Sunday, 19 September 2010

సింగ రాజు కోతలు - లింగ రాజు వాతలు

పాత పాటలు వింటూంటే ఆ సంగీతంతో పాటు సాహిత్యం కూడా మనసుకి ఆహ్లాదంగాను , ఆనాటి పరిస్థితులకి ప్రతిబింబంగాను ఉంటాయి. కామెడీ పాటల్లో కూడా ఎంతో నీతి ఉండేది , అలాంటి పాటల్లో ఒకటైన పాట
"కాశీకి పోయాను రామా హరీ ,
గంగ తీర్థంబు తెచ్చాను రామా హరీ " అనేది.

రేలంగి గారు సన్యాసి వేషంలో వారికి నచినట్టు కోస్తూ ఉంటే , వారి గాలి తీసేసే పాట ఇది ..అలాగే మన సింగ రాజు గారు కూడా ఒక సాయంకాలం పూట, గట్టు మీద చెట్టు కింద గుమిగూడిన "పిచ్చాపాటి" మేళం ముందు కోతలు కొయ్యడానికి పూనుకున్నారు ..
మన లింగ రాజు చుస్తూ ఊరుకుంటాడా? ఇలాంటి అవకాసం కోసమే ఎదురుచూస్తున్నాడాయె..

సింగ :- ఢిల్లీకి వెళ్ళాను రామా హరీ

           సోనియా గాంధీని కలిశాను రామా హరీ
            దేశ ప్రగతి చర్చించాను రామా హరీ...
(తందాన తందాన తందానతానా..)

లింగ :- ఢిల్లీకి పోలేదు రామా హరీ
           ఇంటి గడప దాటే లేదు రామా హరీ
           ముసుగు తన్ని పడుకున్నాడు రామా హరీ ..
(తందాన తందాన తందానతానా..)

ఆయ్ !! మాటకి మాట అన్నట్టు , పాటకి పాట అప్పచెప్తున్నాడనుకుని , ఒళ్ళుమండి , ఇలా మొదలెట్టాడు ..

సింగ :- అమెరికా వెళ్ళాను రామా హరీ

           ఆంధ్ర సంతతిని కలిశాను రామా హరీ
           ఆయిల్ లీకునాపొచ్చాను రామా హరీ...
(తందాన తందాన తందానతానా..)

లింగ :- బస్సు టిక్కట్టుకే రామా హరీ
           చెంత చిల్లిగవ్వా లేదు రామా హరీ
           ఇంక లోకసంచారమా రామా హరీ ..
(తందాన తందాన తందానతానా..)
 
సింగ :- ముఖ్యమంత్రీ పదవి రామా హరీ
            వద్దు వద్దు వదిలేశాను రామా హరీ
            ప్రజాసేవకంకితమైతి రామా హరీ...
(తందాన తందాన తందానతానా..)

లింగ :- పదవి కోరీ వెడితె రామా హరీ
           చాచి తన్ని తరిమేశారు రామా హరీ
           ప్రజాసేవ వట్టీ మాట రామా హరీ ..
(తందాన తందాన తందానతానా..)
 
సింగ :- నిజము చెబుతానండి రామా హరీ

           నేను దేశభక్తుడనండి రామా హరీ
           నన్ను పూర్తిగా నమ్మండి రామా హరీ...
(తందాన తందాన తందానతానా..)

లింగ :- రాజకీయము లెండి రామా హరీ
           ఓట్లపాట్లండి ఈ సంత రామా హరీ
           నమ్మి చెడుటేల ? జాగ్రత్త రామా హరీ ..
(తందాన తందాన తందానతానా..)
 
సింగ :- న్యాయమూ ధర్మమూ రామా హరీ

          నాకు అన్నపానీయాలు రామా హరీ
           ప్రజలు కన్నబిడ్డాలింక రామా హరీ...
(తందాన తందాన తందానతానా..)


లింగ :- మద్యమూ లంచమూ రామా హరీ
           పరమప్రీతిపాత్రములండి రామా హరీ
            ప్రజలబ్రతుకులేలెక్కింక? రామా హరీ ..
(తందాన తందాన తందానతానా..)
 
సింగ :- మా మతము చేరండి రామా హరీ

           చాల డబ్బులిస్తామండి రామా హరీ
           డాలర్లు రాశిపోస్తామండి రామా హరీ...
(తందాన తందాన తందానతానా..)

లింగ :- వెర్రిగొర్రెల రీతి రామా హరీ
           కసాయివార్ల నమ్మావద్దు రామా హరీ
           నేటి బానిసత్వమ్మిదే రామా హరీ ..
(తందాన తందాన తందానతానా..)
 
సింగ :- చేత కానీ వారు రామా హరీ

           మీ దేవతలు, రాళ్ళు , రామా హరీ
           పుచ్చు వంకాయ మీ భక్తి రామా హరీ...
(తందాన తందాన తందానతానా..)

లింగ :- సహనశీలురమేము రామా హరీ
          చేతకాక వదలాలేదు రామా హరీ
           తాటతీసివేస్తామింక రామా హరీ ..
(తందాన తందాన తందానతానా..)


ఇంత కోతలు కోసి , రాముడు , కృష్ణుడు , ఎవరూ లేరు , అదంతా ఛాదస్తమని ఎక్కడో ఎవడో పనికిమాలిన పనీపాటా లేనివాడు , ఇండియాని , ఇండియన్ దేవుళ్ళని , ఆ ఆచరాలనీ తిట్టడమే జీవనోపాధిగా ఉన్నవాడు రాసిన చెత్త చదివీ పాడైన బుర్రతో వాదించేశాడు సింగరాజు ..


