Saturday 29 October 2011

అవ్యక్తం

ఒక ఉదయం,


అటూ ఇటూ విచే అల్లరి గాలులకి,ఎగురుతూ సాగుతూన్న ఒక యెండుటాకు ,'చిటపటా' చప్పుడు చేసుకుంటూ , ఒక వృద్ధ వృక్షపు నీడలోకి వచ్చి ఆగింది ... ఒక సారి ఆ చెట్టుని ఎగా దిగా చూసి ఎదో గుర్తుకుతెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది ..


' మసక బారిన ఙ్ఞాపకాల గదుల్లారా !
  మరుపు నిండిన నా మస్తిష్కపు పొరల్లారా !
   ఏదో తెలియని అభిమానం ,
   ఈ నీడన నాలో చిగురిస్తోంది  
   ఎన్నో ఏళ్ళ ఒక పరిచయం ,
   మళ్ళీ ఇక్కడ పలకరిస్తోంది .
ఎక్కడిదర్రా , ఈ మధుర గానం , ఇంకా ఎదలో మోగుతోంది ..
ఎప్పటిదర్రా , ఈ  పులకింతల పరిచయం  , తలపుల్లో ఇంకా మెదులుతోంది ? '






అని ప్రశ్నించింది .. అది విని ఆ చెట్టుకి ఉన్న ఆకులు గల గలా నవ్వాయి , 'ఈ ముసలి ఆకుకి రాలిపొయినా ఇంకా మతిమరుపు పోలేదు ' అని కొన్ని పిల్ల గాలులు తమలో తాము  గుసగుసలాడుకున్నాయి .. అది విని ఆ ముసలి ఆకు మనసులో మొలిచిన చిన్న పౌరుషపు తాకిడికి తన స్వరం కాస్త హెచ్చించి ఇలా అంది ..
' నవ్వులాటలే  మీకు పిల్ల గాలుల్లారా ,
 దుడుకు నవ్వులే మీకు కొత్త ఆకుల్లారా ?
 ఉడుకు రక్తపు దుడుకు , ప్రాయముడుగినప్పుడు ఉండబోదు
 నేటి మీ సూర్యోదయం , నా రేపటి సంధ్య ముందు నిలువబోదు
అప్పుడు మీ బోసినోళ్ళతో వెర్రి నవ్వులు  నవ్వుదురులే
ఆనాడు మీ పలుకుల వాడి ఎంతో నేనూ చూస్తానులే '


అని ఉక్రోషంగా పలికింది , ఆ పలుకులకి నొచ్చుకుని కొన్ని పిల్లగాలులు గట్టిగా వీచాయి , ఆ గాలికి , చెట్టు నుంచి మరొక ఆకు రాలి ,కింద ఈ ఆకు పక్కనే పడింది , పడీ పడగానే తన నేస్తమైన ఈ ఎండుటాకుని చూసి ఆనందంతో హత్తుకుంది ,  


'  బాధల కెరటాలు , సంతోషపు ముత్యాలు
   గంభీరంగా మోసే కడలే ఈ కాలం
  కలిసీ కలువని  భూమీ ఆకాశపు 
  సరిహద్దు రాజ్యమే ఈ కాలం
ఆయువయ్యిందని , ఊపిరాగిందని , రాలిపొయిన నా మనసుకు
మరునిముషం లోనే నిన్ను చూపించి చిగురింపజేసింది ఈ కాలం  '


అని మురిసిపోతూ తను ఎవ్వరో ఆ ఎండుటాకుకి ఙ్ఞాపకం చేసింది , దూరంగా ఎప్పుడో తను రాలిపొయినప్పుడు ఏర్పడిన గుర్తుని చూపించింది .అప్పుడు గుర్తొచింది ఆ ముసలికి , అది తన ఇల్లని , ఆ చెట్టు తన అమ్మని ... తను రాలిపోయినా  ఇంకా తను వదిలి వెళ్ళిన గుర్తులని మోస్తున్న తన తల్లి ని చూసి ..
'గుండె తడి అయినా
మనసు చెమ్మగిల్లినా
చుక్క కన్నీరయినా మిగలని
అలసిపొయిన ఎండుటాకుని  '


అని బాధ పడుతూంటే , చెట్టు మీదున్న మంచు కరిగి , ఆ తల్లి వృక్షపు కన్నీటి బిందువై ఆ ఎండుటాకుని తడిపింది ..

4 comments:

  1. చాలా బాగుంది.
    ఒక కవితలో ఎండుటాకుల గురించి ఒక ఒక వాక్యంలో ఒక భాగంలో చెప్తుంటారు. మీ కథ చాలా బాగుంది. ఇది మనుషుల జీవితాలకూ అన్వయిస్తుందని విశదంగా (చెప్పకనే) చెప్పారు.
    "చెట్టు మీదున్న మంచు కరిగి , ఆ తల్లి వృక్షపు కన్నీటి బిందువై" అద్భుతమైన ఊహ.
    మీకు గుర్తుందో లేదో నేను మీ పాత పాఠకురాలినే.

    ReplyDelete
  2. మందాకిని గారూ ,
    పునఃస్వాగతం !!
    ఇలాంటి నా ప్రయత్నాలని , చదివి ప్రోత్సహించే మీరు నాకు గుర్తున్నారండీ . మళ్ళీ మనం పద్య రచన ద్వారా పునఃపరిచయం అయ్యాం.

    ఈ కథ మీకు నచ్చినందుకు చాలా సంతోషమండి . సమయాభవం వల్ల ఇలా వచన కవిత అయిపొయింది , లేకుంటే పద్యాలలో రాద్దామని మొదలు పెట్టాను :-)

    ReplyDelete
  3. ఎంత బావుందో..మీరు తరచుగా వ్రాస్తుండ౦డి కళ్యాణ్ గారూ..

    ReplyDelete
  4. జ్యోతిర్మయి గారికి,
    ధన్యవాదాలండి . చాలా సంతోషం . రాస్తూ ఉంటాను గాని బ్లాగ్ లో పెట్టడంలో కొంత బద్దకం చూపిస్తున్నాను , మీరందరి ప్రోత్సాహంతో తప్పకుండా ఇక నుంచీ తరచుగా బ్లాగ్ లో పెడతానండి .

    ReplyDelete