బట్టలు ఉతికి , మళ్ళీ వెనక్కి వచ్చి తన తండ్రికి చద్దన్నంలో ఉల్లిపాయముక్క , ఒక పచ్చిమిరపకాయ పెట్టి  , అది తిని పొలానికి బయల్దేరుతున్న తన తండ్రిని గుమ్మంవరకూ వచ్చి సాగనంపే ముత్తైదువు తన తల్లి , అలసట అన్నది ఎన్నడూ మొహం లో చూపించని తన తల్లిని తలుచుకుంటూంటే అప్రయత్నంగా కళ్ళమ్మట నీళ్ళు తిరిగాయి రాములుకి .
మనసులో తప్పు చేస్తున్న ఆలోచనలు మళ్ళీ లేచాయి . గట్టిగా తన తువ్వాలు చాటూన దాచిన పురుగులమందుని అదిమిపట్టుకున్నాడు.


'మధ్యాహ్నం త్వరగా రండి ,ఈ రోజు ' అన్నం ' వండుతున్నాను ' తన భార్య తనతో ఇందాక పొలానికి బయల్దేరే ముందు అన్నమాటలు గుర్తుకొచ్చాయి . చాల రోజుల తర్వాత తన ఇంటిలో 'అన్నం ' వండబడుతోంది , అది కూడ తన భార్య వంటి మీద ఉన్న ఆఖరి బంగారపు గాజు అమ్మిన డబ్బుతో .


'పొలానికి తీసుకున్న అప్పు , వారం లో కట్టకపోతే పొలాన్ని జప్తు చేస్తాం ' అని వారం క్రితం బ్యాంక్ వారి మాటలు కూడా గుర్తుకొచ్చాయి.


భారంగా నడుస్తున్న రాములుకి దూరంగా తన పొలం కనపడుతోంది .


నిట్టురుస్తూనే తన పొలం చేరుకుని , బీటలు తీసిన తన పొలం మధ్యలో కూర్చున్నాడు . ఎన్నో ఆలోచనలతో మనసంతా గందరగోళంగా ఉంది . అప్పటివరకు దాచిన పురుగులమందుని తీసి పక్కనపెట్టి , 'ఎప్పుడు తాగాలా ?' అని ఆలోచిస్తూ మళ్ళీ తన గతంలోకి వెళ్ళిపొయాడు .
తన పొలం పక్కనే ఉన్న అయిదు ఎకరాల యజమాని , తన ప్రాణ స్నేహితుడి ఆఖరి మాటలు గుర్తుకొచ్చాయి ..
' ఓడిపోయాను రా రాముడూ ! నేలని నమ్ముకుని బ్రతుకుతున్న  మనకి , నమ్మి కొలిచిన దేవుడూ  , నమ్మి ఓటేసిన నేతలూ , ఎవ్వరూ నీళ్ళివ్వలేదు . నీళ్ళైతే దొరకలేదు గాని , పురుగులమందు మటుకు అప్పు మీద దొరికింది . నేను చేతకానివాడ్నే గాని, పిరికివాడిని అని మాత్రం అనుకోవద్దు  ' అని రాసి పంటకోసమని కొన్న పురుగులమందు తాగిన తన స్నేహితుడు గుర్తుకొచ్చాడు .


గత ఎన్నికలలో ' మీ నీళ్ళకోసం నా ప్రాణలైనా ఇస్తా ' అని ప్రతిఙ్ఞ చేసిన ఎమ్మెల్యే గుర్తుకొచ్చాడు .


వందలకొద్దీ ఆత్మహత్యలు చేసుకున్న తన లాంటి సన్నకారు రైతులు గుర్తుకొచ్చారు , ఆవేశం , ఆక్రోశం , అసహాయత ఇలా భిన్నమైన భావాల మధ్య భార్య  'అన్నం ' వంట ఙ్ఞాపకం వచ్చింది .


ఆఖరిసారి అన్నం తిని చచ్చిపోదామనిపించి , పురుగులమందుని మళ్ళీ జాగ్రత్తగా తువ్వాలు వెనక దాచి , నెమ్మదిగా ఇంటివైపుకి నడక సాగించాడు ..


