Thursday, 3 May 2018

అమెరికాలో పద్యనాటకంYoutube Link of the Play :

మౌర్యచరితం ( ప్రవాసంలో పద్యనాటకం )దాదాపు రెండు దశాబ్దాలకు పూర్వమే "పాత" అని ముద్రవేయించుకుని చలనచిత్రాల తాకిడికి కొంత ధృతి తగ్గి కొన్ని సందర్భాలకే పరిమితమైన నాటకం, అందునా పద్యనాటకం , ప్రవాసంలో ఈమధ్య మళ్ళీ పునరుజ్జీవం పొందుతోంది 

ఈనాటి లఘుచిత్రాల కాలంలో మళ్ళీ పద్యనాటకాలు ఆదరణకు నోచుకోవడం మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి తార్కాణం అనుకోవచ్చేమో ..

పద్యాన్ని అమెరికాలో ఉన్న మన తెలుగు పిల్లలకు ఎలా చేరువ చేయవచ్చు అనే ఆలోచనకు జవాబుగా 2017 లో  ఓర్లాండో నగరంలో మొదటిసారిగా టాగో ఉగాది వేదికపై ప్రదర్శించిన "భువనవిజయం " రూపకంతో మొదలైన ఈ నా పద్యనాటక  ప్రస్థానం , ఓర్లాండో , తలహాసీ , చికాగో ప్రేక్షకుల ఆదరణతో చక్కగా కొనసాగుతోంది .. అంతా శ్రీమాత దయ !

అందులో ముందుగా ఈ మధ్యే ప్రదర్శించిన మౌర్యచరితం పద్యనాటకం మీ అందరి ఆశీర్వాదంకోసం పైన youtube లింక్ లో ఉంది ... ఆనందించండి , ఆశీర్వదించండి 

                          తటవర్తి శ్రీకళ్యాణ చక్రవర్తి  ( Kalyan Tatavarthy ) Friday, 24 June 2016

బ్రిటీషు నిష్క్రమణము పై .....


ఎక్కడో వేరే దేశంలో కూర్చుని , ప్రపంచ రాజకీయాలపై పత్రికల్లో చదివే నాబోటి వాడికి , వాస్తవ పరిస్థితులు కేవలం వార్తలద్వారా మాత్రమే తెలుస్తాయి కాబట్టి , ఒక 'బయట వ్యక్తి ' గా కొన్ని ఆలోచనలు ...


బిటీషు వారు ఐరోపా సమాఖ్య నుండి వైదొలుగు తున్నారని చదివి , అసలు ఐరోపా సమాఖ్య ఎలా మొదలైందో కుతూహలం వచ్చి , గూగుల్ గారిని అడిగితే , వికీపీడియా వారు 'ఓయ్ ' అన్నారు ... 

వారిని బట్టి , మొదట బొగ్గు , స్టీల్ , ఆయిల్ వ్యాపారాలు సజావుగా సాగటానికి ఆరు ఐరోపా  దేశాలు ( బ్రిటీషు వారు లేరు ) కూటమిగా ఒప్పందం చేసుకున్నాయట , ఇది 1957 నాటి మాట ..

1960 లో బ్రిటీషు వారు తమంత తాము ఈ కూటమి లో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు ( అందరిలాగే ఆర్ధిక , సామాజిక ప్రయోజనాల కోసం ) .. కాని అప్పటి ఫ్రాన్సు అధ్యక్షులు ఇదేదో అమెరికా వారి కనసన్నల్లో జరుగుతున్న బాగోతం అని ఊహించి , 1967 వరకు దీనికి ఒప్పుకోలేదు , ప్రభుత్వాలు మారాయి అందువల్ల సహజ పరిణామంలా నిర్ణయాలు మారాయి .. 1973 లో యేట్టకేలకు  బ్రిటీషు కూటమి లో సభ్యులయ్యారు 

సరే కాలం మారింది , ఓడలు బళ్ళయ్యాయి  .. అప్పటి సంపన్న దేశాలైన ఫ్రెంచు , ఇటాలియన్లు , ఇప్పుడు ఏమంత గొప్ప ఆర్ధిక వ్యవస్థలు కావు  ...  

