ఎప్పటిలానే సాయంత్రం చల్లబడేసరికి గట్టు మీదున్న చెట్టు కిందకి చేరుకున్నాడు లింగ రాజు..ఎదురుగా పెద్ద కలకలం , అంతా హడావిడిగా వస్తూపోతూన్న జనాలతో సందడిగా ఉంది గోదారి గట్టు.. పుష్కరాలకి ఏర్పాట్లేమో అనుకుందామంటే మొన్నామధ్యే అయ్యాయి ... సుబ్రహ్మణ్య షష్టి జాతరకి లేదా దీపావళి అమావాసకి ఏర్పాట్లా అంటే అదీకాదు ... " సినేమా వాళ్ళు షూటింగ్ కోసం వచ్చారేమో " అనుకుంటూ ఆత్రంగా ఎదురుగా వచ్చే రంగయ్య తాతని "హీరో ఎవరు " అని అడిగాడు లింగ రాజు ...
"అప్పుడే చుక్కేసేసావా" అని విసుక్కుంటూ వెళ్ళిపొయాడు రంగయ్య తాత ... "ఇంకోసారి చుట్టలు తెమ్మని అడుగు చెప్తాను " అని మనసులో అనుకుంటూ .. దూరంగా పోతున్న రత్తమ్మత్త తో .."అత్తో ! హీరోఇన్ వచ్చిందా ?" అని కేకవేసి అడిగాడు ..
"మీ అమ్మమ్మ వచ్చిందిరా సచ్చినోడా !" అని ఇంకా ఎవోతిట్టి వెళ్ళిపొయింది.. "దీని కూతురిని మొన్న కెలికినది ఇంకా మనసులో పెట్టుకుందేమో " అనుకుంటూ అసలు ఏం జరుగుతోందో సొంతంగా చూద్దామని వెళ్ళాడు లింగరాజు
ఎదురుగా ఎత్తైన గద్దెమీద నుంచి సింగరాజు అందరికి ఏవో పురమాయిస్తున్నాడు ...
సింగ :- " సోమవారం అందరూ వచ్చేయండి , మర్చిపోకండి , పార్టీ పేరు గుర్తుందిగా .. చప్పట్లు ఎఫ్ఫుడు కొట్టాలో , ఈలలు ఎప్పుడు వేయ్యాలో మనవాళ్ళు చూపిస్తారు మీరు వాళ్ళని ఫాలో అయిపోండి .. బాగా అరిచినవాళ్ళకి సాయంత్రం మందు ఫ్రీ అని పార్టీ వాళ్ళు చెప్పారు , మరి చూసుకోండి ... పసుపు బట్టలు కాదు , తెల్ల బట్టలు వేసుకురండి ... మర్చిపొయి మొన్నట్లా గులాబీ రంగు వేసుకొచ్చేరు , అది ఇప్పుడు కాదు ముందు ముందు వస్తది " అంటూ ఇంకా ఎవేవో చెప్తున్నాడూ
లింగరాజు ఈ తతంగం అంతా చూసి , అవాక్కయ్యాడు , కొంచెం తేరుకుని
లింగ :- "ఏమిరా సింగా ! రాజకీయ్యాలలోకి వెళ్ళిపోయావా , ఏం పార్టీ ఏంటి ?" అని వ్యంగ్యం నిండిన స్వరంతో అడిగాడు
సింగ :- "ఏడవకు రా , నేనేమీ రాజకీయ్యాలలోకి వెళ్ళలే ! అయినా అక్కడ మన లాంటివాళ్ళకి చోటు లేదు .. అన్నీ నాయకులూ , వారి బంధువులూ పంచేసుకున్నారు
లింగ :- " అయితే ఇదంతా?"
సింగ :- "వ్యాపారం , నేను మేస్త్రీని వాళ్ళు కూలీలు , వ్యత్యాసమల్లా మేము ఇల్లు కట్టము , "జై జై" లు కొడతాం అంతే ,నాయకుడెవడో మాకు అనవసరం , డబ్బులిస్తే జై కొడతాం , ఇంకా ఎక్కువిస్తే వాడ్ని ఊరంతా తిప్పుతాం ... పనికి డబ్బు తీసుకునే ప్రొఫెషనల్ అభిమానులం "
లింగ :- "బాగుందిరా నీ యాపారం ! మరి ఓటు కూడా అలానే వేస్తారా ? మీలాంటి వాళ్ళ వల్లే ఇలాంటి నాయకులు తయారవుతున్నారు.."
సింగ:- " అంతలేదురో ! 65 % ఓట్లు పోల్ అయితే అవన్ని మేము వేసేవే .. వెయ్యనిదల్లా చదువుకున్న ప్రబుద్దులే
No comments:
Post a Comment