కాని లింగరాజు & మిగతా జనం కోపం చూసి , సన్నగా వెన్నులో చిన్న ఒణుకు పుట్టేసరికి .. ఈ ఒక్కసారి తనని రక్షిస్తే .. గట్టుమీదున్న శివుడికి  గోదారి నీళ్ళతో అభిషేకం చెయిస్తానంటూ మొక్కుకుని , మెల్లగా జారుకున్నాడు మన సింగరాజు ..అంతా విష్ణు మాయ !!

Wednesday, 1 September 2010

చిరిగిన నోటు - సింగరాజు పాట్లు

జగన్నాటక సూత్రధారి కంసవధ కోసం , కురుక్షేత్ర సంగ్రామంలో పార్ధసారధిగా పరమార్ధం బోధించటం కోసం , దేవకీ గర్భాన, కారగారంలో,రాక్షసులు తిరిగే నిశా సమయంలో , తనని తానే సృజించుకున్న శ్రీకృష్ణాష్టమి పర్వదినాన ..

తమ వీధిలో పెట్టిన ఉట్టి కొట్టొచిన ఆనందం లో లింగరాజు ఉంటే , మొహం వేలాడేసుకుని కూర్చున్నాడు సింగ రాజు ..

లింగ :- ఏరో ! ఎమైందేంటి , మొహం రాజమండ్రి బ్రిడ్జి గతుకులలో , డొక్కు ఆటో లో కుక్కుకుని వచ్చిన వాడిమల్లే పెట్టావ్ , ఏంది కథ ?


సింగ రాజు భారంగా నిట్టూర్చాడు ..


లింగ :- ఏంటి నిరాశే? అయితే నీకు రెండు ఇసుక రేణువుల కధ చెప్తా నిరాశ పోతుంది , పూర్వం బ్రహ్మా...


సింగ :- రే ! ఆపరా , అది నేనే నేకు చెప్పాను..


లింగ :- ఓహో! నువ్వు చెప్పిందేనా అది , మర్చిపొయా :-)

సింగ :- అయినా సందర్భం ఏంటో తెలియకుండా అన్నిటికీ ఆ కధే చెప్పేస్తావా ?లింగ :- ఏమో , నువ్వు కూడా ఆత్మనూన్యతతో ఉన్నావేమో అని అనుకున్నా .. మరెందుకిలా ఉన్నావ్? ఆ కరణం గారి అమ్మాయి, నీ ప్రేమ తిరస్కరించిందా?


సింగ :- ఊహూ ..


లింగ :- మరైతే , వాళ్ళ నాన్నకి చెప్పేసిందా? చెప్పరా బాబు కొన్నాళ్ళు  నీతో తిరగడం మానేస్తాను.. తిక్కచచ్చినోడు నన్ను పట్టుకుని వాయించేస్తాడు..

సింగ :- కాదెహై !లింగ :- కొంప తీసి ఒప్పేసుకుందా ఏంటి , ఇంత బాధ పడుతున్నావ్..


సింగ :- అదేమి కాదు రా బాబు .. ఈ రోజు పొద్దున్నే ఎవరి మొహం చూసానో ఏంటో .. ఒక బొండం తాగి వందిస్తే , ఇచ్చిన చిల్లరలో ఒక పది నోటు చిరిగిపోయిందొచ్చింది ..


లింగ :- ఆరి పిసినారోడా ! ఒక్క చిరిగిన నోటుకి ఇంత నిరాశా ?ఎవడు మన బొండాంసత్తిగాడేనా ఇచ్చింది, వాడినే అడుగు ఇంకోటి ఇవ్వమని ..


సింగ :- వాడు కాదు , వీడెవడో కొత్తోడు ,ఆనక బాబాయి హోటల్లో టిఫిన్ తిని బిల్లు కడుతూంటే అప్పుడు గమనించా .. ఆ బొండాలోడి కోసం ఊరంతా తిరిగా , లాభం లేదు దొరకలేదు..


లింగ :- మరేం చెసావ్?


సింగ :- అది మారుద్దమని మన శెట్టి కొట్లో అవసరం లేకపొయినా , పప్పు , ఉప్పు కొనేసి , తెలివిగా , మిగతా నోట్లతో పాటూ ఇది కలిపేసి ఇచ్చేసాను .. కాని ఆ శెట్టిగాడు పట్టేసాడు ...

లింగ :- డబ్బువిషయంలో వాడంతేగా .. ఆ తర్వాతా?సింగ :- ఇంకో రెండు మూడు కొట్లలో ఇలా అవసరం లేక పొయినా ఎదో ఒకటి కొని ఇది మారుద్దమనుకున్నా , కాని లాభం లేదు , ఎవ్వడూ తీస్కోలేదు ..


లింగ :- మరి ?


సింగ :- ఇంక ఉక్రోషం ఎక్కువైపోయి , ఎలాగోలా దాన్ని వదిలించుకోవాలని చెప్పి , మన బస్ స్టాండ్లో ఎవరు చుడకుండా పడేసా..


లింగ :- పొన్లే , ఒదిలిపోయిందిగా..


సింగ :- ఏంటి పోయేది , వెనకాలే ఎవడో పరిగెత్తుకుని వచ్చి మరీ "సార్ మీ నోటు పడిపొయింది సార్" అని ఇచ్చి వెళ్ళాడు .. బహుశా దొంగలకి కూడా ఆ చిరిగిన నోటు అక్కర్లేదేమో ..

లింగ :- ఒరినీ ఇదా నీ ప్రాబ్లం .. నోటుని గోదాట్లో వేసెయ్యి.. సరిపోతుందిగా ..సింగ :- అదే అనుకున్నాను , కాని మన గోదారి గట్టున ఉన్న కృష్ణుడి గుడి గంట వినపడే సరికి ఒక ఐడియా వచ్చింది .. మెల్లగా వెళ్ళి , హుండీ లో వేసేసి ప్రసాదం కడుపునిండా తినొచ్చాను


లింగ :- బాగుంది రా .. మరేం , అది ఒదిలిపోయింది గా , ఇంకెందుకు ఈ దిగులు ..


