Thursday 24 September 2015

సింగరాజు - లింగరాజు : మేధావుల సదస్సు ఇన్ విదేశం


ఎప్పటిలాగే చుట్టల కోసం బజారులో అప్పన్న కొట్టుకి వచ్చిన మన లింగరాజుకి , 

దూరంగా విజయవిహార్ సెంటరులో మెరిసిపొతూన్న ఫ్లెక్సీ కనపడింది ...

దేన్నీ పట్టించుకోని మన లింగరాజు , ఆ ప్లెక్సీ చూసి బెంబేలెత్తిపోయాడు .. దాని మీద విషయం అలాంటిది మరి

" ప్రపంచ సమస్యలకి సమాధానం వెతికే సదస్సు కి , 
  ఇక్కడ ఉన్న అన్ని సమస్యలు వదిలేసి , 
  స్వతహాగా మేధావి కాబట్టి 
  ఆహ్వానం లేకపోయినా విదేశం వెళ్ళిన సింగరాజు గారికి అభినందనలతో ...
                                   సింగరాజు ఫ్యాన్స్ ( భజన ) సంఘం .. "  

అని ఉదయించే సూర్యుడి బొమ్మ , గాంధీ గారి , పోరాట యోధుడు 'చే' గారి బొమ్మల మధ్య , మాసిన చిరుగడ్డం తో  దీర్ఘంగా ఆలోచిస్తున్న సింగరాజు బొమ్మ ..

గోదారి గట్టు దాటి ఎప్పుడూ ప్రక్క జిల్లాకి కూడా వెళ్లని వీడు విదేశమేంటో అని సింగరాజు ఇంటికి హడావిడి గా బయల్దేరాడు లింగరాజు 

రామాలయం దాటి , మసీదు వీధి లోకి రాగానే అక్కడ ఇంకో ప్లెక్సీ ..  

" విదేశాల్లో సాగు పద్ధతులు అధ్యయనం చెయ్యడం కోసం వెళ్ళిన మన రైతుజన బంధు సింగరాజు , వర్ధిల్లాలి ...
                                    ఇట్లు సింగరాజు రైతుయూత్ "

ఇందాక ప్రపంచ సమస్యలన్నాడు .. ఇప్పుడేమో రైతు , సాగు అంటున్నడు ... మా చెడ్డ తికమక గాడెహై అనుకుంటూ ఈ గందరగోళం అంతు చూద్దామని నడక వేగం పెంచాడు 

అలా లక్ష్మీ టాకీసు మలుపు తిరిగాడో లేదో ...

అప్పాయమ్మ గారి ఇంటి గోడ మీద , 
                           పిడకల మధ్య , 
నెత్తి మీద యెర్రటి తలపాగా చుట్టుకుని పగటివేషగాడి మల్లే నవ్వుతున్న సింగరాజు గారి చిత్రరాజం దర్శనమిచ్చింది ... అదే పోష్టరు మీద ఇంకా ఇలా రాసి ఉంది ..

"విద్యార్ధుల సామాజిక న్యాయం కోసం , విదేశాల్లో ధర్నా చేయడానికి వెళ్ళిన భారతఛాత్రమిత్ర సింగరాజు జిందాబాద్"

ఈ ఛాత్ర ఏంటో , విదేశాల్లో ధర్నా ఏంటో ... వీడు వీడి తింగరి ప్రచారం అనుకుంటూ , అసలు కారణం ఏంటబ్బా అని అలోచిస్తూ వెళ్తున్న లింగరాజుకి , సింగరాజు భార్య కనపడింది ...

లింగ : చెల్లాయ్  , ఏంటమ్మా వీడు ? ఊరంతా ఈ పోష్టర్లు ఎంటి , ఈ ప్రచారం ఏంటి ? 
          మేధావి అని వేయించుకుంటూ వాడి మూర్ఖత్వం ప్రదర్శించుకుంటున్నాడు .... ఛాత్రమిత్ర అంట .... 
           వీడు పదవ తరగతి పది సార్లు తప్పింది మర్చిపోయాడా ?