సరే , ఇప్పుడు ఎందుకు కూటమి నుంచి బ్రిటీషు వారు వైదొలుగుతున్నారు అంటే ప్రధానంగా వినపడే మాట ' కాందిసీకుల ' వల్ల..

టూకీగా చెప్పలంటే బ్రిటీషు వారుగా చెలమణీ అవుతున్న నేటి జనాల్లో చాలా మంది నిజమైన 'బ్రిటీషు ' వారు కారు ...
కూటమి ఒప్పందాల వల్ల , కూటమి దేశాల్లో యే  దేశ పౌరుడైనా  మిగతా దేశాలకి స్వేచ్ఛగా వెళ్లవచ్చు .... అంతా బానే ఉంది గాని అసలు బాధ ఇక్కడే ఉంది ..

మధ్య ప్రాచ్యంలో జరిగే పరిణామాల వల్ల , కొన్ని కోట్లలో జనాలు ఐరోపా కి వలస వస్తున్నారు ... ఐరోపా లో వారి దేశ పౌరులకి చాల సామాజికాంశాలు ( విద్య వైద్యం మొదలగునవి )  ఉచితమే ... ఈ కొత్తగా వచ్చే వారివల్ల , ఎంత నియంత్రించినా ఖర్చు పెరిగిపోతోంది ప్రభుత్వాలకు , మరొకవైపు ఉగ్రవాదం ..


ఈ పరిస్థితుల్లో , మొత్తం ఐరోపా ఖండం అంతా కష్టం లో ఉంది ... ఈ సమయంలో తన దేశ భద్రత కోసం ఆ దేశ ప్రజ , ఈ కూటమి నుంచి వైదొలగడం ( తద్వారా , కూటమి ఒడంబడికలు  వర్తించవు , శరణార్ధులకి ప్రవేశం ఆపొచ్చు ) 


వారి దేశ భద్రత కోసం తీసుకున్న నిర్ణయంలా ఒక రకంగా సబబు అనిపిస్తున్నా .. మరొకపక్క  'ఏరు దాటాకా తెప్ప తగలెయ్యటం ' లాగానూ అనిపిస్తోంది ... 

రవి అస్తమించని బ్రిటీషు వారు , కష్ట కాలంలో నాయకత్వం వహించకుండా , చీకట్లో మెల్లగా జారుకుంటున్నారేమో  ! ఏమో , మళ్లీ రేపటి పత్రిక ఏమి వార్తలు మోసుకొస్తుందో చూడాలి ...

ఈ లోపు కొన్ని కంద పద్యాలు ' మేమున్నాం ' అని ముందుకొచ్చాయి ...రవి అస్తమించని ప్రజకు
జవ సత్త్వ విహీన సభ్య సంఘము చేదై
అవనిన్  పాలిత పాలక
నివహంబుకు భ్రాంతి కూర్చి నిలిచెను వేరై 


మా కుంపటి మా సొంతము
మీ కూటమి గాదు మేము మేలు దలుపగన్ 
లోకంబును పాలించిన 
మాకేలా పరుల గోల  మనకు విడాకుల్ 


ధాటిగ తమ గతి వేరని 
చాటిన యాంగ్లేయులింక సత్యము నరయన్ 
కోటలు లోటును దీర్చవు 
యేటికి యెదురీత భవిత  యెరుగుదు రేమో 

పరదేశ కాందిశీకుల 
పరమై దేశము చెడునని భయపడు వారా  
పరులన్ బానిస జేసుకు 
చెర పట్టిన నాటి వీరశేఖరు లకటా !   