సింగ :- అసలు గొడవ ఇక్కడే మొదలయింది


లింగ :- పశ్చాత్తాపమా ?

సింగ :- అంతలేద్రో ! అలా హుండీలో వేసొచ్చానో లేదో , ఇలా మన పోస్టుమాన్ వచ్చి , మా మవయ్య పంపిన పదివేల మనీ ఆర్డర్ ఇచ్చి పోయాడు .. పూర్వం , మా నాన్న దగ్గర అప్పు తీసుకున్నాడంట , ఇప్పుడది వడ్డీతో కలిపి పదివేలయ్యిందని , ఆలస్యమయినందుకు క్షమించమని రాసి పంపాడు..లింగ :- వార్నీ ! మరేమనుకున్నవ్ కృష్ణుడంటే .. అటుకులిస్తేనే పొంగిపోయి ఐశ్వర్యమిచ్చాడంటే నమ్మలేదు నువ్వు .. ఇప్పుడు చూడు .. ఐనా సంతోషించకుండా , ఇంకా ఏడుపు మొహం ఏంటిరా?


సింగ :- చిరిగిన నోటేస్తేనే పదివేలిచ్చాడంతే .. మామూలు నోటు వేసి ఉంటే ఇంకెంత వచ్చి ఉండేదో అని .. ఛాన్స్ పొయిందే అని బాధ..


లింగ :- ఓరి నీ ఆశ !! కృష్ణ కృష్ణ !!

Sunday, 29 August 2010

"కామన్"వెల్త్ -- లింగరాజు క్లాస్ పీకుడు..

సింగ :- ఒరే , కొద్దిరోజుల్లో కామన్వెల్త్ గేములు మొదలవుతాయి గదా , వెల్దామేంటి?

లింగ :- ఎందుకురా?


సింగ :- ఎందుకంటావేంటిరా !! దేశదేశాల క్రీడాకారులొస్తారు , మన దేశ స్టార్స్ వస్తారు .. మన సైనా , అభినవ్ బింద్రా , ఇలా అందర్ని చుడొచ్చు గా ...


లింగ :- మనోళ్ళన్నావ్ ఒప్పుకుంటాను ... కాని మిగతా స్టార్స్ ఎవ్వరూ రావట్లేదు ..


సింగ :- అదేంటి ?


లింగ :- ఆట మధ్యలో ఏ పైకప్పో ఊడి పడిపోతే ? గట్టిగా వానొచ్చి ఆ వరదల్లో కొట్టుకుపోతే ? ఎవరి భయాలు వాళ్ళవి !!

సింగ :- నువ్వు మరీనురా ... ఏదో ఒకసారి జరిగితే అస్తమానూ జరుగుతుందా ఏంటి? పైగా మన దేశంలో జరిగేదానికి మనమే వెళ్ళకపోతే , పరాయి దేశాల వాళ్ళ ముందు మన పరువుమనమే తీసుకున్నట్టు ఉండదా ? అది మన బాధ్యత కాదా? మన కుటుంబంలో తప్పు జరిగితే , మనలో మనమే చూసుకోవాలి గాని .. ఇలా రచ్చకెక్కకూడదుగా ...లింగ :- బాధ్యతా? ఏరా మొన్న జరిగిన ఎలెక్షన్లలో ఓటేసావా?


సింగ :- అంటే .. అర్జెంట్ పని వల్ల , బూత్ కెళ్ళ లేకపోయాను రా !!


లింగ :- మరి ఇంకేం బధ్యత రా .. ఓటెయ్యడానికి లేని బాధ్యత , ఆటలకి వెల్తే మటకూ నిలబడుతుందా? నీలాంటి వాళ్ళవల్లే , ఇప్పుడు దేశం పరువుపోతోంది ..
సింగ :- ఏంటి దేశం పరువు తీసేసానా ? నేనా? పిచిగాని ఎక్కిందేంటిరానీకు ? నా ఒక్క ఓటుకి దేశం పరువుకీ సంబంధం ఏంటి  ..

లింగ :- అదే .. నువ్వు వెయ్యవు , నిన్ను చూసి నీ పక్కోడుకూడా నాకెందుకు అనుకుంటాడు .. ఇలా అందరూ అనుకోబట్టే , ఈనాడు చేతగాని వాళ్ళందరూ అందలం ఎక్కి, ఇస్టం వచినట్టు , స్కాములు చేసేసి దేశం పరువు తీసేస్తున్నరు.. 35,000 కోట్లు ఖర్చు పెట్టి , కూలిపోయే స్టేడియాలు,నాసిరకం వసతులు , ఇంకా పూర్తి గాని పనులూనా ? ఒక పక్క ఒలింపిక్స్ కి మన పక్క దేశం, చైనా , ఎంత బాగా జరిపింది ... ఆఖరికి "డార్క్" ఖండం ఆఫ్రికా కూడా మొన్న సాకర్ వరల్డ్ కప్ నువ్వా నేనా అన్నట్టు చేసింది .. నూరు కోట్ల జన సంపద ఉన్న మన భారతానికి ఎమిట్రా ఈ దౌర్భాగ్యం... ఇంత జరిగినా , స్కాములు చేసిన మంత్రులూ బాగనే ఉన్నారు .. వాళ్ళని నడిపే "అమ్మలు" కూడా బానే ఉన్నారు .. మన ఆత్మగౌరవమే , చేతగాని నాయకుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంది ... ఢిల్లీ నగరం ఇప్పటికే ఒక్క వానొస్తే సముద్రమైపోతోంది , ముందు దాన్ని బాగుచెయ్యకుండా , గేములకొచ్చే వాళ్ళ "టిష్యూ పేపర్"లకి 4 కోట్లు , .. ఎమైనా అంటే గేములవ్వనివ్వండి , పరువు తియ్యకండి అనడమా? పరువు ఎవరు తీస్తున్నార్రా ?

