Monday 24 January 2011

"స్కాము"రాజ్యం

లింగ :- ఉందిలే మంచి కాలం ముందూ ముందూనా ! స్కాములూ చేసెయ్యొచ్చూ నందా నందానా !

సింగ :- ఎంట్రో ! మంచి హుషారుగా ఉన్నావ్ ? ఆ స్కాములు చేయటం ఏమిటి ?

లింగ :- నీకు ఇంకా తెలీదా ? నేను రాజకీయ్యాల్లోకి వెళ్దామనుకుంటున్నా!

సింగ :- అయితే?

లింగ :- ఇక డబ్బులే డబ్బులూ !

సింగ :- ఏంటి రా నీ వాలకం ? రాజకీయ్యాలకి , డబ్బులకి , స్కాములకి సంబంధం ఏంటి? పవిత్రమైన ప్రజాసేవా పధం లోకి వెళ్తానంటూ , ఈ స్కాములు గోల ఏంటెహై !

లింగ :- ఏ ఊరు రా మీది ? గ్రహాంతరవాసి లా మాట్లాడుతున్నావ్ .. ప్రజా సేవా ! జోకులెయ్యకురో , ఆ పదానికి అర్ధంకూడా తెలీదు మన నాయకులకి ! ఏది దొరికితే దానితో స్కాములు చేసెయ్యటం తప్ప , ఇలాంటి కఠిన పదాలని కనీసం నేర్చుకోనైన నేర్చుకోరు ..

సింగ :- మరి మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు , ఇలాంటి వారందరు కూడా రాజకీయ్యాల్లో ఉండిన వారే గా , వారు మరి కడిగిన ముత్యం లా స్వచ్చంగానే బ్రతికారు గా ?

లింగ :- అందుకే వాళ్ళ విగ్రహాలు గాని , ఫొటోలు గాని మనకి పెద్దగా కనపడవు ఎక్కడా ! జనం కూడ వాళ్ళ పుట్టిన రొజులని పెద్దగా పట్టించుకోరు ! అసలు వారు హిస్టరీ పుస్తకాలలో తప్ప ఇంకెక్కడా మచ్చుక్కైనా కనపడరు

సింగ :- ఆపు నీ వెటకారం ! అలా అయితే మరి గాంధీ గారు అన్ని చోట్ల కనపడతారు , ఆయన మరి మహాత్ముడెలా అయ్యారు ?

లింగ :- నీకింకా అర్ధం కావట్లేదు ! గాంధీ గారు ఇప్పుడు మహాత్ముడో , లేక జాతిపిత గానో కంటే ఒక బ్రాండ్ నేముగా మిగిలిపోయారు .. పేరు చివర తగిలించుకుంటే వారసత్వం గా పదవులు వస్తున్నై , గోడకి తగిలించుకుంటే పవరొస్తోంది ... ఆఖరికి పెన్నులకి ఆయన పేరు పెట్టుకుని లక్షలకి అమ్ముకున్నారు .. అది బాబు నేటి రాజకీయం !

సింగ :- మరి స్కాములంటున్నావ్ , ఎం చేస్తావేంటి ?

లింగ :- అదేరా ఆలొచిస్తున్నా ! గడ్డి తో చెసేసారు, ఆటలతో చెసేసారు , ఆఖరికి కనిపించని తరంగాలతో కూడా కోట్లు దండుకున్నారు . నాకిక మిగిలింది ఎంటో ?

2 comments: