Thursday 27 October 2011

ఒక రైతు కథ

తూర్పు తెల్లవారుతుండగా , గూళ్లలోని పక్షిపిల్లల సవ్వడులు పల్లెలో పరుచుకుంటూ , తెల్లవారిందని అందరికీ తెలియచేస్తూ ఉండగా , పెద్ద కరణం గారి ఇంటి సందుకి ఆనుకుని ఉన్న చిన్న బురద దారి గుండా సాగుతున్నాయి రాములు అడుగులు ...


'ఏరా రాముడూ , పొలానికా ? '
 ఏదో పరధ్యానం లో ఉన్న రాములుని ,అప్పుడే నిద్ర లేచి , చెంబు పట్టుకుని ఎదురు వస్తూ పలకరించాడు సూరి .
నోటితో ఏమీ చెప్పకుండానే అవునన్నట్టు తలూపాడు రాములు.


'ఏంటీడు , ఇలా ఉన్నాడు ?' అని మనసులో అనుకుంటూనే ,'మనకెందుకులే ఈ సమయంలో ' అనుకుని వడి వడి గా ముందుకు వెళ్ళిపొయాడు సూరి.


దూరంగా రామాలయం మైకు నుంచి పూజరి గారి వేద పాఠం వినపడుతోంది , ఆ మంత్రాలేంటో  అర్ధంకాకపోయినా , చిన్నప్పటినుంచి ఉన్న అలవాటు వల్ల చేతులు అప్రయత్నంగానే అటువైపు తిరిగి నమస్కారం పెట్టాయి , కళ్ళు ముసుకుని 'జై శ్రీరాం ' అనుకుని మళ్ళీ  తన నడక కొనసాగిస్తున్నడు  రాముడు.


కొద్దిగా ముందుకు సాగగానే , ఆ మంత్రాల మహిమ వల్లనేమో , తప్పుచేస్తున్న భావం మొలకెత్తింది రాముడిలో , నెమ్మదిగా ఙ్ఞాపకాలు దొంతరలుగా కళ్ళ ముందు కదలాడసాగాయి ...


చిన్నపుడు ఇలాగే తెల్లవారుతుండాగానే , తన తండ్రి  తనని పొలానికి తీసుకువెళ్ళేవాడు . దారిలో రాముడి గుడి ముందు ఆగి ఒక దణ్ణం పెట్టి , సన్నగ తనలో తాను ఒక పాత పాట పాడుకుంటూ , మధ్య మధ్యలో తన పంచె బొడ్దు లో దాచుకున్న చుట్టల్ని తడుముకుంటూ  , వచ్చేపోయేవాళ్ళని  మనసారా పలకరిస్తూ , వడివడిగా పెద్ద పెద్ద అంగలేస్తూ సాగిపొతున్న తన కన్నతండ్రి  , తన కళ్ళముందు ఇప్పటికీ కదలాడుతూనే ఉన్నాడు . ఎంత కష్టమైనా నవ్వుతూ  ధైర్యంగా ఎదుర్కొన్న తన తండ్రిని గుర్తుచేసుకుంటూంటే కొంచెం గర్వం , కొంచెం బాధ కలిగాయి రాములుకి .


అలా ఙ్ఞాపకాలని  నెమరువేసుకుంటూ  నాలుగు అడుగులు ముందుకు వేయగానే , పూజరిగారి ఇంటి ముందు కళ్ళాపు జల్లుతున్న పనిమనిషి కనపడింది .


వెంటనే తన తల్లి గుర్తుకు వచ్చింది. తెల్లవారకుండానే బయల్దేరి నాలుగిళ్ళల్లో పాచిపని చేసి , వాళ్ళ ఇంటెడు  సామాన్లూ తోమి ,బట్టలు ఉతికి , మళ్ళీ వెనక్కి వచ్చి తన తండ్రికి చద్దన్నంలో ఉల్లిపాయముక్క , ఒక పచ్చిమిరపకాయ పెట్టి  , అది తిని పొలానికి బయల్దేరుతున్న తన తండ్రిని గుమ్మంవరకూ వచ్చి సాగనంపే ముత్తైదువు తన తల్లి , అలసట అన్నది ఎన్నడూ మొహం లో చూపించని తన తల్లిని తలుచుకుంటూంటే అప్రయత్నంగా కళ్ళమ్మట నీళ్ళు తిరిగాయి రాములుకి .
మనసులో తప్పు చేస్తున్న ఆలోచనలు మళ్ళీ లేచాయి . గట్టిగా తన తువ్వాలు చాటూన దాచిన పురుగులమందుని అదిమిపట్టుకున్నాడు.


