Friday, 3 February 2012

లింగరాజు - ఉపకారం

(కష్టేఫలి బ్లాగ్ లో 'శర్మ కాలక్షేపంకబుర్లు-ఉపకారం' శీర్షికన రాసిన వ్యాసం చదివి దాని స్పూర్తి తో రాసినది ఇది , శర్మ గారికి కృతఙ్ఞతలు ) 



'ఉపకారికి ఉపకారం విపరీతము గాదు సేయ ......' అంటూ దూరంగా తెలుగుమాస్టారి ఇంట్లో ట్యూషను పిల్లలు వల్లెవేయటం వినపడుతోంది .

లింగ :- ' ఉపకారమా ,వంకాయా . పొరుగువాడికి ఉపకారం , అది చేసేవాడికి మాత్రం ప్రత్యక్ష నరకం ' 


సింగ  :- ఎమిట్రా లింగా ! ఉపకారం పేరు ఎత్తితే కారాలు మిరియాలు నూరుతున్నావు ? కనీసం ఆ తెలుగు మాష్టారి  ట్యూషను పిల్లలకున్న ఙ్ఞానం కూడా నీకు లేనట్టుందే ...


లింగ :- నీకేం తెలుసు బాబు ఉపకారుల కష్టాలు , నీతులు చెప్పడం తెలుగు సినెమాలో హీరోలు కూడా చేస్తారు .. అవి పాటించటమే , రాజమండ్రి బ్రిడ్జి గతుకుల మీద బండి నడిపినంత కష్టం.


సింగ :- ఇప్పుడేమొచ్చిందిరా నీకు అంత కష్టం ! మన యెం. యెల్. యే గాడి స్పీచ్ లాగా పొంతన లేకుండా మాట్లడుతున్నావ్  ...


లింగ :- పొంతన లేకా !  అంతేలే ఆ సూరిగాడు ,వాడి బండిని నీ ఇంట్లో పెట్టి ఉంటే నువ్వూ ఇలాగే మాట్లాడుండేవాడివి ...
సింగ :- ఇదిగో మళ్ళీనూ ! సూరిగాడేంటి వాడి బండేంటి , సరిగ్గా చెప్పు
లింగ :- ఆ సూరిగాడు , ఎదో అవసరమైన పని తగిలి పట్నం వెళ్ళాలి అని , వాళ్ళ ఇంటి గేటు సరిగ్గాలేదని చెప్పి , వాడి కొత్త TVS మా ఇంట్లో పెట్టి వెళ్ళాడు . నాలుగు రోజుల తర్వాత వచ్చి చూసుకుని అందులో పోయించిన  నాలుగు లీటర్ల పెట్రోల్ లేదని , నా వంకే అనుమానంగా చుసి ఏదో గొణుక్కుంటూ  వెళ్ళిపొయాడు . అలా వెళ్ళినవాడు ఊరుకోక మా వీధి అంతా నేను పెట్రోల్ దొంగనని అందరి చెవులూ కొరికేసాడు . పోన్లే  కదా అని సాయం చేస్తే చివరికి నన్ను 'దొంగ ' ని చేసి పోయాడు  . ఇంకేం ఉపకారం , ఇంకేం పుణ్యం . అందుకేరా ఉపకారం లాంటి పదాలు వినటానికే బాగుంటాయి .


సింగ :- ఏమిటీ , ఈ మాత్రానికే ? అయినా ఆ సూరిగాడు గురించి తెలుసుగా , మన ఊళ్ళో వాడంత పిసినారి లేడుగా , పోయి పోయి వాడితో పెట్టుకున్నావ్

