Sunday, 19 September 2010

సింగ రాజు కోతలు - లింగ రాజు వాతలు

పాత పాటలు వింటూంటే ఆ సంగీతంతో పాటు సాహిత్యం కూడా మనసుకి ఆహ్లాదంగాను , ఆనాటి పరిస్థితులకి ప్రతిబింబంగాను ఉంటాయి. కామెడీ పాటల్లో కూడా ఎంతో నీతి ఉండేది , అలాంటి పాటల్లో ఒకటైన పాట
"కాశీకి పోయాను రామా హరీ ,
గంగ తీర్థంబు తెచ్చాను రామా హరీ " అనేది.

రేలంగి గారు సన్యాసి వేషంలో వారికి నచినట్టు కోస్తూ ఉంటే , వారి గాలి తీసేసే పాట ఇది ..అలాగే మన సింగ రాజు గారు కూడా ఒక సాయంకాలం పూట, గట్టు మీద చెట్టు కింద గుమిగూడిన "పిచ్చాపాటి" మేళం ముందు కోతలు కొయ్యడానికి పూనుకున్నారు ..
మన లింగ రాజు చుస్తూ ఊరుకుంటాడా? ఇలాంటి అవకాసం కోసమే ఎదురుచూస్తున్నాడాయె..

సింగ :- ఢిల్లీకి వెళ్ళాను రామా హరీ

           సోనియా గాంధీని కలిశాను రామా హరీ
            దేశ ప్రగతి చర్చించాను రామా హరీ...
(తందాన తందాన తందానతానా..)

లింగ :- ఢిల్లీకి పోలేదు రామా హరీ
           ఇంటి గడప దాటే లేదు రామా హరీ
           ముసుగు తన్ని పడుకున్నాడు రామా హరీ ..
(తందాన తందాన తందానతానా..)

ఆయ్ !! మాటకి మాట అన్నట్టు , పాటకి పాట అప్పచెప్తున్నాడనుకుని , ఒళ్ళుమండి , ఇలా మొదలెట్టాడు ..

సింగ :- అమెరికా వెళ్ళాను రామా హరీ

           ఆంధ్ర సంతతిని కలిశాను రామా హరీ
           ఆయిల్ లీకునాపొచ్చాను రామా హరీ...
(తందాన తందాన తందానతానా..)

లింగ :- బస్సు టిక్కట్టుకే రామా హరీ
           చెంత చిల్లిగవ్వా లేదు రామా హరీ
           ఇంక లోకసంచారమా రామా హరీ ..
(తందాన తందాన తందానతానా..)
 
సింగ :- ముఖ్యమంత్రీ పదవి రామా హరీ
            వద్దు వద్దు వదిలేశాను రామా హరీ
            ప్రజాసేవకంకితమైతి రామా హరీ...
(తందాన తందాన తందానతానా..)

లింగ :- పదవి కోరీ వెడితె రామా హరీ
           చాచి తన్ని తరిమేశారు రామా హరీ
           ప్రజాసేవ వట్టీ మాట రామా హరీ ..
(తందాన తందాన తందానతానా..)
 
సింగ :- నిజము చెబుతానండి రామా హరీ

           నేను దేశభక్తుడనండి రామా హరీ
           నన్ను పూర్తిగా నమ్మండి రామా హరీ...
(తందాన తందాన తందానతానా..)

లింగ :- రాజకీయము లెండి రామా హరీ
           ఓట్లపాట్లండి ఈ సంత రామా హరీ
           నమ్మి చెడుటేల ? జాగ్రత్త రామా హరీ ..
(తందాన తందాన తందానతానా..)
 
సింగ :- న్యాయమూ ధర్మమూ రామా హరీ

          నాకు అన్నపానీయాలు రామా హరీ
           ప్రజలు కన్నబిడ్డాలింక రామా హరీ...
(తందాన తందాన తందానతానా..)


లింగ :- మద్యమూ లంచమూ రామా హరీ
           పరమప్రీతిపాత్రములండి రామా హరీ
            ప్రజలబ్రతుకులేలెక్కింక? రామా హరీ ..
(తందాన తందాన తందానతానా..)
 
సింగ :- మా మతము చేరండి రామా హరీ

           చాల డబ్బులిస్తామండి రామా హరీ
           డాలర్లు రాశిపోస్తామండి రామా హరీ...
(తందాన తందాన తందానతానా..)