అలా తన ఇంటి దరిదాపులలోకి చేరుకున్నాకా , ఆమడ దూరం లో ఏదో ఆగి ఉన్న కారు గమనించాడు.
ఎవరో పెద్దవాళ్ళు , తన చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడుతున్నారు , ఎవో కాగితాలు , ఫైళ్ళు పట్టుకుని ఉన్నారు వాళ్ళు .


'ఏమి జరుగుతోందో ' అని కుతూహలం ఉన్నా ,' మనకెందుకులే ' అని సర్దిచెప్పుకుని , తన ఇంటికి వెళ్ళి భోజనం పెట్టమని భార్యకి  చెప్పి , కాళ్ళూ చేతులూ కడుక్కుని  కంచం ముందు కూర్చున్నాడు . భార్య చూడకుండా పురుగులమందు కొంచం పప్పులో కలిపి తాను వేసుకుని , తను లేకపొతే తన భార్య అనాధ అయిపొతుందని కొంత తన భార్య కి కూడా వేసి , తృప్తి గా కడుపారా తిని భుక్తాయసం తో ఆరుబయటకి వచ్చి కూర్చున్నాడు రాముడు .


నిత్యం ఎదో పాటలు పాడుతూ పని చేసే తన భార్య ,వంటింటిలోకి వెళ్ళి , అరగంట అయినా ఏమీ శబ్దం చేయకపోయేసరికి  'మందు పని చేస్తోందేమొ ' అని ఆనందపడుతున్న రాముడికి  ఎదురుగా ఇద్దరు పెద్దమనుషులు నిలుచున్నట్లు కనపడ్డారు ... చూపు నెమ్మదిగా మసక బారుతోంది ...  ఆఖరి క్షణాలు వస్తున్నట్టు తెలుస్తోంది ... ఇంతలో ఆ పెద్దమనుషుల్లో ఒకరు ..


' ఇక్కడ ప్రభుత్వం ఒక శెజ్  కట్టడానికి పర్మిషన్ ఇచ్చింది , కాబట్టి మీ భూమి ప్రభుత్వ ధరల ప్రకారం మేము కొంటాం , ఇంకా మీకు ఒక ఉద్యోగం కూడా ఇప్పిస్తాం ..'' అంటూ ఇంకా చెప్పబోతున్నవాళ్ళకి  ఎదురుగా కుప్పకూలిపోతూ  , చిద్విలాసంగా ఆఖరిసారి చిరునవ్వు నవ్వుతూ కనపడ్డాడు రాముడు.


ఊరు మూగపొయింది .


మరొక సారి సూర్యుడు భారంగా అస్తమించాడు.
.........
............
...............
.................


కొసమెరుపు :-  పట్నం లో ఉన్న పెద్దాసుపత్రి లో మెల్లగ కళ్ళు తెరిచాడు రాముడు , పక్కనే ఉన్న మంచం మీద ఉంది తన భార్య , అప్పుడప్పుడే తను కూడా కళ్ళు తెరుస్తోంది. తన పక్కనే నుంచుని ఉన్న సూరిగాడు , కళ్ళనీళ్ళతో రాముడి పక్కకు వచ్చి , చడామడా నాలుగు తిట్టి  , కొట్టినంత పనిచేసి , ఇంకెప్పుడూ ఇలాంటి వెధవ పని తలపెట్టనని వొట్టు పెట్టించుకున్నాడు.    తన పొలం కొనడానికి వచ్చిన ఆఫీసర్లే తనని కారు లో తీసుకొచ్చి ఆసుపత్రి లో చేర్పించారని చెప్పాడు .


'మరి ఆ పురుగులమందు ?' అని రాముడు అమాయకంగా అడిగాడు ..


'నీ అదృష్టం  , అది కల్తీ మందు ..., పంటకే కాదు మనుషులకి కూడ పనిచెయ్యదు ' చెప్పాడు సూరి.

Saturday, 25 June 2011

ఆడపిల్ల

వేసవి సెలవలు అయిపోవచ్చాయి ... ఇన్నాళ్ళు గా తన ప్రతాపం చూపించిన సూర్యుడు కొన్నాళ్ళు సేద తీరుదాం అని మబ్బుల చాటుకి మెల్లి మెల్లి గా , రోజుకొక మబ్బు వెనుకగా జారుకుంటున్నడు...

