ఆలోచన అన్నిటికీ మూల కారణం . భావోద్వేగాలు , రసాస్వాదన ఇలా ఏ అంశాన్నైనా ఆలోచనలు ప్రభావితం చేస్తాయి . ఈ నా బ్లాగ్ , నా ఆలోచనలకి ప్రతిరూపం, అలాగే సింగరాజు లింగరాజు గార్లవంటి ప్రముఖులకి ఒక వేదిక !! ఆస్వాదించండి , ఆలోచించండి ...
దుడుకు అడుగుల శిశిర గాడ్పులకి , తల్లి ఒడి నుండి వేరు పడి .. కొండలనకా , గుట్టలనకా ... పిల్లగాలులతో కలిసి తిరిగి .... దుమ్ము ధూళిలో కలిసిపోయి , వేల అలజడుల బరువు మోసి, వేల అడుగుల కింద నలిగి , ఇల్లుని విడిచి , తల్లిని మరిచి ఒక నిర్జీవ కుడ్యపు సన్నని బీటలో చేరి సేదతీరింది ఒక చిన్ని విత్తనం.
హితులు కరువై , భవిత బరువై బ్రతికే దారిని , ఆ బీటలో పరుచుకున్న నిశీధిలో వెతుక్కుంటూ .. చిట్టి చేతులతో ఆ గట్టి గోడను తవ్వుకుంటూ ... సాగిపోతున్న ఆ విత్తుని హత్తుకుంది ఒక ఉదయపు అనాధ మంచుకణం.
బ్రతుకు దొరికింది .. భవిత నిలిచింది ... వెతుక్కుంటూ ఒక సూర్య కిరణం ఆ విత్తనాన్ని పలకరించింది ... కలిసిరాని కాలంతోనే సాగుతూ వెక్కిరించిన విధినీడనే మెలుగుతూ , వెలుగుతూ కొన్నాళ్ళకి .. గుండెలేని ఆ గోడ పైన పచ్చని హరితం , వసంతాన్ని స్వాగతించింది ..
నాకు నచ్చిన ముళ్ళ దారిని వదిలి ..
నలుగురూ నడిచే రాజ మార్గం లో అడుగులు వేసాను ..
దారి అనువుగా ఉందో లేదో చూసానే గాని ..
గమ్యం చేరుస్తుందో లేదో అడగడం మరిచాను ..
సాటివారి పై బురదజల్లాలని ..
ఆలోచిస్తూ కాలం గడిపాను ..
వాళ్ళని తిట్టే తాపత్రయంలో ..
నా చేతులకి నేనే బురద చేసుకున్నాను ...
మళ్ళీ ఎదగమని నువ్వు ఇచ్చిన ..
ఎన్నో ఉదయాలని వ్యర్ధం చేసుకుని ...
మళ్ళి బ్రతకమని నువ్వు విదిల్చిన ..
ఎన్నో ఊపిరులని గాలికి వదిలేసి ..
రిక్త హస్తాలతో నీ ముంగిట..
యాచిస్తూ నిలిచున్నాను ..
కొత్త ఉదయం ప్రసాదించమని ..
కాస్త ఇంగితం ప్రచోదించమని .