'మధ్యాహ్నం త్వరగా రండి ,ఈ రోజు ' అన్నం ' వండుతున్నాను ' తన భార్య తనతో ఇందాక పొలానికి బయల్దేరే ముందు అన్నమాటలు గుర్తుకొచ్చాయి . చాల రోజుల తర్వాత తన ఇంటిలో 'అన్నం ' వండబడుతోంది , అది కూడ తన భార్య వంటి మీద ఉన్న ఆఖరి బంగారపు గాజు అమ్మిన డబ్బుతో .


'పొలానికి తీసుకున్న అప్పు , వారం లో కట్టకపోతే పొలాన్ని జప్తు చేస్తాం ' అని వారం క్రితం బ్యాంక్ వారి మాటలు కూడా గుర్తుకొచ్చాయి.


భారంగా నడుస్తున్న రాములుకి దూరంగా తన పొలం కనపడుతోంది .


నిట్టురుస్తూనే తన పొలం చేరుకుని , బీటలు తీసిన తన పొలం మధ్యలో కూర్చున్నాడు . ఎన్నో ఆలోచనలతో మనసంతా గందరగోళంగా ఉంది . అప్పటివరకు దాచిన పురుగులమందుని తీసి పక్కనపెట్టి , 'ఎప్పుడు తాగాలా ?' అని ఆలోచిస్తూ మళ్ళీ తన గతంలోకి వెళ్ళిపొయాడు .
తన పొలం పక్కనే ఉన్న అయిదు ఎకరాల యజమాని , తన ప్రాణ స్నేహితుడి ఆఖరి మాటలు గుర్తుకొచ్చాయి ..
' ఓడిపోయాను రా రాముడూ ! నేలని నమ్ముకుని బ్రతుకుతున్న  మనకి , నమ్మి కొలిచిన దేవుడూ  , నమ్మి ఓటేసిన నేతలూ , ఎవ్వరూ నీళ్ళివ్వలేదు . నీళ్ళైతే దొరకలేదు గాని , పురుగులమందు మటుకు అప్పు మీద దొరికింది . నేను చేతకానివాడ్నే గాని, పిరికివాడిని అని మాత్రం అనుకోవద్దు  ' అని రాసి పంటకోసమని కొన్న పురుగులమందు తాగిన తన స్నేహితుడు గుర్తుకొచ్చాడు .


గత ఎన్నికలలో ' మీ నీళ్ళకోసం నా ప్రాణలైనా ఇస్తా ' అని ప్రతిఙ్ఞ చేసిన ఎమ్మెల్యే గుర్తుకొచ్చాడు .


వందలకొద్దీ ఆత్మహత్యలు చేసుకున్న తన లాంటి సన్నకారు రైతులు గుర్తుకొచ్చారు , ఆవేశం , ఆక్రోశం , అసహాయత ఇలా భిన్నమైన భావాల మధ్య భార్య  'అన్నం ' వంట ఙ్ఞాపకం వచ్చింది .


ఆఖరిసారి అన్నం తిని చచ్చిపోదామనిపించి , పురుగులమందుని మళ్ళీ జాగ్రత్తగా తువ్వాలు వెనక దాచి , నెమ్మదిగా ఇంటివైపుకి నడక సాగించాడు ..


అలా తన ఇంటి దరిదాపులలోకి చేరుకున్నాకా , ఆమడ దూరం లో ఏదో ఆగి ఉన్న కారు గమనించాడు.
ఎవరో పెద్దవాళ్ళు , తన చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడుతున్నారు , ఎవో కాగితాలు , ఫైళ్ళు పట్టుకుని ఉన్నారు వాళ్ళు .