అప్పుడప్పుడే పురుడు పోసుకుంటున్న వాన చినుకులు తమతో పాటు కాంతమ్మ గారింట ఒక శుభవార్త మోసుకొచ్చాయి ... ఆవిడ కూతురు రాజ్యలక్ష్మి నెలతప్పింది , కాంతమ్మ గారి మొదటిమనవడు బుడుగు గాడికి ఒక చిట్టి చెల్లెలో / తమ్ముడో పుట్టబోతున్నారని ..
 
రోజూ బంధువులందరి దగ్గర నుండీ ఫోనులు వస్తున్నాయి ... బుడుగు గాడి అమ్మమ్మ,తాతయ్య వాళ్ళ పల్లెటూరు నుంచి బొబ్బట్లూ , జంతికలూ , సున్నుండలూ చేయించి కూతురుకి ఇష్టం అని తీసుకొచ్చారు , అందరూ ఎంతో సంతోషంగా రాజ్యలక్ష్మిని ఆప్యాయంగా చూసుకుంటూ మురిసిపోతున్నారు ..వానలు , బంధువులూ చెప్పిరావన్నట్టు , ఈ వానలతో పాటు చాల యేళ్ళుగా అమెరికాలో స్థిరపడ్డ సూర్యం "మావయ్య" కూడా బయల్దేరి వచ్చాడు ... వస్తూ వస్తూ ఈ శుభవార్త విని అమెరికా స్టయిల్లో "కంగ్రాట్స్ సిస్టర్" అంటూ చేతులు ఊపి , తన బావగారైన బుడుగు గాడి నాన్న కేసిచూసి చిన్నగా కన్నుకొట్టి , బుడుగు గాడిని ఎత్తుకుని "ఏరా , నీ తమ్ముడికి ఏం పేరు పెడదాం ?" అని అడిగాడు ..


"నాకు చెల్లెలు పుడుతుంది మామయ్య , మహాలక్ష్మి లాంటి పిల్ల పుడుతుందని బామ్మ చెప్పింది " అని బుడుగుగాడు అమాయకంగా చెప్పాడు.వెంటనే సూర్యం మామయ్య శ్రీకృష్ణుడైపొయి బుడుగుగాడ్ని అర్జునుడిగా చేసేసి , " ఆడపిల్ల శాపం రా , మీ నాన్న అది పుట్టినప్పటి నుండీ దాని ముద్దూ ముచ్చటా తీరిస్తే , చివరికి ఎవర్నో చేసుకుని వెళ్ళిపోతుంది .. దానికి చదువు దండగ , ఇంక అల్లుడి కోర్కెలు తీర్చేసరికి మీ నాన్న పని అంతే , ఇవన్ని నీకర్ధంకావుగాని , గుర్తుంచుకో ఆడపిల్ల కంటే మగవాడు ఎంతో నయం " అని తన ప్రవచనం పూర్తి చెసేసరికి , బుడుగుగాడు యేమీ అర్ధం కాక ఏమి చెయ్యాలో తెలియక వాడి బామ్మ దగ్గరకు పరుగున వెళ్ళి ఆవిడ వళ్ళో కూర్చుని .." ఆడపిల్ల మంచిది కాదంటగదే బామ్మ , మామయ్య అన్నాడు " అని అదిగాడు .. వాడి బామ్మే వాడి యూనివర్సిటీ మరి ..
 
చిన్నపిల్లాడికి ఇలాంటి విషయాలు ఎలా చెబితే అర్దం అవుతుందో ఆవిడకి బాగ తెలుసు .."అది పక్కన పెట్టి , ఒక కథ చెబుతా వింటావ భడవా ?" అని ఆవిడ అడిగింది ..

 
మామయ్య క్లాస్ తో బుర్ర పాడైపొయిన బుడుగు , ఈ కథ ఆఫర్ ఏదోబాగుందని " సరే" అన్నాడు ..


