Wednesday 22 February 2012

సింగరాజు -- మాతృభాషా దినోత్సవం ఏర్పాట్లు

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవానికి , ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి , ఊళ్ళో తన పలుకుబడి పెంచుకుందామనుకున్న సింగరాజు దాని ఏర్పాట్లలో ' బిజీ' గా ఉన్నాడు . మధ్యలో మన లింగరాజు ఏదో పని తగిలి 'కాల్ ' చేసాడు .


సింగ :- ' హలో '
లింగ :- ' హలో ....' 


సింగ :- ' హలో .. హలో  ... సరిగ్గా వినపడట్లేదు , 'సిగ్నల్ వీక్ 'గా ఉన్నట్టు ఉంది , కొంచెం గట్టిగా మాట్లాడండి '


లింగ :- ఒరేయ్ , నేను లింగాన్ని , వినపడుతోందా ఇప్పుడు ? 


సింగ :- లింగా ! నువ్వా ! 'ఫైన్ 'గా వినపడుతోందిప్పుడు .. ఏంటి 'మాటర్ ' ఇప్పుడు ' కాల్ ' చేసావు  ?


లింగ :- ఏరా పన్లో ఉన్నావా ? పర్లేదా మాట్లాడొచ్చా ?
సింగ :- కొంచెం 'బిజీ ' గా ఉన్నాన్రా , 'ఫంక్షన్ ' ఏర్పాట్లలో ఉన్నాను .
లింగ :- ఏం ' ఫంక్షన్ ' రా ? ఇంట్లో ఏమన్నా విశేషమా ?
సింగ :- ఇంట్లో కాదెహై ! ఈ రోజు ' ఇంటర్నేషనల్   మదర్ లాంగ్వేజ్  డే'  , ' సో '  మన  ఊళ్ళో పెద్ద 'ఫంక్షన్ ' ఏర్పాటు చేస్తున్నాను .
లింగ:- అవునా ! మాతృభాషా దినోత్సవమా ?
సింగ :- ఏ నీకు తెలీదా ? ఎలాగా తెలుగుని 'యూజ్' చెయ్యరు , కనీసం ఇలాంటి 'డేస్ ' అయినా  ' మైండ్'లో పెట్టుకోండిరా. ఎప్పుడు 'చేంజ్' అవుతారురా మీలాంటి వారు . 'వరల్డ్'లో జనాలు  మొత్తం వారి వారి 'లోకల్ లాంగ్వేజెస్ ' ని కాపాడుకోవలనే 'థాట్' తో  ' పెట్టింది ఈ 'డే' ని . ఇలాగైనా జనాలు తమ ' నేటివిటీ ' ని గుర్తుపెట్టుకుంటారు అని  'హోప్ ' . ఇప్పుడు మీ లాంటి 'సిల్లీ ఫెల్లోస్ ' వల్ల ఆ ' హోప్' కూడా 'లెస్ ' అయిపోతోంది .


లింగ :- ఆపరా బాబు , సమయం చిక్కితే చాలు నామీద విరుచుకుపడతావు . ఇంతకీ ఈ శుభసందర్భంలో నువ్వు ఏం చేస్తున్నావో అది చెప్పు . ఏదో ఏర్పాట్లు అంటున్నావ్ ,ఎమిటో అవి ?


సింగ :- అబ్బో , ఎన్నో చేస్తున్నాం , చాల పెద్ద 'ప్లాన్ '. ఉదయం మన 'గవర్నమెంట్ స్కూల్ ' పిల్లలకి 'తెలుగు భాష యొక్క ఆవశ్యకత ' అనే 'టాపిక్' మీద ' ఒన్ అవర్ ' చిన్న 'ప్రెజెంటేషన్ ' ' అరేంజ్ ' చేసాం .  వాళ్ళందరి చేతా తెలుగులోనే మాట్లాడతాం  అని ఒట్టు పెట్టిస్తాం .