విరిగెను మొదట  కుటుంబము 
విరిగెను మనసులు కులమత విద్వేషంబున్ 
విరిగెను దేశము తదుపరి
విరుగుట ఖండంబు జేరె విష సంస్కృతియై 

Thursday, 12 November 2015

శివ ఝరి

నేల నచ్చదన్నట్టు
ఆకాశాంలోనే ఉండిపోయిన గంగమ్మా
ఏ భగీరథుడు పిలిచాడో
ఏ భీష్ముడు గుర్తొచ్చాడో
ఒక్కసారిగా ఒడలు మరిచి 
ఊరి గడపలు తడిపేస్తున్నావు
దిక్కులన్నీ తరిచి తరిచి 
చినుకు సంద్రాలు మధిస్తున్నావు

ఆ ...తెలిసింది లే ...

భక్తుడి అరుపో .. బిడ్డ పిలుపో కాదు 
ఆ మూడు కళ్ళ నీ పెనిమిటి వలపులే  

ఎండి పోయిన నేలని
ఇంకి పోయిన ఆశని 
నీ కార్తీక అభిషేక రూపమై 
మరో గంగావతరణమై 
మళ్ళీ బ్రతికిస్తున్నావా .. 
ఎంత దయ నీది శివా 

( ఈ మధ్య పడిన వానలు , కార్తీక మాసం ... అంతా శివమయమే.. అందరం శివ పరివారమే ) 

Tuesday, 6 October 2015

ప్రభవ

లెక్కకు అందనంత అంతరం
నీకు నాకు మధ్య అల్లుకుపొతున్నా

ఒక్క మనసులోని నిశ్శబ్ద ప్రవాహం
వేల చినుకులై ప్రభవిస్తున్నా

వెళ్తాను , నాకై నియమించిన పనికి 
నీ పనిముట్టై వెళ్తాను ...
నీ ఉనికి ,దిక్కులకి చాటడానికి 
నా ఉనికి విడిచి వెళ్తాను ...
నీ జ్ఞానం పరిఢవిల్లటానికి 
నేను  అజ్ఞానమై వెళ్తాను ....

నే నడిచే దారుల్లో
పూలు పరిచినా , రాళ్లు విడిచినా 
నా ఖాతాలో జమ చేసిన రోజుల్లో 
వెలుగు నింపినా , చీకట్లు పంపినా 
నీ ఇష్టాన్ని కాదంటానా 

నేనే నువ్వన్న నిజం నుంచి,
"నేను" అనే అబద్దంగా 
నీ ఆజ్ఞ మహత్యం చుసావా , అప్పుడే మారిపోయాను     

Thursday, 24 September 2015

సింగరాజు - లింగరాజు : మేధావుల సదస్సు ఇన్ విదేశం


ఎప్పటిలాగే చుట్టల కోసం బజారులో అప్పన్న కొట్టుకి వచ్చిన మన లింగరాజుకి , 

దూరంగా విజయవిహార్ సెంటరులో మెరిసిపొతూన్న ఫ్లెక్సీ కనపడింది ...

దేన్నీ పట్టించుకోని మన లింగరాజు , ఆ ప్లెక్సీ చూసి బెంబేలెత్తిపోయాడు .. దాని మీద విషయం అలాంటిది మరి

" ప్రపంచ సమస్యలకి సమాధానం వెతికే సదస్సు కి , 
  ఇక్కడ ఉన్న అన్ని సమస్యలు వదిలేసి , 
  స్వతహాగా మేధావి కాబట్టి 
  ఆహ్వానం లేకపోయినా విదేశం వెళ్ళిన సింగరాజు గారికి అభినందనలతో ...
                                   సింగరాజు ఫ్యాన్స్ ( భజన ) సంఘం .. "  

అని ఉదయించే సూర్యుడి బొమ్మ , గాంధీ గారి , పోరాట యోధుడు 'చే' గారి బొమ్మల మధ్య , మాసిన చిరుగడ్డం తో  దీర్ఘంగా ఆలోచిస్తున్న సింగరాజు బొమ్మ ..

గోదారి గట్టు దాటి ఎప్పుడూ ప్రక్క జిల్లాకి కూడా వెళ్లని వీడు విదేశమేంటో అని సింగరాజు ఇంటికి హడావిడి గా బయల్దేరాడు లింగరాజు 

రామాలయం దాటి , మసీదు వీధి లోకి రాగానే అక్కడ ఇంకో ప్లెక్సీ ..  