" అనగనగా , ఒక రాజు , ఆయనకి ఒక రాణి , ఆ రాణి గర్భవతి అయ్యింది .. ఆ రాజు సంతోషంగా రాజ్యం అంతా పండగ చేయించాడు ..తొమ్మిది నెలలు ఇట్టే గడిచిపోయాయి ...


ఒక శుభముహూర్తాన రాణికి ఒక ఆడపిల్ల పుట్టింది ..


ఆ పిల్లని బాగా పెంచాడు రాజు , చదువుతో పాటు యుద్ధవిద్యలూ,రాజనీతి అన్ని నేర్పించాడు ..

ఒక మంచి రాజుని చూసి పెళ్ళి కూడా చేసాడు , ఆ ఆడపిల్లకి ఒక పిల్లాడు కూడా పుట్టాడు ... అంతా సంతోషం గా జరుగుతున్న కాలంలో శత్రువులు దండయాత్ర చేసారు ... ఆ పిల్ల భర్త అయిన ఆ రాజ్యం రాజు యుద్దానికి వెళ్ళాడు .. పాపం ఆ పిల్ల ఎంతో భయపడింది .. తన భర్త కోసం ప్రార్ధించింది .. కాని శత్రువులు ఆ భర్తని చంపేసారు " అని అక్కడ ఆపి , " అప్పుడు ఆ ఆడపిల్ల ఏం చెసిందో చెప్పు ?" అని బుడుగుగాడ్ని అడిగింది ..


"అడవిలోకి పారిపోయి , ఎవరో మంత్రగాడిని కలుసుకుంది ... ఆ మంత్రగాడు ఆ పిల్ల కొడుకుని పెద్దచేస్తాడు , మంత్రాలు అవీ నేర్పుతాడు " అంటూ ఒక సోషియో ఫాంటసీ కథ చెప్పాడు వాడు...

"కాదురా .. యుద్దంలో తన భర్త చనిపోతే , ఆ పిల్ల తన కొడుకునీ తన రాజ్యాన్ని రక్షించుకోవటానికి , యుద్దానికి తనే బయల్దేరింది , కొడుకుని వీపుకి చుట్టుకుని , మొదటిసారి కత్తిబట్టి , శత్రువులమీదకి విరుచుకు పడింది , రణరంగం లో సివంగిలా యుద్దం చేసింది , శత్రువులని తరిమికొట్టింది ..." అని చెప్తూంటే బుడుగు గాడు తానే యుద్దంచేస్తున్నంతలా లీనమై వింటున్నాడు ..

 
"ఆ శత్రువులు ఎవరో తెలుసా -- మన దేశాన్ని బానిసలుగా చేసుకున్న బ్రిటీష్ వారు .. ఆ "ఆడపిల్లే" శత్రువులపాలిట సిం హ స్వప్నం -- వీరనారి ఝాన్సీలక్ష్మీ బాయి " అని ముగించి ...


"అది రా నాన్న ఆడపిల్ల అంటే " అని ముగించింది ..

 
వెనకాలే తన కొడుకు ఆ అమెరికా సూర్యం నిలబడి చిన్నగా చప్పట్లు కొడుతూ తన తప్పుని తన దేశపు ఆడపిల్లల గొప్పతనాన్ని వింటూ గర్వంగా నుంచుండిపోయాడు

Tuesday, 21 June 2011

ఎలక్షన్స్ మేస్త్రీ

ఎప్పటిలానే సాయంత్రం చల్లబడేసరికి గట్టు మీదున్న చెట్టు కిందకి చేరుకున్నాడు లింగ రాజు..ఎదురుగా పెద్ద కలకలం , అంతా హడావిడిగా వస్తూపోతూన్న జనాలతో సందడిగా ఉంది గోదారి గట్టు.. పుష్కరాలకి ఏర్పాట్లేమో అనుకుందామంటే మొన్నామధ్యే అయ్యాయి ... సుబ్రహ్మణ్య షష్టి జాతరకి లేదా దీపావళి అమావాసకి ఏర్పాట్లా అంటే అదీకాదు ... " సినేమా వాళ్ళు షూటింగ్ కోసం వచ్చారేమో " అనుకుంటూ ఆత్రంగా ఎదురుగా వచ్చే రంగయ్య తాతని "హీరో ఎవరు " అని అడిగాడు లింగ రాజు ...

