Monday, 30 January 2012

పశువుల కాపరి ఆత్మతత్త్వం

సూర్యోదయానికి ముందు గాఢమైన చీకట్లు మెల్లగా కరుగుతున్న సమయం.
గోదావరి  ఒడ్డు దగ్గర ఉదయపు సంధ్యావందనం పూర్తిచేసుకుని , శిష్యులతో వేదవిధానాల గురించి , ఆత్మతత్త్వాన్ని గురించి చర్చిస్తూ వస్తున్నాడు ఒక గురువు .

'గురువుగారు , ఆత్మ అంటే ఏంటి అండి ? ' అంటూ ఒక శిష్యుడు ఆతృతగా అడిగిన ప్రశ్నకి సమాధనంగా వివరణ ఇస్తూ ..

' సర్వాన్ని సాక్షిగా వీక్షిస్తూ , మాయకీ , మార్పుకీ అందనిదే ఆత్మ ' అని చెబుతున్నాడు గురువు . 

వారి సంభాషణ ఈ విధంగా సాగుతూండగా ,ఎదురుగా ఒక పశువులకాపరి అప్పుడేలేచి తన  విధులకి తయారవుతూ వీరి సంభాషణ విన్నాడు.

ఆ రోజు రోజంతా అదే విషయం అలోచిస్తూ గడిపాడు ,' సర్వాన్ని సాక్షిగా వీక్షించటం ' అనేది వాడి మనస్సుకి బాగా హత్తుకుపోయింది . అసలు అలా ఉండటం కుదురుతుందా అనే ఆలోచన వాడి మనస్సులో మొలకెత్తింది . ఇదేదో ప్రయత్నిస్తేగాని అర్ధం అవ్వదనుకుని , అప్పటినుండీ అన్నిటినీ కేవలం సాక్షిగా చూడటం మొదలు పెట్టాడు .

మొదట్లో అలా ఉండటం అస్సలు కుదరలేదు. మరీ ముఖ్యంగా భావోద్వేగాల విషయంలోనూ , ఆకలి దప్పుల విషయంలోనూ ఇది అసలు సాధ్యం కాలేదు. ఒక పక్షం రోజుల తర్వాత ఇది మన వల్ల కాదు వదిలేద్దామనుకుని , కర్ర భుజమ్మీద వేసుకుని ఇన్నాళ్ళ తన ప్రయోగం గురించి పునరాలోచన చేస్తూ అల నది వడ్డున కూర్చున్నాడు .ఎదురుగా ప్రవహిస్తున్న గోదారి అలలు , మెల్లగా వీస్తున్న తెమ్మరలు , నది అలలమీద నుండి వీచే గాలి చప్పుడు అన్నీ ఒక రకమైన ధ్యానానుగుణమైన వాతవరణం కల్పిస్తూ ఉండగా , ఆ పశువుల కాపరి దృష్టి ప్రవహిస్తూన్న నదిమీద పడింది . ఈ క్షణం కనపడిన అల , మరునిముషం అక్కడ ఉండట్లేదు . ఈ క్షణం తనను స్పృశించిన  గాలి , మరునిముషం ఎక్కడకి వెళ్తోందో  తెలియట్లేదు. కొత్త కొత్త అలలు పుడుతూనే ఉన్నాయి , కొత్త కొత్త అనుభూతులను  గాలి కలిగిస్తూనే ఉంది  . కాని ఆ నది స్వరూపం , ఆ గాలి స్వరూపం మటుకు మారట్లేదు. అల కొత్తదైనా పాతదైనా , నదికి ప్రవహించటమే లక్షణం , ఇదంతా ఎదో విశ్వరచనకు లోబడి సాగుతూన్నట్టుగా తోచింది ఆ పశువుల కాపరికి.

' గురువుగారు అన్న ఆ ఆత్మ తత్త్వానికి , గోదారి తల్లి బోధిస్తున్న ఈ విశ్వరచనకి ఎమైనా సంబంధం   ఉందా ?'  అంటూ మళ్ళీ వాడి మదిలో ఒక ప్రశ్న మొలకెత్తింది .

దీర్ఘాలోచనలోన చేస్తూ వాడు సమాధి స్థితిలోనికి జారుకున్నాడు . ఒక 20 సంవత్సరాలు అలా గడిచిపోయాయి. ఆ పశువుల కాపరి  చుట్టూ పుట్టలొచ్చేశాయి .

అంతకుముందు ఆత్మ గురించి చెప్పిన గురువు పరమపదించారు ,  ఆత్మ గురించి అడిగిన శిష్యుడు ఆ గురువు మఠానికి ఆచార్యుడయ్యాడు.

అలా ఒకనాటి సాయంకాలం , ఆ పశువుల కాపరి సమాధి నుండి మేల్కొని తన స్థితిని గమనించుకుని అక్కడ నుండి  లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.

ఈ రెండు దశాబ్దాలుగా , ఏ భావోద్వేగాలూ , ఏ రసస్పందనలు , ఏ ఆకలి దప్పులు లేని స్థితిలో తనను నడిపించిన చైతన్యం ఎదైతే ఉందో , ఆ చైతన్యపు విశ్వరచన యొక్క లిపి కొంత అవగతమయ్యేసరికి తనను తాను మర్చిపోయి ఆ తత్త్వం యొక్క ఆద్యంతాలను నిరంతరం దర్శించాలని తపిస్తూ ముందుకు సాగిపోతున్న అ పశువుల కాపరికి , దూరంగా మైకు నుంచి వినపడుతున్న ఒక పండితుడి మాటలు వినిపించాయి .

' సర్వాన్ని సాక్షిగా వీక్షిస్తూ , మాయకీ , మార్పుకీ అందనిదే ఆత్మ ' అని చెబుతున్నాడు ఆ వక్త .  ఆ వక్త ఎవ్వరో కాదు , పూర్వం ఆత్మ గురించి అడిగిన శిష్యుడు మరియు  నేటి ఆచార్యుడు .

తనకు ఆత్మ బోధ చేసిన ఆ గురువు ఙ్ఞాపకం వచ్చి ఒక సారి చూసివద్దామని  అటువైపు వెళ్ళాడు ఆ పశువులకాపరి .

ఆ ప్రవచనం వినపడుతున్న సభాప్రాంగణం అంతా  విద్యుద్దీపాలతో , మైకుల హోరుతో , భక్తుల వరుసలతో కిట కిటలాడిపోతోంది . అంత మంది లో చినిగిన బట్టలతో , జడలు కట్టేసి , వికృతంగా ఉన్న ఆ పశువులకాపరిని చూసి , ఆ ఆచార్యుని శిష్యవర్గం తరిమివేసింది .

' ఛీ ! శౌచంలేని వాడా , ఇటు రాకు .. పవిత్రమైన ఈ ప్రాంగణం పాడుచెయ్యకు ' అంటూ ఆ ప్రవచనానికి వచ్చిన వారందరూ ఆ పశువులకాపరిని తన్ని తరిమివేసారు .

'నైనం ఛిందంతి శస్త్రాణి ...' అంటూ భగవద్గీతనుండి  శ్లోకం మైకు నుంది వినపడుతూంది .

ఒక చిరునవ్వు నవ్వి అక్కడ నుంచి నిష్క్రమించాడు ఆ పశువుల కాపరి .