లింగ :- నేను పెట్టుకోలేదు బాబు , వాడే ఎదురొచ్చి  నన్ను వెర్రివాడిని చేసాడు .
సింగ :- నువ్వు భలే వాడివి  , ఇది చాలా చిన్నది . మొన్నటికి మొన్న ఆ లక్ష్మీ టాకీసు వీధి చివర కొత్తగా ఇల్లు కట్టుకున్న   ఆ బ్యాంక్ గుమాస్తా తో పోల్చుకుంటే నీకు జరిగింది ఒక లెక్కా .
లింగ :- అబ్బో నాలాంటి వెర్రి  బాగులోళ్ళు ఇంకా ఉన్నారా ? చెప్పు చెప్పు .. కరంటు మన ఇంట్లో పొయినప్పుడు , పక్కింట్లో కూడా పొయిందా లేదా చూసుకుని , అక్కడ కూడా పోతే మనం ఊపిరి పీల్చుకున్నట్టు ఉంది నా పరిస్థితి .
సింగ :- ఆ బ్యాంక్ ఆయన కొత్తగా ఇల్లు కట్టుకున్నాడుగా  , కట్టుకుని సుమారు ఒక మూడేళ్ళు అయ్యిందా ?
లింగ :- ఆ ఒక మూడు , నాలుగేళ్ళు అయ్యుండొచ్చు .
సింగ :- వాళ్ళ ఇంటిపక్కనే ఈ మధ్య ఇంకో బిల్డింగ్ వేసారు గా , ఆ బిల్డింగ్ వెయ్యటానికి గాను , సామాను ఈ బ్యాంక్ ఆయన ఇంట్లో పెట్టుకుంటాం అని అడిగారు . 'పోన్లే పాపం' అని  ఒప్పుకున్నాడాయన . ఇంక అంతే . ఇనుము , చెక్క , మార్బుల్ రాళ్ళు అన్ని ఆయన ఇంటి సందులో పెట్టించారు .
       కొన్ని సార్లు ఆయన ఉద్యోగానికి వెళ్ళిన సమయం లో ఆ చెక్క పనులు , మిగతా చిన్న చితకా పనులూ కూడా వాళ్ళ సందులో చేయించేసారు  . దానికి కూడా 'పోన్లే పాపం ' అని ఊరుకున్నాడాయన .
      చివరికి  ఆ సందు నానా భీభత్సం గా తయారయ్యి , వాళ్ళు వదిలేసిన ఇనుము , చెక్క ముక్కలు అప్పుడప్పుడూ కాళ్ళలోకి దిగుతున్నాయని , మొన్ననే ఆ సందూంతా సిమెంటు చేయించి , ఆ సందు గోడ మట్టికొట్టుకుపొయిందని  మళ్ళీ వెల్ల వేయించాడు .మొత్తం ఒక అరలక్ష ఖర్చు .



లింగ :- మరి ఆ పక్కింటివాళ్ళు ఏమీ చెయ్యలేదా ?
సింగ :- చేసారు , గృహప్రవేశానికి అరిటాకులు కావాలని వీళ్లనే అడిగి పట్టుకెళ్లారు .
లింగ :- ఎవో కొన్ని ఆకులు పట్టుకెళితే , దానికే ?
సింగ :- ఆకులు మంచివి కావాలని మొత్తం చెట్టునే పీకిపడేసారు .
లింగ :- ఒహో అలా అంటావా ! అయితే తప్పు .
సింగ :- కాని ఇలా ఎవరో ఉపయోగించుకున్నారని , అసలు ఉపకారమే చెయ్యననటం తప్పేమో రా , మనిషిగా పుట్టిన వాడు సాటి మనిషికి సాయం చెయ్యాలి  . ప్రతీ రోజూ ఒకలా ఉండదు , ప్రతీ మనిషీ ఒకలా ఉండడు. పారే నదికి నీరు అందివ్వటమే లక్షణం. వికసించే ప్రతి పువ్వుకీ నవ్వులు పంచటమే లక్షణం . మనిషి అని అనుకోవల్సిన ప్రతి వాడికీ ఉపకారం చెయ్యటమే లక్షణం .
లింగ :- అవునా , ఐతే నాకో ఉపకారం చెయ్యి .
సింగ :- చెప్పరా ఏం కావలో .
లింగ :- కొంచెం టైట్ గా ఉంది , ఒక వెయ్యి ఉంటే సర్దు .
సింగ :- వెయ్యా .... (ఎదురుగా పోతున్న ఎవడో మనిషిని పలకరించి ) హలో సుబ్బారావుగారు  , ఏంటి నన్ను రమ్మంటారా ..  ( అని లింగరాజుకేసి తిరిగి) ఒక్కనిముషం రా లింగా ... అని చెప్పి వడివడిగా జారుకున్నడు సింగరాజు   




1 comment:

  1. చదివినంత సేపు తరవాతా తలుచుకుని నవ్వుకున్నా!
    బాగా రాశారు.

    ReplyDelete