సింగ భార్య : నీకు తెలియనిదా అన్నయ్యా... 
                 మొన్న జరిగిన ఊరి ప్రెసిడెంటు ఎన్నికలలో , ఓడిపోయిన సూరిబాబు ,
                 ఈయన తింగరి ప్రచారం వల్లే ఓడిపోయాడు అని అర్ధమయ్యిన అధిష్టానం ...
                ఈయన కనపడితే బడితపూజ చెయ్యడానికి ఉత్తర్వులు జారీ చేసింది ... 
                అందుకే కొనాళ్ళు అజ్ఞాత వాసం చెయ్యాలని ఇలా విదేశమనే విరాటపర్వం మొదలుపెట్టాడు 

లింగ : బావుందమ్మా ! మీ ఆయన కాబట్టి, తప్పదు కాబట్టి అజ్ఞాతవాసం ,విరాటపర్వం , అని వెనకేసుకొస్తున్నావు  ... వీడు నర్తనశాల సినెమా లో ఉత్తరకుమారుడికన్నా  పెద్ద పలాయనవాది .. ఇంతకీ ఎక్కడ చచ్చాడు వీడు ?

సింగ భార్య : మా ఇంటి వెనకాల గొడ్ల చావిడిలో తాత్కాలిక సిబిరం ఏర్పాటు చేసుకున్నారు ...

లింగ : పాపమమ్మా వెర్రి గొడ్లు .. వీడి పిచ్చి వాగుడు వినలేక పాలు ఇవ్వటం కూడా మానేస్తాయేమో చుసుకో

  అంటూ , ఆ సూరిబాబుకి కనపడితే, సింగరాజు మిత్రుడినని తనని ఎక్కడ వాయించేస్తాడో , అనుకుంటూ వడివడి గా ఇంటికి తిరుగుముఖం పట్టాడు 






Thursday 17 September 2015

కృష్ణ భక్తుడనెడి కీర్తి నిజము


ఆ||  

శ్రీధర చరణాబ్జ సేవ సద్భాగ్యము.
మాధవజన కూర్మి మనెడి ధనము.
పార్ధహితుని గూర్చిపాడు జిహ్వ స్థిరము.
కృష్ణ భక్తుడనెడి కీర్తి నిజము



          మాధవుడి చరణాలనే పద్మాలని సేవించుకోవటం భాగ్యాల్లోకెల్లా మా మంచి భాగ్యం
          ఆయన జనాలుతో చేసే స్నేహమే ఎల్లప్పుడూ ఉండే ( మన్నే ) ధనం
          అర్జున హితుని గురించి పాడుకునే పదములే ( నాలుకలే ) స్థిరము 

           అందుకే కృష్ణ భక్తుడనెడి కీర్తి నిజము




సీస || 

పాపచయము దాటి ప్రారబ్ధముల దాటి
మోహమాయను దాటి ముదిమి దాటి

బుధుల మెప్పును దాటి పుడమి సంపద దాటి
సుజనసంగముదెచ్చు శోభ దాటి

షడరిబంధము దాటి సకలసిద్ధుల దాటి
కాలవ్యవధి దాటి కర్మదాటి 

సర్వసాక్షిగ మారి సర్వేశునిజపాద 
ధ్యానజనిత యాత్మజ్ఞాన ధను(కి 

బిరుదులేవి నెరపు పెద్దసత్కారంబు
భూషలేవి దెచ్చు భూరిసొగసు
సర్వ వర్జితునకు శాశ్వతాభరణము 
కృష్ణ భక్తుడనెడి కీర్తి నిజము 


              పాపాలూ , కష్టాలూ , మోహాలూ , ముసలితనాలూ , 
              బుధుల మెప్పు ( గొప్ప వారి మెప్పు ) , భూమి మీద సంపద
              సుజనసంగము ( మంచి వారి జట్టు )
              షడరిబంధము ( కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాల బంధం ) 
              సిద్ధులు , కర్మ , కాలము ...
              ఇవన్నీ దాటుకుని  వచ్చిన యోగికి సరైన ఆభరణం వంటి పేరు కృష్ణ భక్తుడని ...


