Wednesday, 7 December 2011

నా మొదటి శతకం - కొన్ని పద్యాలు

తెలిసె నేఁడు నాకు తెలుగులో మాధుర్య
మందమైన భావమంకురింప
తెలుగు తరచి చూడఁ దేనె ధారలు జారు
చక్రి పలుకు వినుఁడు సత్య వాక్కు

అంబరంబునంటు హర్మ్యాళి  నిర్మించె
విశ్వమంత నిలిచి విస్తుబోవ
మనిషి మింటికేగె మరిచి తన భువిని
చక్రి పలుకు వినుఁడు సత్య వాక్కు

వింతగొలుపుఁ జూడ విత్తు మొలచు తీరు
నెదుగు నేల గుణముకెదురు నిలిచి
స్థితులు గతులు వెతలు స్థిరచిత్తునాపునే ?
 చక్రి పలుకు వినుఁడు సత్య వాక్కు

తాతలిడిన  యాస్తి తమగొప్పగన్ జూపి
విర్రవీగు చుంద్రు వింత గాను
తెలిసికొనఁగవారు తెలివైన సోమరుల్
చక్రి పలుకు వినుఁడు సత్య వాక్కు

కులము పేర ఖలులు కూడఁగట్టు బలిమి
మానవత్మమెదుట మనఁగఁబోదు
తిమిరచయము తొలఁగు దినకరద్యుతి సోక
చక్రి పలుకు వినుఁడు సత్య వాక్కు 

7 comments:

 1. బాగున్నాయండీ అభినందనలు! నాలా తుంటరిగా వ్రాసారనుకున్నాను! నిజంగా బాగా రాసేసారు!

  ReplyDelete
 2. కృతఙ్ఞతలండి రసఙ్ఞ గారు ... ఇవి నా ఇంజనీరింగ్ మూడవ సంవత్సరంలో వ్రాసినవి .. మీకు నచ్చినందుకు సంతోషమండి ..

  ReplyDelete
 3. చాలా బాగున్నాయి పద్యాలు. మంచి ధార. పద్యరచనలో ఇక మీరు వెనుదిరిగి చూడ నవసరం లేదు. అభినందనలు.

  ReplyDelete
 4. శంకరయ్య గురువర్యా ! నమస్కారమండి . నా బ్లాగుని దర్శించి నా పద్యాలపై ప్రతిస్పందించినందుకు కృతఙ్ఞతలండి. అంతా మీలాంటి పెద్దల ఆశీర్వాదం

  ReplyDelete
 5. స్థితులు గతులు వెతలు స్థిరచిత్తునాపునే ? - wonderful!

  రెండవ పద్యంలో మొదటి పాదం నువ్వు మొదట రాసుకున్నట్టుగా
  "అవనినంత తొలచి హర్మ్యాలు నిర్మించె" అనే ఉంచి ఉంటే ఇంకా బావుండేది అని నా అభిప్రాయం :)
  నీ పద్యాల్లో ఒక్క సారే చదివినా నాకు బాగా గుర్తుండిపోయిన పద్యం ఇది.

  ReplyDelete
 6. అందంగా , పొందికగా ఉన్నాయి పద్యాలు ,మీ కృషినిలాగే కొనసాగిస్తే ఇంకా ఇంకా మధురమైన మరిన్ని శతకాలను మీనుండి ఆశించడం అత్యాశేమీ కాదు ! అస్తు !

  ReplyDelete
 7. డా. విష్ణు నందన్ గారూ ,

  ధన్యవాదాలండి మీ ఆశీస్సులకి . తప్పకుండా కృషి కొనసాగిస్తాను

  ReplyDelete