సింగ :- ఆటలకి వెల్దామన్న ఒక్క మాటకి ఇంత క్లాసు పీకుతావా ... ఇది ఘోరం .. నేను ఖండిస్తున్నా ..లింగ :- ఖండించటం కన్నా , నువ్వూ నేనూ , ఇంకేం చెయ్యగలంలేరా ..


సింగ :- ఒక్కటి చెయ్యగలమేమోరా !!


లింగ :- ఏంటది? సమ్మెలు చెయ్యడమా ? అవి వాళ్ళని ఏమీ చెయ్యవు , దున్నపోతు మీద వాన పడ్డట్టు , మన నోరునొప్పి తప్ప ..


సింగ :- కాదు !! వచ్చే ఎన్నికలలో తప్పకుండా ఒటెయ్యడం !!


లింగ :- చూద్దాం .. కాని వాళ్ళ లెక్కలు వాళ్ళకున్నాయ్ ..వారసులు అనే బ్రహ్మాస్త్రం ఉందిగా..దానికి తగ్గట్టు గా తగిన "కోచింగ్" కూడా నడుస్తోంది


సింగ :- అరెరే !! నిజమే కదా !!

Friday, 20 August 2010

ఒక కొత్త "ఇజం"


సింగ :- ఒరే లింగం ! దేశం లో ఒక కొత్త "ఇజం" మొదలైంది తెలుసా ..

లింగ :- ఇంకో కొత్త "ఇజమా" , ఇప్పుడేం మొదలైంది ?

సింగ :- "కన్వర్షనిజం "

లింగ :- పేరు బాగుంది ! కాని ఏంటిది?


సింగ :- తెలీదా ! ఎప్పటినుంచో ఉన్నదే , మతమార్పిడులు .. ఒకప్పుడు , గుట్టుగా జరిగేవి .. ఇప్పుడు  "పెద్దల" అందదండలతో మహ జోరుగా జరుగుతున్నాయిలే


లింగ :- అవున్రో విన్నాను ! అంతెందుకు మన దానయ్య లేడూ , వాడేరా కరణం గారి పాలేరు కొడుకు ,ఉద్యోగం అని పట్నానికి  వెళ్ళి , "ధర్మపాదం" గా తిరిగొచ్చడు .. మతం మారినందుకు 10,000 ఇచ్చారంట , విదేశాలనుంచి దబ్బులొస్తాయంట , అన్ని సౌకర్యాలూ ఉంటాయంట .. వీడు చెయ్యల్సిన పనల్లా , వీడిలా అందరిని మతం మార్పించడం ...

సింగ :- ఇదే మరి నేటి కొత్త "ఇజం" ..లింగ :- ఎప్పుడో మొదలైనవేగా ఈ మార్పిడులు .. ఇప్పుడు కొత్తగా చెప్తున్నావేం , పైగ "ఇజం" అంటున్నావ్ ..


సింగ :- ఎందుకంటే , ఇది నేడు దేశంలో బాగా విస్తరించిన ఒక "నెట్ వర్క్" కాబట్టి ... అన్ని రకాల అండదండలూ , ధనబలం , వార్తాసాధనాలద్వారా ప్రచారం పక్కాగా సమకూర్చబడుతున్న ఒక సంస్థ కాబట్టి.


లింగ :- అంటే ?


సింగ :- సరిగ్గా చూడు .. గత ఐదేళ్ళలో , హిందూ స్వాములపై , పీఠాల పై , ఆచార్యుల పై , ఎన్ని కేసులూ , ఎంత నిఘా , ఎంత కవరేజీ జరిగిందో .. ఆఖరికి పరమ పవిత్రమైన తిరుమలను కూడా వదలకుండా , ఈ "ఇజం" ఎంతలా వేళ్ళూనుకుపొయిందో ..


లింగ :- నువ్వు హిందువువని ఇలా అంటున్నావనుకోవచ్చుగా ..


సింగ :- నేను మాత్రమే కాదు , ఈ మార్పిడుల్లో సాయ పడుతోంది కూడా హిందువులేరా ... కాని పేద హిందువులు ... పూర్వం బ్రిటీషు సైన్యం లో సగం మంది భారతీయులే ఉన్నట్లు ... ఈ "ఇజం" లో కూడ సగం మంది కార్యకర్తలు పేద హిందువులే , వాళ్ళ పేదరికానికి డబ్బు ఎరగా వేసి ఆకర్షిస్తున్నారు ..

లింగ :- టెర్రరిష్టు సంస్థల్లా తయారయ్యారంటావు ..సింగ :- మన దేశ సంస్కృతి లో భాగమైన పరమతసహనం అనే పదానికి వక్రభాష్యం లా తయారయ్యారు .. పొరుగుమత దైవాలని బండ బూతులు తిట్టడం .. బురద జల్లడం .. వారి ఆత్మగౌరవాన్ని కించ పరిచేలా ప్రవర్తించటం .. ఇదే వీళ్ళ దినచర్య ...లింగ :- వీళ్ళకింత ధైర్యం , డబ్బూ , ఎక్కడనుంచొస్తున్నాయో ?


సింగ :- ఇంకా అర్ధం కాలేదా .. మనం ఇంకా బానిసత్వంలోనే ఉన్నామురా ... భారతదేశానికి అధ్యాత్మికత అనేది వెన్నెముక అని , దానికి పట్టుగా నిలిచే పక్కటెముకలు ఈ రకరకాల మతాలని కనిపెట్టి , "విభజించి పాలించు " సూత్రాన్ని పాటిస్తూ దేశానికి స్వాతంత్రం ఇస్తూనే , మత చిచ్చు పెట్టి పొయారు తెల్లోళ్ళు .. వాళ్ళ వారసులుగా , ఈ "ఇజం" పాటించే వాళ్ళు తయారయ్యరు ..


లింగ :- అంటే ఇదంతా చేయించేది బ్రిటీషు వాళ్ళే అంటావా?