 
"అప్పుడే చుక్కేసేసావా" అని విసుక్కుంటూ వెళ్ళిపొయాడు రంగయ్య తాత ...

 
"ఇంకోసారి చుట్టలు తెమ్మని అడుగు చెప్తాను " అని మనసులో అనుకుంటూ .. దూరంగా పోతున్న రత్తమ్మత్త తో .."అత్తో ! హీరోఇన్ వచ్చిందా ?" అని కేకవేసి అడిగాడు ..

 "మీ అమ్మమ్మ వచ్చిందిరా సచ్చినోడా !" అని ఇంకా ఎవోతిట్టి వెళ్ళిపొయింది.. "దీని కూతురిని మొన్న కెలికినది ఇంకా మనసులో పెట్టుకుందేమో " అనుకుంటూ అసలు ఏం జరుగుతోందో సొంతంగా చూద్దామని వెళ్ళాడు లింగరాజు
 

ఎదురుగా ఎత్తైన గద్దెమీద నుంచి సింగరాజు అందరికి ఏవో పురమాయిస్తున్నాడు ...

 
సింగ :- " సోమవారం అందరూ వచ్చేయండి , మర్చిపోకండి , పార్టీ పేరు గుర్తుందిగా .. చప్పట్లు ఎఫ్ఫుడు కొట్టాలో , ఈలలు ఎప్పుడు వేయ్యాలో మనవాళ్ళు చూపిస్తారు మీరు వాళ్ళని ఫాలో అయిపోండి .. బాగా అరిచినవాళ్ళకి సాయంత్రం మందు ఫ్రీ అని పార్టీ వాళ్ళు చెప్పారు , మరి చూసుకోండి ... పసుపు బట్టలు కాదు , తెల్ల బట్టలు వేసుకురండి ... మర్చిపొయి మొన్నట్లా గులాబీ రంగు వేసుకొచ్చేరు , అది ఇప్పుడు కాదు ముందు ముందు వస్తది " అంటూ ఇంకా ఎవేవో చెప్తున్నాడూ


లింగరాజు ఈ తతంగం అంతా చూసి , అవాక్కయ్యాడు , కొంచెం తేరుకుని


లింగ :- "ఏమిరా సింగా ! రాజకీయ్యాలలోకి వెళ్ళిపోయావా , ఏం పార్టీ ఏంటి ?" అని వ్యంగ్యం నిండిన స్వరంతో అడిగాడు


సింగ :- "ఏడవకు రా , నేనేమీ రాజకీయ్యాలలోకి వెళ్ళలే ! అయినా అక్కడ మన లాంటివాళ్ళకి చోటు లేదు .. అన్నీ నాయకులూ , వారి బంధువులూ పంచేసుకున్నారు
 
లింగ :- " అయితే ఇదంతా?"


సింగ :- "వ్యాపారం , నేను మేస్త్రీని వాళ్ళు కూలీలు , వ్యత్యాసమల్లా మేము ఇల్లు కట్టము , "జై జై" లు కొడతాం అంతే ,నాయకుడెవడో మాకు అనవసరం , డబ్బులిస్తే జై కొడతాం , ఇంకా ఎక్కువిస్తే వాడ్ని ఊరంతా తిప్పుతాం ... పనికి డబ్బు తీసుకునే ప్రొఫెషనల్ అభిమానులం "


లింగ :- "బాగుందిరా నీ యాపారం ! మరి ఓటు కూడా అలానే వేస్తారా ? మీలాంటి వాళ్ళ వల్లే ఇలాంటి నాయకులు తయారవుతున్నారు.."