లింగ :- ఆలోచన బాగుంది , కాని ప్రభుత్వ పాఠశాల ఎందుకు  దీనికి . వారిది ఎలాగ తెలుగు మాధ్యమమేగా . ఆ చేయించేదేదో  ఏ ఆంగ్ల మాధ్యమ పాఠశాలవారితోనో చేయించొచ్చుగా


సింగ :- ఆ 'ఇంగ్లిష్ మీడియుం స్కూల్ ' వాళ్ళకి ఏవో 'ఎక్స్ట్రా క్లాస్ ' లున్నాయంట , పైగా వారిది  'IIT కోచింగ్ 'సమయం అట ఇది , దానికి తోడు , ఎన్నో ' టాలెంట్ టెస్ట్ 'లకి  వాళ్ళ పిల్లలు ' ప్రిపేర్ ' అవుతున్నారంట . 
         'సో ' ఈ 'టైం'లో పిల్లలని ' డిస్టర్బ్ ' చేస్తే , వాళ్ళ 'మార్క్స్ ' తగ్గితే , ' పేరెంట్స్  ' గొడవ చేస్తారని , 'స్కూల్ రెపుటేషన్ ' పోతుందని , 'నొ ' అన్నారు  వాళ్ళు


లింగ :- కాబట్టి ప్రభుత్వ పాఠశాల వాళ్ళతో ఇలాంటి పేచీ ఉండదని , వారు నిత్యం తెలుగులో మాట్లాడుతూనే ఉన్నా , మళ్ళీ వాళ్ళకే తెలుగు ఆవశ్యకత గురించి చెప్తారన్నమాట .


సింగ :- మరీ అంత ' లో ' చేసి మాట్లాడకు , ఈ ' ప్రోగ్రాం ' కి మన ఊరి యెం.యెల్.యె గారు వస్తున్నారు తెలుసా  . ఆయనతో మన తెలుగు సంస్కృతి 'గ్రెట్నెస్ '  గురించి నాలుగు ముక్కలు మాట్లాడిద్దామని ' ప్లాన్ ' 


లింగ :- ఎవరూ ? నోరు  విప్పితే బూతులు తప్ప ఇంకోటి రాని ఆ యెం.యెల్.యె గారేనా ? మొన్న శాసనసభలో ఎవో బూతు చిత్రాలు చూస్తూ పట్టుపడిన ఒక శాసనసభ్యుడి చేతిలో ఉన్నది మన యెం.యెల్.యే గారి మొబైలే నట . నీకా విషయం తెలుసా ? ఆయన తెలుగు సంస్కృతి గురించి మాట్లడతాడా !


సింగ :- చూసింది ఆయన కాదు కద ! అయినా నీకు ఈ రోజు ' లాంగ్వేజి డే ' అనే తెలీదు . నీకు 'కామెంట్' చెసే హక్కు లేదు రా .


లింగ :- అవునా ! నిజమే నాకు తెలియదురా , నీకు కొంచెం ఇటువంటి విషయాలలో అవగాహన ఉన్నట్టు ఉందే ?


సింగ :- 'యా!'


లింగ :- అలగైతే నాకు కొన్ని విషయాలు చెప్పి పుణ్యం కట్టుకోరా , నేను కూడా నీలాగా లోక ఙ్ఞానం  పెంచుకుంటాను .
సింగ :- 'ఓ ష్యూర్ , వై నాట్ '


లింగ :- ఇంకా ఈ జనాభాలెక్కలు పూర్తికాలేదు కాబట్టి , ఇతః పూర్వం అనగా 2000-2001 లో జనాభా లెక్కల ప్రకారం , భారత దేశ ప్రాంతీయభాషలలో అత్యధికులు మాట్లడే భాష ఏది ? ప్రాంతీయ భాషలురో , హిందీ అనుకునేవు , అది జాతీయ భాష !


సింగ :- ' ఐ గెస్ , ఇట్స్ తమిళ్ '  , వాళ్ళ భాషాభిమానం , తమిళుల కట్టుబాట్లు చూస్తే ఈ విషయం అర్ధమవుతుంది .


లింగ :- ఏమో మరి , ప్రపంచంలోనే ఎక్కువగా ఉపయోగించే మొదటి 15  భాషల్లో మన దేశ ప్రాంతీయ భాషలు ఉన్నాయా ? ముఖ్యంగా మన తెలుగు  ఉంది అంటావా ?