" విదేశాల్లో సాగు పద్ధతులు అధ్యయనం చెయ్యడం కోసం వెళ్ళిన మన రైతుజన బంధు సింగరాజు , వర్ధిల్లాలి ...
                                    ఇట్లు సింగరాజు రైతుయూత్ "

ఇందాక ప్రపంచ సమస్యలన్నాడు .. ఇప్పుడేమో రైతు , సాగు అంటున్నడు ... మా చెడ్డ తికమక గాడెహై అనుకుంటూ ఈ గందరగోళం అంతు చూద్దామని నడక వేగం పెంచాడు 

అలా లక్ష్మీ టాకీసు మలుపు తిరిగాడో లేదో ...

అప్పాయమ్మ గారి ఇంటి గోడ మీద , 
                           పిడకల మధ్య , 
నెత్తి మీద యెర్రటి తలపాగా చుట్టుకుని పగటివేషగాడి మల్లే నవ్వుతున్న సింగరాజు గారి చిత్రరాజం దర్శనమిచ్చింది ... అదే పోష్టరు మీద ఇంకా ఇలా రాసి ఉంది ..

"విద్యార్ధుల సామాజిక న్యాయం కోసం , విదేశాల్లో ధర్నా చేయడానికి వెళ్ళిన భారతఛాత్రమిత్ర సింగరాజు జిందాబాద్"

ఈ ఛాత్ర ఏంటో , విదేశాల్లో ధర్నా ఏంటో ... వీడు వీడి తింగరి ప్రచారం అనుకుంటూ , అసలు కారణం ఏంటబ్బా అని అలోచిస్తూ వెళ్తున్న లింగరాజుకి , సింగరాజు భార్య కనపడింది ...

లింగ : చెల్లాయ్  , ఏంటమ్మా వీడు ? ఊరంతా ఈ పోష్టర్లు ఎంటి , ఈ ప్రచారం ఏంటి ? 
          మేధావి అని వేయించుకుంటూ వాడి మూర్ఖత్వం ప్రదర్శించుకుంటున్నాడు .... ఛాత్రమిత్ర అంట .... 
           వీడు పదవ తరగతి పది సార్లు తప్పింది మర్చిపోయాడా ?

సింగ భార్య : నీకు తెలియనిదా అన్నయ్యా... 
                 మొన్న జరిగిన ఊరి ప్రెసిడెంటు ఎన్నికలలో , ఓడిపోయిన సూరిబాబు ,
                 ఈయన తింగరి ప్రచారం వల్లే ఓడిపోయాడు అని అర్ధమయ్యిన అధిష్టానం ...
                ఈయన కనపడితే బడితపూజ చెయ్యడానికి ఉత్తర్వులు జారీ చేసింది ... 
                అందుకే కొనాళ్ళు అజ్ఞాత వాసం చెయ్యాలని ఇలా విదేశమనే విరాటపర్వం మొదలుపెట్టాడు 

లింగ : బావుందమ్మా ! మీ ఆయన కాబట్టి, తప్పదు కాబట్టి అజ్ఞాతవాసం ,విరాటపర్వం , అని వెనకేసుకొస్తున్నావు  ... వీడు నర్తనశాల సినెమా లో ఉత్తరకుమారుడికన్నా  పెద్ద పలాయనవాది .. ఇంతకీ ఎక్కడ చచ్చాడు వీడు ?

సింగ భార్య : మా ఇంటి వెనకాల గొడ్ల చావిడిలో తాత్కాలిక సిబిరం ఏర్పాటు చేసుకున్నారు ...

లింగ : పాపమమ్మా వెర్రి గొడ్లు .. వీడి పిచ్చి వాగుడు వినలేక పాలు ఇవ్వటం కూడా మానేస్తాయేమో చుసుకో

  అంటూ , ఆ సూరిబాబుకి కనపడితే, సింగరాజు మిత్రుడినని తనని ఎక్కడ వాయించేస్తాడో , అనుకుంటూ వడివడి గా ఇంటికి తిరుగుముఖం పట్టాడు