Saturday, 25 June 2011

ఆడపిల్ల

వేసవి సెలవలు అయిపోవచ్చాయి ... ఇన్నాళ్ళు గా తన ప్రతాపం చూపించిన సూర్యుడు కొన్నాళ్ళు సేద తీరుదాం అని మబ్బుల చాటుకి మెల్లి మెల్లి గా , రోజుకొక మబ్బు వెనుకగా జారుకుంటున్నడు...

అప్పుడప్పుడే పురుడు పోసుకుంటున్న వాన చినుకులు తమతో పాటు కాంతమ్మ గారింట ఒక శుభవార్త మోసుకొచ్చాయి ... ఆవిడ కూతురు రాజ్యలక్ష్మి నెలతప్పింది , కాంతమ్మ గారి మొదటిమనవడు బుడుగు గాడికి ఒక చిట్టి చెల్లెలో / తమ్ముడో పుట్టబోతున్నారని ..
 
రోజూ బంధువులందరి దగ్గర నుండీ ఫోనులు వస్తున్నాయి ... బుడుగు గాడి అమ్మమ్మ,తాతయ్య వాళ్ళ పల్లెటూరు నుంచి బొబ్బట్లూ , జంతికలూ , సున్నుండలూ చేయించి కూతురుకి ఇష్టం అని తీసుకొచ్చారు , అందరూ ఎంతో సంతోషంగా రాజ్యలక్ష్మిని ఆప్యాయంగా చూసుకుంటూ మురిసిపోతున్నారు ..



వానలు , బంధువులూ చెప్పిరావన్నట్టు , ఈ వానలతో పాటు చాల యేళ్ళుగా అమెరికాలో స్థిరపడ్డ సూర్యం "మావయ్య" కూడా బయల్దేరి వచ్చాడు ... వస్తూ వస్తూ ఈ శుభవార్త విని అమెరికా స్టయిల్లో "కంగ్రాట్స్ సిస్టర్" అంటూ చేతులు ఊపి , తన బావగారైన బుడుగు గాడి నాన్న కేసిచూసి చిన్నగా కన్నుకొట్టి , బుడుగు గాడిని ఎత్తుకుని "ఏరా , నీ తమ్ముడికి ఏం పేరు పెడదాం ?" అని అడిగాడు ..


"నాకు చెల్లెలు పుడుతుంది మామయ్య , మహాలక్ష్మి లాంటి పిల్ల పుడుతుందని బామ్మ చెప్పింది " అని బుడుగుగాడు అమాయకంగా చెప్పాడు.



వెంటనే సూర్యం మామయ్య శ్రీకృష్ణుడైపొయి బుడుగుగాడ్ని అర్జునుడిగా చేసేసి , " ఆడపిల్ల శాపం రా , మీ నాన్న అది పుట్టినప్పటి నుండీ దాని ముద్దూ ముచ్చటా తీరిస్తే , చివరికి ఎవర్నో చేసుకుని వెళ్ళిపోతుంది .. దానికి చదువు దండగ , ఇంక అల్లుడి కోర్కెలు తీర్చేసరికి మీ నాన్న పని అంతే , ఇవన్ని నీకర్ధంకావుగాని , గుర్తుంచుకో ఆడపిల్ల కంటే మగవాడు ఎంతో నయం " అని తన ప్రవచనం పూర్తి చెసేసరికి , బుడుగుగాడు యేమీ అర్ధం కాక ఏమి చెయ్యాలో తెలియక వాడి బామ్మ దగ్గరకు పరుగున వెళ్ళి ఆవిడ వళ్ళో కూర్చుని .." ఆడపిల్ల మంచిది కాదంటగదే బామ్మ , మామయ్య అన్నాడు " అని అదిగాడు .. వాడి బామ్మే వాడి యూనివర్సిటీ మరి ..
 
చిన్నపిల్లాడికి ఇలాంటి విషయాలు ఎలా చెబితే అర్దం అవుతుందో ఆవిడకి బాగ తెలుసు ..



"అది పక్కన పెట్టి , ఒక కథ చెబుతా వింటావ భడవా ?" అని ఆవిడ అడిగింది ..

 
మామయ్య క్లాస్ తో బుర్ర పాడైపొయిన బుడుగు , ఈ కథ ఆఫర్ ఏదోబాగుందని " సరే" అన్నాడు ..


" అనగనగా , ఒక రాజు , ఆయనకి ఒక రాణి , ఆ రాణి గర్భవతి అయ్యింది .. ఆ రాజు సంతోషంగా రాజ్యం అంతా పండగ చేయించాడు ..తొమ్మిది నెలలు ఇట్టే గడిచిపోయాయి ...


ఒక శుభముహూర్తాన రాణికి ఒక ఆడపిల్ల పుట్టింది ..


ఆ పిల్లని బాగా పెంచాడు రాజు , చదువుతో పాటు యుద్ధవిద్యలూ,రాజనీతి అన్ని నేర్పించాడు ..

ఒక మంచి రాజుని చూసి పెళ్ళి కూడా చేసాడు , ఆ ఆడపిల్లకి ఒక పిల్లాడు కూడా పుట్టాడు ... అంతా సంతోషం గా జరుగుతున్న కాలంలో శత్రువులు దండయాత్ర చేసారు ... ఆ పిల్ల భర్త అయిన ఆ రాజ్యం రాజు యుద్దానికి వెళ్ళాడు .. పాపం ఆ పిల్ల ఎంతో భయపడింది .. తన భర్త కోసం ప్రార్ధించింది .. కాని శత్రువులు ఆ భర్తని చంపేసారు " అని అక్కడ ఆపి , " అప్పుడు ఆ ఆడపిల్ల ఏం చెసిందో చెప్పు ?" అని బుడుగుగాడ్ని అడిగింది ..


"అడవిలోకి పారిపోయి , ఎవరో మంత్రగాడిని కలుసుకుంది ... ఆ మంత్రగాడు ఆ పిల్ల కొడుకుని పెద్దచేస్తాడు , మంత్రాలు అవీ నేర్పుతాడు " అంటూ ఒక సోషియో ఫాంటసీ కథ చెప్పాడు వాడు...

"కాదురా .. యుద్దంలో తన భర్త చనిపోతే , ఆ పిల్ల తన కొడుకునీ తన రాజ్యాన్ని రక్షించుకోవటానికి , యుద్దానికి తనే బయల్దేరింది , కొడుకుని వీపుకి చుట్టుకుని , మొదటిసారి కత్తిబట్టి , శత్రువులమీదకి విరుచుకు పడింది , రణరంగం లో సివంగిలా యుద్దం చేసింది , శత్రువులని తరిమికొట్టింది ..." అని చెప్తూంటే బుడుగు గాడు తానే యుద్దంచేస్తున్నంతలా లీనమై వింటున్నాడు ..

 
"ఆ శత్రువులు ఎవరో తెలుసా -- మన దేశాన్ని బానిసలుగా చేసుకున్న బ్రిటీష్ వారు .. ఆ "ఆడపిల్లే" శత్రువులపాలిట సిం హ స్వప్నం -- వీరనారి ఝాన్సీలక్ష్మీ బాయి " అని ముగించి ...


"అది రా నాన్న ఆడపిల్ల అంటే " అని ముగించింది ..

 
వెనకాలే తన కొడుకు ఆ అమెరికా సూర్యం నిలబడి చిన్నగా చప్పట్లు కొడుతూ తన తప్పుని తన దేశపు ఆడపిల్లల గొప్పతనాన్ని వింటూ గర్వంగా నుంచుండిపోయాడు

No comments:

Post a Comment