సింగ :- తెలుగే ఉండి ఉంటే ఇంత నెత్తీ నోరూ కొట్టుకుని మేము సభలు పెట్టి ఉండం . ఖచ్చితంగా ఉండి ఉండదు .


లింగ :- ఇంక ఒక్క చివరి ప్రశ్న . రవీంద్రనాథ్ టాగూరు తర్వాత , సాహిత్యంలో నోబెల్ బహుమతి పరిశీలనకు మన దేశ రచయితలు  రాసినది ఏమన్నా వెళ్ళిందా ?


సింగ :- అప్రస్తుతం ఇది . ఇప్పుడు ఈ 'క్వశ్చన్ ' ఎందుకు ?


లింగ :- అప్రస్తుతం కానే కాదు , 'భాషా దినోత్సవం ' గురించి తెలిసిన నీకు , భారత దేశంలో అత్యధికులు మాట్లడే ప్రాంతీయ భాష 'తెలుగు ' అని  తెలియకపోవడం , పైగా అది మన పక్క రాష్ట్రం వారి భాష ఏమో అని వారి భాషాభిమానాన్ని మెచ్చుకోవటం , మరియు , తెలుగు ఎక్కువగా మాట్లడే ప్రపంచ భాషల్లో 13 వ స్థానం లో ఉంది అని తెలియదు . 'నా దేశం నా ప్రజలు ' అనే ఒక గ్రంధం నోబెల్ పరిశీలనకు వెళ్ళిందని , అది వ్రాసింది ఒక తెలుగువాడు అని కూడా తెలియదు . ఇంకేమనాలిరా .


కట్ ...... మరుక్షణం  ఆ కాల్ కట్ అయిపొయింది ...కొంత సేపు మౌనం , తర్వాత  , ఒక మెసేజి వచ్చింది .. దాని సారాంశం ...


' సారీ రా లింగా ! 'కాల్ కట్  'అయ్యింది ! 'ఫంక్షన్ 'తర్వాత నీకు చేస్తాను , 'టిల్ దెన్ టేక్ కేర్ '  



3 comments:

  1. చాలా beautifulగా రాసారండీ. మీ ఈ wonderful idea యెలా వచ్చిందో నని భలే surprisingగా ఉంది. మన mother tongueని మనమే కదా save చేసుకోవాలీ? మొత్తం మీద మీరు correctగానే చెప్పారు matter అంతా. నా కైతే highly impressiveగా అనిపించింది మీ article. compulsoryగా ఇలాంటి functions చాలా organize చేసి మన తెలుగు వాళ్ళందరినీ definiteగా mobilize చేయాలి. మన వాళ్ళకి ఒక పట్టాన impress కాక పోయే terrible disease అదేనండీ మాయరోగం ఉంది. అందరం కలసి hardగా try చేస్తే some change తప్పకుండా వస్తుంది sureగా. నాకు తెలుగు అంటే చచ్చేంత love అదే అదే ఇష్టం. నా help యేమన్నా కావాలీ అంటే definiteగా అడగండి. no problem. ఈ విషయంలో మనం యెంతో hardగా work చేయాలి. నేను ready. మనం తెలుగులోనే యెందుకు speakచేయాలీ అనే topic మీద one hour పాటు lecture ఇవ్వటానికి material gather చేసి ready గా ఉంటాను. మీరు place చెప్పండి. మీరు date fix చెయ్యండి. OK?

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం గారు ,
      మీ స్పందనకి ధన్యవాదములు . ఇక సమావేశాలు , సభలు అంటారా :-)) అలాంటివి మన సింగరాజుగారి లాంటి వారికి వదిలేద్దాము.

      Delete
  2. Chaalaa baavundi kalyan. kotta vishayaalu teliya chesaav.. ee ' naa desam naa prajalu' rachinchinadi evaru... google cheyani cheppakem... nenu try chestaanu... ee alochana elaa vacchindi asalu :-)

    So Good to see this at last :-)

    Yamini

    ReplyDelete