తప్పులన్నీ నావి ... దయ మా కృష్ణుడిది
అదన్నమాట మరి .....మళ్లీ కలుద్దాం

Friday 11 September 2015

రైతు వధ





చం ||

నిరతపు వహ్నియై రుణము నీ హృదయాంతరమున్ దహింప, సు
స్థిరముగ వర్షలేమి జన జీవ వనంబు దహించుచుండ నా
వరుణుడు రాడు తాపఝరి పంటల నంతము చేయ , రైతు సో
దర ! కను జారు నీరునిక దాచు క్షుధార్తిని దీర్చు నద్దియే


"నిరతపు వహ్నియై రుణము నీ హృదయాంతరమున్ దహింప" == చేసిన అప్పు నిత్యమూ మనసులో మంటగా మారి కాలుస్తూ,
"సుస్థిరముగ వర్షలేమి జన జీవ వనంబు దహించుచుండ" == ఏది స్థిరంగా ఉన్నా లేకపోయినా వర్షలేమి మాత్రం స్థిరంగా , జనారణ్యాన్ని కాలుస్తూంటే
"వరుణుడు రాడు తాపఝరి పంటల నంతము చేయ" == వర్షం రాదు , వేడి ఇంకొకపక్క వేసిన విత్తులని చంపేస్తూ
" క్షుధార్తిని " == ఆకలి

జూలై ఆగష్టులలో వర్షాలు పడాలి , కాని పడవు...
వ్యవ'సాయా'న్ని నమ్ముకుని బ్రతకాల్సిన రైతులు , ప్రభుత్వ 'సాయా'న్ని అర్ధిస్తూ ...
విత్తనాలని పురుగుమందులని అప్పులు చేసిన రైతులు అప్పు ఎలా కట్టాలో తెలియక ఆత్మహత్యలని ఆశ్రయిస్తున్నారు.
అన్నదాతలే అన్నార్తులై , తాము దున్నిన పొలాల్లోనే కూర్చుని పురుగుమందులు తాగి చచ్చిపోతున్నారు

ఇది ఈరోజు కొత్తగా మొదలైంది కాదు..

ఒక దశాబ్దానికి పూర్వం నుంచే అన్నదాతలు బలవన్మరణాలకి పాల్పడుతున్నారు .. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ( తెలంగాణ తో కలిపి ) , మహారాష్ట్రలో ఎక్కువ మంది ..

2004 లో 18,241 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు
2010 లో 15,963 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు
2011 లో 14,207 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు
2012 లో 13,754 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు  ( Source : wikipedia )

1995 నుంచి మహారాష్ట్రలో రోజుకి పది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ( National Crime Records Bureau statistics )

Indian Meteorological department అంచనాల ప్రకారం , 2000-2013 మధ్య కేవలం నాలుగు సంవత్సరాలే జూన్-సెప్టెంబరు మధ్య పడాల్సిన వర్షాలు సరిగ్గా పడ్డాయి

మధ్యలో బిటి పత్తి అని GM Crops అని వచ్చి విత్తనాల రేట్లు పెంచి , తద్వారా రైతు అప్పులు పెంచి, ఆత్మహత్యలకి పరోక్షంగా సహాయపడ్డాయి...

ఇన్ని పద్మవ్యూహాల మధ్య , మన రైతు అభిమన్యుడై యుద్ధం చేస్తున్నాడు..
అప్పటి భారతం అభిమన్యుడిని కోల్పోయింది .. ఇప్పటి భారతమైనా జాగ్రత్త పడి మన అభిమన్యులని కాపాడుకుందాం..




      

Friday 4 September 2015

మాధవుడు - మాష్టారు

మాతృదేవోభవ , పితృదేవోభవ , ఆచార్యదేవోభవ ..