సింగ :- మనం అద్దం లాంటి వాళ్ళమ్రా .. ఆ రాయే కాదు , ఏ రాయి తగిలినా పగిలిపోతాము , అలా దశాబ్దాలు గా పగుల్తూనే ఉన్నాం ..


లింగ :- మరి దీనికి అంతం లేదా?


సింగ :- ఇక్కడ ఒక విషయం మర్చిపోతున్నారు వారు .. ఒక అద్దం లో ఒకటే కనిపించే బింబం , అది పగల కొట్టగానే , వేల అద్దాలలో వేల బింబాలుగా ప్రతిఫలిస్తుంది .. ఒక బింబాన్ని నాశనం చెద్దామని వచ్చినవాళ్ళకి , వేల బింబాలు దర్శనమిస్తున్నాయి .. అందుకే , ఆ ఉక్రోషం లో చెస్తున్నవే ఈ తాటాకు మోతలు ..


లింగ :- సరైన మాటన్నావ్ ! జై హింద్ ..


సింగ :- జై హింద్

Wednesday, 18 August 2010

సింగ,లింగ రాజుల జుగల్బందీ

ఒకానొక సాయంకాలపు ముచ్చట్లలో , మన సింగ రాజు & లింగ రాజు పక్కనే ఉన్న గోదారి అలలను చూసీ,మెల్లగా ఇక సెలవంటూ వెళ్ళిపోయే సందె సూరీణ్ణి చూసి కవితావేశం పెల్లుబికి , చిన్న కవితా జుగల్బందికి సిద్దమయ్యారు


సింగ :- ఒక నిర్వేదం
            కదిలి వచ్చే చీకట్లమాటుకు
            తరిలి పోయే నేస్తాన్ని చూస్తూ
            పొద్దుతిరుగుడు పూల ఎదలో
           అల్లుకునే విషాద నాదం


లింగ :- ఒక ఉత్సాహం
            విరహమింక చాలునంటూ
            వలచి వచ్చే వెన్నెలను చూసి
            కొలనులో కలువల బుగ్గల
            తళుకుమనే సిగ్గు ముత్యం

సింగ :- ఒక నిస్తేజం
           పగలంతా పనుల మునిగీ
           ఒడలుమొత్తం అలిసిపొయీ
          ఉసూరంటూ ఇల్లు చేరే
           సగటు జీవి ఆయాసపు నిశ్వాసం

లింగ :- ఒక ఆనందం
          వేచి ఉండే ఆలుబిడ్డల
          పంచచేరి  కాలంగడిపగా
         పగటి కష్టం మరిచిపొయే
          అందరి ఉల్లాస సమయం
 
సింగ :- ఈ నిశీధి , ఒక నేటికి సమాధి

లింగ :- ఈ నిశీధి , ఒక రేపటికి నాంది

సింగ :- బ్రతుకైనా , బరువైనా ..
           నిజమైనా , నిష్టూరమైనా ...
           ప్రతి ఆరంభపు చివరి అంకం
          ప్రతి వెలుగూ చేరే శూన్యం
          ఈ చీకటి


లింగ :- అవమానాలే ఎదురైనా
           అలుపు లేక సాగమంటూ
          మలుపు దాటితే ఉషొదయమే
          స్వాగతించునని చాటి చెప్పే
          ఆదర్శమే ఈ చీకటి..

సింగ :- ఇంక చాలు లేరా , ఇంటికి పోదాం , ఆకలి వేస్తోంది


లింగ :- అవున్రా ! కడుపులో అన్ని రకాల జంతువులూ ,ఉస్సైన్ బోల్ట్ కన్నా స్పీడ్ గా పరిగెట్టేస్తున్నాయి


అంటూ ఇంటి ముఖం పట్టారు ... ఎంతటి భావోద్వేగమైనా , ఆకలిని మించినది కాదు కదా !!

Monday, 16 August 2010

సింగ రాజు సంగీతం-లింగ రాజు సాహిత్యం

ఒక అపరాహ్నవేళ ...

సుష్టుగా భోజనం చేసి ... నోటి నిండా కిళ్ళీ వేసుకుని.. ఏ లోకోత్తరమైన విషయం మీద చర్చిద్దామా అని మన రాజులిద్దరూ సమాలోచనలు జరుపుతున్న సమయం...


దూరంగా , ఆకాశవాణి లో "గోదారి గట్టుందీ ..." అనే పాత పాట వినపడుతూంటే , ఆ సంగీతానికీ ఆ సాహిత్యానికీ పరవశులయ్యి .. నములుతున్న కిళ్ళీలు ఐపొతే , తాపీగా చుట్ట వెలిగించుకుని , ఆకాశం కేసి చుస్తూ..


సింగ :- ఆహా ! ఎంత మంచి సంగీతం రా లింగా ! మనసులోంచి వచినట్టుందిగా ..

లింగ :- మరే ! ఆ సాహిత్యం చూడు , మనసుకి హత్తుకునేలా లేదు..


సింగ :- అవున్రా లింగం ! ఎంతైనా సంగీతానికి సాహిత్యానికి ఉన్న శక్తి మరేదానికీ లేదంటాను .. ఏమంటావ్?

లింగ :- రైటైన మాటన్నావ్రా సింగా ! మనసు తేలిపొతుందనుకొ ... అవును నీకు సంగీతం అంతే ప్రాణం అనుకుంటా , ఏవో రెండు మూడు నాటకాలలో హార్మోనియం కూడా వాయించినట్టున్నావ్ ?
 
సింగ :- మరే ! నీకు కూడ సాహిత్యమంటే ఇష్టం అనుకుంటా ?లింగ :- కరష్ట్ !

సింగ :- ఐతే , నేనొక రాగం వదులుతాను , ఆశువుగా పాటనల్లగలవా?


