Friday 19 July 2013

ఆకాశం అద్దెకొచ్చింది

నీలాకాశమనే నిలువుటద్దంలోంచి
వానై వచ్చిన వాగు పలకరింపులు
చిన్ని చినుకు కురిపించిన స్నేహితంతో
విరబూసిన పొలం పులకరింపులు

తోపుడు బళ్ళమీద వాన చినుకు టపటపలు
బొగ్గుల మీద కాలుతూ జొన్నపొత్తుల చిటపటలు
గుప్పిళ్ళు నిండిన కారం పల్లీలు
స్వర్గం చూపించే వేడి పకోడీలు


చూరువారగా చుట్ట కాల్చుతూ ,
తాత చూపుల ప్రశ్నార్ధకాలు  ..
పాత పత్రికల బూజు దులుపుతూ
బామ్మలు  చేసే కాగితపు పడవలు 






ఆకాశంలో రోజూ చూసే
చందమమే కరిగి వస్తున్నాడంటూ
అందుకుందామని దోసిళ్ళు చాచే
అల్లరి బుడతల అమాయకత్వం 

యెల్లలు లేని వారి ఆనందానికి
' జలబు ' ' జ్వరం ' అని కళ్లెంవేస్తూ
అలిసిపోయే అమ్మల ఆత్రం

మొన్నటిదాకా మండుటెండతో
ముడుచుకుపోయిన ఊరు
ముసురుతెచ్చిన కొత్త ఊసులతో
మళ్ళీ పల్లవించింది
అలసి పోయిన సూరీడికి సెలవిచ్చి
ఆకాశం నేలపై అద్దెకొచ్చింది