సింగ:- " అంతలేదురో ! 65 % ఓట్లు పోల్ అయితే అవన్ని మేము వేసేవే .. వెయ్యనిదల్లా చదువుకున్న ప్రబుద్దులేTuesday, 10 May 2011

పయనం

ఏ ఎండ మావులకై అర్రులుచాస్తున్నావు

ఏ శూన్యరాగాలకి నీ గొంతు అరువిచ్చావు

ఏ గాఢచీకట్లకి నీ ఉదయం అమ్ముకుంటున్నావు

ఏ వ్యర్ధవాదనలకి నీ కాలం వెచ్చిస్తున్నావు


లెక్కలేనన్ని దారుల మధ్య , దిక్కు తోచక తిరుగుతున్నా

ఆ దారులు చేర్చే గమ్యం ఒకటే అని తెలుసుకోలేకున్నావు


భయం సంద్రంలో , ఆకలి కెరటాలపై

అసూయా ద్వేషం అను జంట నావలతో

సాగిపొయే నిత్యాన్వేషీ , ఓ మనిషీ

ఎటువైపు నీ పయనం? !!

Monday, 24 January 2011

"స్కాము"రాజ్యం

లింగ :- ఉందిలే మంచి కాలం ముందూ ముందూనా ! స్కాములూ చేసెయ్యొచ్చూ నందా నందానా !

సింగ :- ఎంట్రో ! మంచి హుషారుగా ఉన్నావ్ ? ఆ స్కాములు చేయటం ఏమిటి ?

లింగ :- నీకు ఇంకా తెలీదా ? నేను రాజకీయ్యాల్లోకి వెళ్దామనుకుంటున్నా!

సింగ :- అయితే?

లింగ :- ఇక డబ్బులే డబ్బులూ !

సింగ :- ఏంటి రా నీ వాలకం ? రాజకీయ్యాలకి , డబ్బులకి , స్కాములకి సంబంధం ఏంటి? పవిత్రమైన ప్రజాసేవా పధం లోకి వెళ్తానంటూ , ఈ స్కాములు గోల ఏంటెహై !

లింగ :- ఏ ఊరు రా మీది ? గ్రహాంతరవాసి లా మాట్లాడుతున్నావ్ .. ప్రజా సేవా ! జోకులెయ్యకురో , ఆ పదానికి అర్ధంకూడా తెలీదు మన నాయకులకి ! ఏది దొరికితే దానితో స్కాములు చేసెయ్యటం తప్ప , ఇలాంటి కఠిన పదాలని కనీసం నేర్చుకోనైన నేర్చుకోరు ..

సింగ :- మరి మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు , ఇలాంటి వారందరు కూడా రాజకీయ్యాల్లో ఉండిన వారే గా , వారు మరి కడిగిన ముత్యం లా స్వచ్చంగానే బ్రతికారు గా ?

లింగ :- అందుకే వాళ్ళ విగ్రహాలు గాని , ఫొటోలు గాని మనకి పెద్దగా కనపడవు ఎక్కడా ! జనం కూడ వాళ్ళ పుట్టిన రొజులని పెద్దగా పట్టించుకోరు ! అసలు వారు హిస్టరీ పుస్తకాలలో తప్ప ఇంకెక్కడా మచ్చుక్కైనా కనపడరు

సింగ :- ఆపు నీ వెటకారం ! అలా అయితే మరి గాంధీ గారు అన్ని చోట్ల కనపడతారు , ఆయన మరి మహాత్ముడెలా అయ్యారు ?

లింగ :- నీకింకా అర్ధం కావట్లేదు ! గాంధీ గారు ఇప్పుడు మహాత్ముడో , లేక జాతిపిత గానో కంటే ఒక బ్రాండ్ నేముగా మిగిలిపోయారు .. పేరు చివర తగిలించుకుంటే వారసత్వం గా పదవులు వస్తున్నై , గోడకి తగిలించుకుంటే పవరొస్తోంది ... ఆఖరికి పెన్నులకి ఆయన పేరు పెట్టుకుని లక్షలకి అమ్ముకున్నారు .. అది బాబు నేటి రాజకీయం !

సింగ :- మరి స్కాములంటున్నావ్ , ఎం చేస్తావేంటి ?

లింగ :- అదేరా ఆలొచిస్తున్నా ! గడ్డి తో చెసేసారు, ఆటలతో చెసేసారు , ఆఖరికి కనిపించని తరంగాలతో కూడా కోట్లు దండుకున్నారు . నాకిక మిగిలింది ఎంటో ?