లింగ :- నేను రెడీ ! నువ్వు నా సాహిత్యానికి తగ్గ స్వరాలు అందించగలవా ?


సింగ :- అబ్బో , సరే ఐతే కాసుకో ... జై కె .వి. మహదేవన్ గారు ..

లింగ :- జై సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు...

సింగ :- "తన తాన నాన .. తన తాన నాన ..తానాన నాన తాన తాన తందానా .."

లింగ :- "తన తాన నాన .." ఇదెక్కడో విన్నట్టుందే ... ఆ .. "కన్నె పిల్లవని కన్నులున్నవని , ఎన్నెన్ని కలలు కంటున్నావే చిన్నారీ " ... ఈ పాట కదూ , దొంగ నా "___" ... కాపీ కొట్టి నీ సంగీతం అని చెప్పేసుకుంటావా?సింగ :- ఏం మన మ్యూజిక్ డైరెక్టర్లు ఇదే పని చేస్తే , సూపర్ అంటావా? నేను చెస్తే తిడతావా? పాట కట్టలేను అని చెప్పరా , ఈ కబుర్లన్నీ ఎందుకూ ?
 
లింగ :- అంత మాటంటావా ? చూడరా తెలుగు పారడీ పవర్ చూపిస్తాను..."కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని కలలు కంటున్నావే చిన్నారీ "


" పల్లవి :- పీఠమున్నదని , అడ్డు లేదు అని , ఎన్నెన్ని స్కాములు చెసేస్తావు ఓ మంత్రీ ...


             నోటు పుచ్చుకుని , నిన్ను ఎన్నుకుని , తప్పు చేసిందిక మేమేలేవో మా మంత్ర్రీ ...

              దుర్మాగం నీదైతే ...


               దౌర్భాగ్యం మాదంటా ... "                     ||పీఠ||


"కవిని నేనై ... నాలో కవిత నువ్వై ..."


చరణం :- బలుపు నీదై .. నీ బలి పశువు మేమై ...


             కంచే.. చేనుని.. మేస్తే


              ఓటు మేమై ... మా వెన్నుపోటు నువ్వై ...


              నీ దురాశకే ...పుడమే.. జడిసీ ...పోయే ... "
 
సింగ :- భలే భలే ! బాగా రాశావ్ ....లింగ :- మరేమనుకున్నావ్ .. సంగీతం కాపీ కొట్టినా , సాహిత్యం లో మనకు మనమే సాటి ... ఒక్క వేటూరి పాట చాలు , తెలుగు సాహిత్యం తియ్యదనం రుచి చూడటానికి..


సింగ :- బాగుంది ... ఇలాంటి మెలొడీలేనా , లేక ఫాష్ట్ పాటలకి కూడా పారడీలు కడతావా ?


లింగ :- దేనికి కట్టమంటావ్ ?


సింగ :- నాగర్జున , "రక్షకుడు" సినిమా లొ నా ఫావరైట్ ..


       " సోనియా సోనియా ...స్వీటు స్వీటు సోనియా ..


            రేగుతోందె లేత వయసు జోరూ ...


             ఘాటు లవ్వు రెండు టైప్సు .. నీటుదొకటి నాటుదొకటి


             రెండిట్లో ఏది నీకు ప్యారూ .."


లింగ :- ఓహో ! కొంచెం కష్టమే ...


సింగ:- ఐతే ఓడిపొయావా?


లింగ :- కష్టమన్నా గాని , చెయ్యనన్నానా? ఊ .. హూ... ..................ఆ.. కాస్కో ..


               " సోనియా సోనియా ...సీటు సీటు సోనియా ..


                ఇవ్వవమ్మ కాసులిచ్చు సీటు ..


                కామన్వెల్త్ గేములైన .. ఖనిజ గనుల స్కాములైన..


              మాకు అవే వేల వేల కోట్లూ .. "
 
సింగ:- శెభాష్ !!లింగ :- థాంక్యూ !!

Tuesday, 10 August 2010

లింగ రాజు బెంగ పడితే..."కందువగు హీనాధికములిందు లేవు,
అందరికి శ్రీహరే అంతరాత్మ..
ఇందులో జంతు కులమంతానొకటే
అందరికి శ్రీహరే అంతరాత్మ.."

దూరంగా అన్నమాచార్య కీర్తన వినిపిస్తూంటే , మన సింగ రాజు సైకిల్ మీద ఈలేసుకుంటూ గోదారి గట్టున ఉన్న చింతచెట్టు దగ్గరకి వెళ్తున్నాడు .


అప్పటికే మన లింగ రాజు అక్కడకొచ్చేసి ఎప్పటిలానే ఏదో ఆలోచించటం మొదలు పెట్టేసాడు ..సింగ :- ఎమ్రో ! అప్పుడే ఏదో ఆలోచించేస్తున్నావ్ ! మన శెట్టి గారి అప్పు ఎలా ఎగ్గొట్టాలనా?లింగ :- ఏడిసావు లే గాని , నా మనసేమి బాగోలేదు ఈ రోజు నన్నేమి మాట్లాడించకు ..


సింగ :- ఎమైందిరా , ఎవరేమన్నారు?


లింగ :- ఎవరో ఎదో అన్నారని కాదు , ఎం , నాకు మనుసుండదా , నాకు బాధ రాకూడదా ?సింగ :- ఒరే ఒరే ! ఆగు , ఇంత బాధ పడుతున్నావంటే ఎదో జరిగింది .. ఎమైంది..లింగ :- ఛీ , ప్రశాంతంగా బాధ కూడ పడనివ్వరు కదా .. సరే విను ... ఈ రోజు నా మావయ్య కొడుకు పట్నం నుంది వచ్చాడు , ఎంత డాబు , ఎంత దర్పం అనుకున్నావ్ .. వాడి ముందు నా వాలకం చూసి అందరూ నవ్వారు తెలుసా , మనం కూడా పట్నం లొ చదివి ఉంటే ఇంకా గొప్ప గా ఉండే వాళ్ళం ఎమో .. చాలా చిన్నతనం అనిపించింది , అందుకే ఇక్కడకి ఇంత త్వరగా వచ్చేశాను ...
 