'ఏమి జరుగుతోందో ' అని కుతూహలం ఉన్నా ,' మనకెందుకులే ' అని సర్దిచెప్పుకుని , తన ఇంటికి వెళ్ళి భోజనం పెట్టమని భార్యకి  చెప్పి , కాళ్ళూ చేతులూ కడుక్కుని  కంచం ముందు కూర్చున్నాడు . భార్య చూడకుండా పురుగులమందు కొంచం పప్పులో కలిపి తాను వేసుకుని , తను లేకపొతే తన భార్య అనాధ అయిపొతుందని కొంత తన భార్య కి కూడా వేసి , తృప్తి గా కడుపారా తిని భుక్తాయసం తో ఆరుబయటకి వచ్చి కూర్చున్నాడు రాముడు .


నిత్యం ఎదో పాటలు పాడుతూ పని చేసే తన భార్య ,వంటింటిలోకి వెళ్ళి , అరగంట అయినా ఏమీ శబ్దం చేయకపోయేసరికి  'మందు పని చేస్తోందేమొ ' అని ఆనందపడుతున్న రాముడికి  ఎదురుగా ఇద్దరు పెద్దమనుషులు నిలుచున్నట్లు కనపడ్డారు ... చూపు నెమ్మదిగా మసక బారుతోంది ...  ఆఖరి క్షణాలు వస్తున్నట్టు తెలుస్తోంది ... ఇంతలో ఆ పెద్దమనుషుల్లో ఒకరు ..


' ఇక్కడ ప్రభుత్వం ఒక శెజ్  కట్టడానికి పర్మిషన్ ఇచ్చింది , కాబట్టి మీ భూమి ప్రభుత్వ ధరల ప్రకారం మేము కొంటాం , ఇంకా మీకు ఒక ఉద్యోగం కూడా ఇప్పిస్తాం ..'' అంటూ ఇంకా చెప్పబోతున్నవాళ్ళకి  ఎదురుగా కుప్పకూలిపోతూ  , చిద్విలాసంగా ఆఖరిసారి చిరునవ్వు నవ్వుతూ కనపడ్డాడు రాముడు.


ఊరు మూగపొయింది .


మరొక సారి సూర్యుడు భారంగా అస్తమించాడు.
.........
............
...............
.................


కొసమెరుపు :-  పట్నం లో ఉన్న పెద్దాసుపత్రి లో మెల్లగ కళ్ళు తెరిచాడు రాముడు , పక్కనే ఉన్న మంచం మీద ఉంది తన భార్య , అప్పుడప్పుడే తను కూడా కళ్ళు తెరుస్తోంది. తన పక్కనే నుంచుని ఉన్న సూరిగాడు , కళ్ళనీళ్ళతో రాముడి పక్కకు వచ్చి , చడామడా నాలుగు తిట్టి  , కొట్టినంత పనిచేసి , ఇంకెప్పుడూ ఇలాంటి వెధవ పని తలపెట్టనని వొట్టు పెట్టించుకున్నాడు.    తన పొలం కొనడానికి వచ్చిన ఆఫీసర్లే తనని కారు లో తీసుకొచ్చి ఆసుపత్రి లో చేర్పించారని చెప్పాడు .


'మరి ఆ పురుగులమందు ?' అని రాముడు అమాయకంగా అడిగాడు ..


'నీ అదృష్టం  , అది కల్తీ మందు ..., పంటకే కాదు మనుషులకి కూడ పనిచెయ్యదు ' చెప్పాడు సూరి.

2 comments:

  1. Chala nachindi andi...

    Hyd lo undi okka sari maa uruki velli vacha 5 min's loo....

    ReplyDelete
  2. Thanks andi Anonymous gaaru , maa uurilo kuuda naa chinnappudu roju chusey vaadini , naagali pattukuni , leda eddulani tolukuntuu nadustuu vellipoye raitulani ...

    kaani ippudu alaantivi chala arudugaa kanapadutunnai !

    ReplyDelete