లింగ :- వెర్రిగొర్రెల రీతి రామా హరీ
           కసాయివార్ల నమ్మావద్దు రామా హరీ
           నేటి బానిసత్వమ్మిదే రామా హరీ ..
(తందాన తందాన తందానతానా..)
 
సింగ :- చేత కానీ వారు రామా హరీ

           మీ దేవతలు, రాళ్ళు , రామా హరీ
           పుచ్చు వంకాయ మీ భక్తి రామా హరీ...
(తందాన తందాన తందానతానా..)

లింగ :- సహనశీలురమేము రామా హరీ
          చేతకాక వదలాలేదు రామా హరీ
           తాటతీసివేస్తామింక రామా హరీ ..
(తందాన తందాన తందానతానా..)


ఇంత కోతలు కోసి , రాముడు , కృష్ణుడు , ఎవరూ లేరు , అదంతా ఛాదస్తమని ఎక్కడో ఎవడో పనికిమాలిన పనీపాటా లేనివాడు , ఇండియాని , ఇండియన్ దేవుళ్ళని , ఆ ఆచరాలనీ తిట్టడమే జీవనోపాధిగా ఉన్నవాడు రాసిన చెత్త చదివీ పాడైన బుర్రతో వాదించేశాడు సింగరాజు ..


కాని లింగరాజు & మిగతా జనం కోపం చూసి , సన్నగా వెన్నులో చిన్న ఒణుకు పుట్టేసరికి .. ఈ ఒక్కసారి తనని రక్షిస్తే .. గట్టుమీదున్న శివుడికి  గోదారి నీళ్ళతో అభిషేకం చెయిస్తానంటూ మొక్కుకుని , మెల్లగా జారుకున్నాడు మన సింగరాజు ..అంతా విష్ణు మాయ !!

Wednesday, 1 September 2010

చిరిగిన నోటు - సింగరాజు పాట్లు

జగన్నాటక సూత్రధారి కంసవధ కోసం , కురుక్షేత్ర సంగ్రామంలో పార్ధసారధిగా పరమార్ధం బోధించటం కోసం , దేవకీ గర్భాన, కారగారంలో,రాక్షసులు తిరిగే నిశా సమయంలో , తనని తానే సృజించుకున్న శ్రీకృష్ణాష్టమి పర్వదినాన ..

తమ వీధిలో పెట్టిన ఉట్టి కొట్టొచిన ఆనందం లో లింగరాజు ఉంటే , మొహం వేలాడేసుకుని కూర్చున్నాడు సింగ రాజు ..

లింగ :- ఏరో ! ఎమైందేంటి , మొహం రాజమండ్రి బ్రిడ్జి గతుకులలో , డొక్కు ఆటో లో కుక్కుకుని వచ్చిన వాడిమల్లే పెట్టావ్ , ఏంది కథ ?


సింగ రాజు భారంగా నిట్టూర్చాడు ..


లింగ :- ఏంటి నిరాశే? అయితే నీకు రెండు ఇసుక రేణువుల కధ చెప్తా నిరాశ పోతుంది , పూర్వం బ్రహ్మా...


సింగ :- రే ! ఆపరా , అది నేనే నేకు చెప్పాను..


లింగ :- ఓహో! నువ్వు చెప్పిందేనా అది , మర్చిపొయా :-)

సింగ :- అయినా సందర్భం ఏంటో తెలియకుండా అన్నిటికీ ఆ కధే చెప్పేస్తావా ?లింగ :- ఏమో , నువ్వు కూడా ఆత్మనూన్యతతో ఉన్నావేమో అని అనుకున్నా .. మరెందుకిలా ఉన్నావ్? ఆ కరణం గారి అమ్మాయి, నీ ప్రేమ తిరస్కరించిందా?


సింగ :- ఊహూ ..


లింగ :- మరైతే , వాళ్ళ నాన్నకి చెప్పేసిందా? చెప్పరా బాబు కొన్నాళ్ళు  నీతో తిరగడం మానేస్తాను.. తిక్కచచ్చినోడు నన్ను పట్టుకుని వాయించేస్తాడు..

సింగ :- కాదెహై !లింగ :- కొంప తీసి ఒప్పేసుకుందా ఏంటి , ఇంత బాధ పడుతున్నావ్..


సింగ :- అదేమి కాదు రా బాబు .. ఈ రోజు పొద్దున్నే ఎవరి మొహం చూసానో ఏంటో .. ఒక బొండం తాగి వందిస్తే , ఇచ్చిన చిల్లరలో ఒక పది నోటు చిరిగిపోయిందొచ్చింది ..