సింగ :- ఓరినీ ... ఇదా సంగతి ..


లింగ :- నీకు చెప్పుకున్నానని అలుసైపొయానా? , ఇది నీ దాకా వస్తే తెలుస్తుంది , ఎంత పెద్ద సంగతో...

సింగ :- అలా అని కాదురా లింగం , సరే , కొన్నేళ్ళ క్రితం మన ఊరొచ్చిన ఓ స్వాములోరు చెప్పిన కధ చెప్తాను విను

లింగ :- ఎవరూ ఆ పెద్ద స్వాములోరా?సింగ :- ముందు కధ వినెహై ... పూర్వం సృష్టి చేస్తున్న చతుర్ముఖుడి దగ్గరకి..

లింగ :- తెలుగు లో చెప్పెహై ..


సింగ :- ఖర్మ ! బ్రహ్మ దేవుడి దగ్గరకి రెండు ఇసుక రేణువులొచ్చి .. "అయ్యా , మాకు కూడా ప్రపంచం లో పెద్ద స్థానం ఇవ్వండి ప్రభూ " అని కోరుకున్నాయి ..

లింగ :- ఇసుక రేనువులు , పెద్ద స్థానమా? కామెడీ !!

సింగ :- లింగం .. కధ విను ..


లింగ :- చెప్పు చెప్పు
సింగ :- ఆ పెద్దాయన అప్పుడు , " సరే" అని , రెండిటిని మన భూమ్మీద పడేసి , సరిపడంత నీరు , మట్టి , గాలి ఇచ్చి , "మీ ఇష్టం వచినట్టు ఎదగండి " అనేసి వెళ్ళి పొయాడు .. అలా కొన్ని వందల ఏళ్ళు ఐపొయాయి..


వాటిలో ఒక ఇసుక కణం , ఎన్ని కష్టాలొచ్చీనా తట్టుకుని , తనకిచ్చిన గాలి తో ఇంకొన్ని ఇసుక కణాలు పొగేసుకుని , ఆ మట్టి , నీరు అన్నిటి తో కలుపుకుంటూ , నెమ్మదిగా , పెద్దగా , ఎదిగి ఒక పర్వతమైపొయింది ...

లింగ :- నీరు ,మట్టి కలపడం ఏంటి , పర్వతమవ్వడమేంటి ... నాకర్ధం కాలేదు , ఎదొ లాజిక్ లేనట్టుందే..
సింగ :- అంత లాజిక్ తో చెప్పడానికి , నెనేమన్నా సైన్సు పాఠం చెబుతున్నానా ? యక్ష ప్రశ్నలాపి కధ విను ..

లింగ :- ఎం ప్రశ్నలు ?

సింగ :- కధ విను బే !
లింగ :- ఓ.కె


సింగ :- ఎక్కడున్నాం ? ఆ , అది అలా పర్వతమవ్వగా , రెండో ఇసుక రేణువు , ఆ పెద్దాయన ఇలా వెళ్ళగానే మహా హుషారుగా , పని మొదలు పెట్టింది ... కొన్నాళ్ళు బానే నడిచింది .. ఈ లోగా  చిన్న తుఫాను రావటం  అప్పటిదాకా పేర్చుకున్న కుప్ప కాస్తా ఎగిరిపోవటం , మళ్ళ్ళీ మొదలు పెట్టడం , ఇలా కొన్ని సార్లు జరిగేసరికి , నీరసించిపొయి , ఇంక మనవల్లేం అవుతుంది లే , అని పక్కనే పర్వతంగా ఎదుగుతున్న ఇసుక రేణువుని చూస్తూ , తన అదృష్టాన్ని తిట్టుకుంటూ .. ఇసుక రేణువు గానే మిగిలిపోయింది ..


లింగ :- అంటే , నెను ఆ రెండో ఇసుక రేణువునంటావ్ ?

సింగ :- నువ్వే కాదు రా , మనం మన స్వశక్తిని నమ్మనంత కాలం అందరం ఆ రెండో ఇసుక రేనువు లాంటి వాళ్ళమే


లింగ :- బాగుంది రా , సమయానికి నా శక్తి గురించి గుర్తు చేసి , నన్ను డిప్రెస్ అవ్వకుండ కాపాడావు.. ఇంత మంచి కధ ని ఆ పెద్దస్వాములోరే చెప్పారా? అప్పుడెం మాట్లాడినట్టు గుర్తులేదే ..

సింగ :- లేదు


లింగ :- మరెవరు చెప్పర్రా?

సింగ :- మనమే !!!

లింగ :- వార్నీ....

Saturday, 7 August 2010

బాతాఖానీ--సింగ రాజు & లింగ రాజు

సింగ రాజు & లింగ రాజు ఇద్దరూ ప్రాణ స్నేహితులు .
నిక్కర్లేసుకునే  కాలం నుంచి ఇప్పటి దాకా మనస్పర్ధలే రాలేదు  వీరి మధ్య ( ఎందుకంటే 80 % ఒకడు చెప్పేది ఇంకోడికి అర్ధం కాదు కాబట్టి !!).

షొలే సినిమా చూసి అమితాబ్ & ధర్మేంద్ర లా ఊహించేసుకుని గబ్బర్ సింగ్ కోసం తూర్పు & పశ్చిమ గోదారి జిల్లాల్ని సైకిళ్ళేసుకుని చుట్టొచ్చి , ఎవరూ దొరక్క తమ ధాటికి పారిపొయాడనుకునే వీరి వాలకం చుస్తే , పరమనందయ్య శిష్యుల్లో ఇద్దరు మళ్ళీ పుట్టారేమో అనుకుంటరెవ్వరైనా.