గోలోకంలో మాధవుడితో సరదాగా మాట్లాడుతూ , ఖాళీ చల్దిమూటలు వీపున పెట్టుకుని , మందలని తోలుకుంటూ ఇళ్ళకి వస్తున్న గోపాలురకి భూలోకం లోని భరత ఖండం లోనుంచి ' ఆచార్యదేవోభవ ' అని గట్టిగా వినబడుతోంది 

గోపాలురు : కృష్ణయ్యా ! ఏంటీ అందరూ ఆచార్యదేవోభవ అని ఈ రోజు గట్టిగా అంటున్నారు ? నువ్వు తప్ప మాకు ఎవ్వరూ తెలియరు , నువ్వో జగదాచర్యుడివయ్యె .. అంటే ఆచార్యదేవోభవ అని నిన్ను పిలుస్తున్నారా ?  పని గట్టుకుని నిన్ను పొగడటానికి కారణం ఏంటట ?




మాధవుడు : అదా ! ఈ రోజు భారతవనిలో  ఆచార్య దినోత్సవం అని , పిల్లల నుంచి పెద్దల దాకా వాళ్ళకి పాఠాలు చెప్పిన మాష్టార్లని తల్చుకుంటారు , గౌరవంగా పూజిస్తారు .. ఇది ప్రతీ సంవత్సరం జరిగే తంతే గా , కొత్తగా అడుగుతారేంటి ?

గోపాలురు : ప్రతీ సంవత్సరం జరిగేదే అనుకో .. కానీ ఆచార్యదేవోభవ అని ఈ సారి గట్టిగా వినపడుతూంటే ... సందేహం వచ్చింది ..

మాధవుడు : అదా !  'గురుపూజోత్సవం ' అని పిలుచుకుందాం అని ఆలోచన చేసుకున్నారు వారు .. పర భాష కాకుండా సొంత భాష లో పిలుచుకుందాం అనే ఆలోచనకే ప్రకృతి కూడా పులకరించి ప్రతిధ్వనిస్తోంది ...అంతే  ...

గోపాలురు : అదన్నమాట సంగతి , బాగు బాగు ... సరేగాని చాలా చోట్ల ఆ తలపాగా పెద్దాయన చిత్రాలు పెట్టుకున్నారు ఈ రోజు విశేషంగా ! ఎవరాయన ?

మాధవుడు :  ఆయనే , శ్రీ సర్వేపల్లి రాధాక్రిష్ణన్ .. తమిళ దేశంలో పెరిగిన తెలుగాయన .

ఆ వేదాంత 'శార్దూల వృత్తాం'తం టూకీగా ఇలా చెప్తా వినండి

|| వేదాంతంబును బోధ జేయు నతడో విద్వాంసుడై భూరి వి
ద్యాదానంబులు జేసె చిత్తమున యద్వైతంబు నే నిల్పె హిం
దూ దేశాన ద్వితీయ రాష్ట్ర పతి యై ద్యోతించె వేదాంత వి
ద్యా దేశాభ్యుదయంబు యూపిరిగ రాధాకృష్ణుడుండెన్ ధరన్ ||




20యవ శతాబ్దం తొలినాళ్ళ నుంచీ ,హిందూ మతంపై , భారత దేశ అధ్యాత్మికత పై విమర్సలు గుప్పించటం మొదలైంది . ఆ విమర్శలకి వివేకానందుడు మొట్టమొదటి  అడ్డుకట్ట వేస్తే , శ్రీ సర్వేపల్లి రాధాక్రిష్ణన్ ఆ అడ్డుకట్టని మరింత పరిపుష్టం చేసారు.

ఆయన ప్రాక్పశ్చిమ దృక్కోణాలకి వారధి లాంటి వారు , మన వారే.


గోపాలురు : ఓహో మంచి మాష్టారన్నమాట . ఐతే సరే మాష్టారు దేవోభవ , అదే అదే ఆచార్యదేవోభవ. మళ్ళీ అంతటి మంచి మాష్టారు ఈ మధ్యే మన దగ్గరకి వచ్చారు గా , ఎవరో తెల్లజుట్టాయన 'కలాం ' అని , మన గోలోకం లోని పిల్లలందరిని కూర్చో పెట్టి కాగితం రాకెట్లు తయారు చేయిస్తున్నారు .




మాధవుడు : ఆయనా మన వారే . మాష్టార్లందరూ నా రూపాలే గా..


గోపాలురు : అవును అవును , కృష్ణం వందే జగద్గురుం