లింగ :- ఆరి పిసినారోడా ! ఒక్క చిరిగిన నోటుకి ఇంత నిరాశా ?ఎవడు మన బొండాంసత్తిగాడేనా ఇచ్చింది, వాడినే అడుగు ఇంకోటి ఇవ్వమని ..


సింగ :- వాడు కాదు , వీడెవడో కొత్తోడు ,ఆనక బాబాయి హోటల్లో టిఫిన్ తిని బిల్లు కడుతూంటే అప్పుడు గమనించా .. ఆ బొండాలోడి కోసం ఊరంతా తిరిగా , లాభం లేదు దొరకలేదు..


లింగ :- మరేం చెసావ్?


సింగ :- అది మారుద్దమని మన శెట్టి కొట్లో అవసరం లేకపొయినా , పప్పు , ఉప్పు కొనేసి , తెలివిగా , మిగతా నోట్లతో పాటూ ఇది కలిపేసి ఇచ్చేసాను .. కాని ఆ శెట్టిగాడు పట్టేసాడు ...

లింగ :- డబ్బువిషయంలో వాడంతేగా .. ఆ తర్వాతా?సింగ :- ఇంకో రెండు మూడు కొట్లలో ఇలా అవసరం లేక పొయినా ఎదో ఒకటి కొని ఇది మారుద్దమనుకున్నా , కాని లాభం లేదు , ఎవ్వడూ తీస్కోలేదు ..


లింగ :- మరి ?


సింగ :- ఇంక ఉక్రోషం ఎక్కువైపోయి , ఎలాగోలా దాన్ని వదిలించుకోవాలని చెప్పి , మన బస్ స్టాండ్లో ఎవరు చుడకుండా పడేసా..


లింగ :- పొన్లే , ఒదిలిపోయిందిగా..


సింగ :- ఏంటి పోయేది , వెనకాలే ఎవడో పరిగెత్తుకుని వచ్చి మరీ "సార్ మీ నోటు పడిపొయింది సార్" అని ఇచ్చి వెళ్ళాడు .. బహుశా దొంగలకి కూడా ఆ చిరిగిన నోటు అక్కర్లేదేమో ..

లింగ :- ఒరినీ ఇదా నీ ప్రాబ్లం .. నోటుని గోదాట్లో వేసెయ్యి.. సరిపోతుందిగా ..సింగ :- అదే అనుకున్నాను , కాని మన గోదారి గట్టున ఉన్న కృష్ణుడి గుడి గంట వినపడే సరికి ఒక ఐడియా వచ్చింది .. మెల్లగా వెళ్ళి , హుండీ లో వేసేసి ప్రసాదం కడుపునిండా తినొచ్చాను


లింగ :- బాగుంది రా .. మరేం , అది ఒదిలిపోయింది గా , ఇంకెందుకు ఈ దిగులు ..


సింగ :- అసలు గొడవ ఇక్కడే మొదలయింది


లింగ :- పశ్చాత్తాపమా ?

సింగ :- అంతలేద్రో ! అలా హుండీలో వేసొచ్చానో లేదో , ఇలా మన పోస్టుమాన్ వచ్చి , మా మవయ్య పంపిన పదివేల మనీ ఆర్డర్ ఇచ్చి పోయాడు .. పూర్వం , మా నాన్న దగ్గర అప్పు తీసుకున్నాడంట , ఇప్పుడది వడ్డీతో కలిపి పదివేలయ్యిందని , ఆలస్యమయినందుకు క్షమించమని రాసి పంపాడు..లింగ :- వార్నీ ! మరేమనుకున్నవ్ కృష్ణుడంటే .. అటుకులిస్తేనే పొంగిపోయి ఐశ్వర్యమిచ్చాడంటే నమ్మలేదు నువ్వు .. ఇప్పుడు చూడు .. ఐనా సంతోషించకుండా , ఇంకా ఏడుపు మొహం ఏంటిరా?


సింగ :- చిరిగిన నోటేస్తేనే పదివేలిచ్చాడంతే .. మామూలు నోటు వేసి ఉంటే ఇంకెంత వచ్చి ఉండేదో అని .. ఛాన్స్ పొయిందే అని బాధ..


లింగ :- ఓరి నీ ఆశ !! కృష్ణ కృష్ణ !!