ఆలాగని వీరి మాటలను మరీ తీసి పారెయ్యలేం , వీళ్ళకి తెలియకుండానే కొన్ని నిజాలు కుండ బద్దలు కొట్టెసేలా చెఫ్ఫేస్తారు .. ఇలా ఎన్ని కుండలు బద్దలయ్యాయో ఉభయగొదావరి జిల్లల్లో లెక్కే లేదు.
వాళ్ళ "ఇంటెలెక్చువల్ డిస్కషన్" ని ఇలా బ్లాగ్ లొ పెడతానని నేను వాళ్ళని అడగటానికి వాళ్ళ ఊరు వెళ్ళా ... అదే మన కధ కి మొదలు ....


నేను :- నమస్తే సింగ రాజు గారు , నమస్తే లింగ రాజు గారు ..

సింగ :- "నమస్తే"
(లింగ రాజు గారు తనని కానట్టు ఏదో దీర్ఘాలొచన లో మునిగి ఉన్నారు)

సింగ :- ఒరేయ్ లింగం , నమస్కారం చెయ్యరా , నమస్కారనికి ప్రతి నమస్కారం , సంస్కారం .

లింగ :- "ఇదిగో నమస్కారం తీసుకొవయ్యా" అని నాకొక దండం పెట్టి, సింగ రాజు గారికేసి తిరిగి అదికాద్రా సింగా , అసలు సంస్కారం అంటే ఏంట్రా ?

సింగ :- నలుగురిలో ఒక పద్దతి గా నడుచుకోవటం.

లింగ :- అంటే?
 
సింగ :- అంటే, పెద్ద వాళ్ళని గౌరవించటం , తిట్లూ బూతులూ అందరి ముందూ మాట్లాడక పోవటం ఇలాగన్నమాట ...


లింగ :- ఒహో ! అయితే మన ఊరి MLA కి లేనిదే ఈ సంస్కారమన్నమాట !!

సింగ :- అదేంట్రా?

లింగ :- అసెంబ్లీ లో మాట్లడటం వినలేదా, నోరు తెరిస్తే కంపే కంపు ... ఏ స్కూల్లో చదివాడో తెలుసుకుని ఆ స్కూలుకి పంపించను నా పిల్లల్ని ..

సింగ :- పిల్లలా? పెళ్ళే కాలేదు కద రా నీకు

లింగ :- అమ్మాయి దొరకాలి కదా..

సింగ :- నీ మొహం !! నా మాట విని తొందరగా చెసుకో , లేకపొతే భవిష్యత్తు లో అవ్వదు

లింగ :- ఏ ? డిసెంబరు 2012 కి పోతామనా?

సింగ :- నీ మొహం

లింగ :- ఆ మధ్య వచ్చిన సినిమా  లో ఇదే చూపించారు గా

సింగ :- అదేమి కాదు , ఆడ పిల్లల సంఖ్య తగ్గిపొతోంది, తెలియదా?

లింగ :- ఇదేం గొడవ రా బాబు .. వీళ్ళు కూడా అంతరించిపోతారంటవా? ఏంటో ఈ కష్టాలు... మరి నాయకులు , పెద్దవాళ్ళు , మేధావులు ఎం చేస్తున్నార్రా?

సింగ :- వాళ్ళేం చెస్తారెహై ! వాళ్ళకి పెళ్లిళైపోయుంటాయి
 
లింగ :- ఔన్రా సింగా !! ఇదేదో ఆలోచించాల్సిన విషయమే..అవున్రా మరి అతిథులొచ్చినప్పుడు , వారిని అవమానించి పంపడం కుడా సంస్కారమేనా ?


సింగ :- అది సంస్కారేమేంటి? పొగరు .. ఇప్పుడు ఎవరు ఎవర్ని అవమానించార్రా ..

లింగ :- నువ్వు కూడ మన విదేశాంగ మంత్రి లా మాత్లడుతున్నావే..

సింగ :- వాడెవడెహై ..

లింగ :- ఫారిన్ మినిస్టర్రా బాబు ...

సింగ :- అది అలా చెప్పు ..

లింగ :- ఖర్మ ! సరేలే , ఈ మధ్య మన పక్కదేశానికి మాట్లాడటానికి వెళ్ళినప్పుడు , నలుగురు ముందు ఎలా  మాట్లడారో చుసావు గా ..

సింగ :- మన వాడేం వెలగ పెట్టాడో !

లింగ :- అవన్నీ పక్కన మాట్లాడుకొవాలి గాని , మాటలకి అని పిలిచి ఇలా చెయకూడదు కద రా ..

సింగ :- అయినా , ఆ మంత్రి కి లేని బాధ నీకెందుకు రా , మన మన్మోహన్ సింగ్ అన్నా తర్వాత మాట్లడాడు కాని ,ఈ మంత్రి కిమ్మనలేదు చూసావా ..

లింగ :- ఏం చెస్తాము రా , పిల్లనిచ్చాక ఇవన్ని తప్పుతాయా !!

సింగ :- పిల్లనిచ్చామా? ఎవరు ?

లింగ :- ఎంటెహై తెలియనట్లు మాట్లడతావు , మొన్నే గా మన సానియా ని వాళ్ళబ్బాయి కి ఇచ్చి చేశాం

సింగ :- ఓహో అలా వచ్చవా !!


అని అప్పటికి నెనున్నాను అనే విషయం గ్రహించి , ఏం కావాలి అన్నట్టు చూశారిద్దరూ..

"నమస్తే !! నేను మీ సాయం కోసం వచ్చాను ..ఏం లేదండీ మీరు ఒప్పుకుంటే మీ కబుర్లను నా బ్లాగ్ లో పెడతాను" అని నా మాట విని.. చిద్విలాసంగా నవ్వుతూ ఒప్పుకున్నారు            -- courtesy  సింగ రాజు & లింగ రాజు