ఎక్కడో వేరే దేశంలో కూర్చుని , ప్రపంచ రాజకీయాలపై పత్రికల్లో చదివే నాబోటి వాడికి , వాస్తవ పరిస్థితులు కేవలం వార్తలద్వారా మాత్రమే తెలుస్తాయి కాబట్టి , ఒక 'బయట వ్యక్తి ' గా కొన్ని ఆలోచనలు ...
బిటీషు వారు ఐరోపా సమాఖ్య నుండి వైదొలుగు తున్నారని చదివి , అసలు ఐరోపా సమాఖ్య ఎలా మొదలైందో కుతూహలం వచ్చి , గూగుల్ గారిని అడిగితే , వికీపీడియా వారు 'ఓయ్ ' అన్నారు ...
వారిని బట్టి , మొదట బొగ్గు , స్టీల్ , ఆయిల్ వ్యాపారాలు సజావుగా సాగటానికి ఆరు ఐరోపా దేశాలు ( బ్రిటీషు వారు లేరు ) కూటమిగా ఒప్పందం చేసుకున్నాయట , ఇది 1957 నాటి మాట ..
1960 లో బ్రిటీషు వారు తమంత తాము ఈ కూటమి లో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు ( అందరిలాగే ఆర్ధిక , సామాజిక ప్రయోజనాల కోసం ) .. కాని అప్పటి ఫ్రాన్సు అధ్యక్షులు ఇదేదో అమెరికా వారి కనసన్నల్లో జరుగుతున్న బాగోతం అని ఊహించి , 1967 వరకు దీనికి ఒప్పుకోలేదు , ప్రభుత్వాలు మారాయి అందువల్ల సహజ పరిణామంలా నిర్ణయాలు మారాయి .. 1973 లో యేట్టకేలకు బ్రిటీషు కూటమి లో సభ్యులయ్యారు
సరే కాలం మారింది , ఓడలు బళ్ళయ్యాయి .. అప్పటి సంపన్న దేశాలైన ఫ్రెంచు , ఇటాలియన్లు , ఇప్పుడు ఏమంత గొప్ప ఆర్ధిక వ్యవస్థలు కావు ...
సరే , ఇప్పుడు ఎందుకు కూటమి నుంచి బ్రిటీషు వారు వైదొలుగుతున్నారు అంటే ప్రధానంగా వినపడే మాట ' కాందిసీకుల ' వల్ల..
టూకీగా చెప్పలంటే బ్రిటీషు వారుగా చెలమణీ అవుతున్న నేటి జనాల్లో చాలా మంది నిజమైన 'బ్రిటీషు ' వారు కారు ...
కూటమి ఒప్పందాల వల్ల , కూటమి దేశాల్లో యే దేశ పౌరుడైనా మిగతా దేశాలకి స్వేచ్ఛగా వెళ్లవచ్చు .... అంతా బానే ఉంది గాని అసలు బాధ ఇక్కడే ఉంది ..
మధ్య ప్రాచ్యంలో జరిగే పరిణామాల వల్ల , కొన్ని కోట్లలో జనాలు ఐరోపా కి వలస వస్తున్నారు ... ఐరోపా లో వారి దేశ పౌరులకి చాల సామాజికాంశాలు ( విద్య వైద్యం మొదలగునవి ) ఉచితమే ... ఈ కొత్తగా వచ్చే వారివల్ల , ఎంత నియంత్రించినా ఖర్చు పెరిగిపోతోంది ప్రభుత్వాలకు , మరొకవైపు ఉగ్రవాదం ..
ఈ పరిస్థితుల్లో , మొత్తం ఐరోపా ఖండం అంతా కష్టం లో ఉంది ... ఈ సమయంలో తన దేశ భద్రత కోసం ఆ దేశ ప్రజ , ఈ కూటమి నుంచి వైదొలగడం ( తద్వారా , కూటమి ఒడంబడికలు వర్తించవు , శరణార్ధులకి ప్రవేశం ఆపొచ్చు )
వారి దేశ భద్రత కోసం తీసుకున్న నిర్ణయంలా ఒక రకంగా సబబు అనిపిస్తున్నా .. మరొకపక్క 'ఏరు దాటాకా తెప్ప తగలెయ్యటం ' లాగానూ అనిపిస్తోంది ...
రవి అస్తమించని బ్రిటీషు వారు , కష్ట కాలంలో నాయకత్వం వహించకుండా , చీకట్లో మెల్లగా జారుకుంటున్నారేమో ! ఏమో , మళ్లీ రేపటి పత్రిక ఏమి వార్తలు మోసుకొస్తుందో చూడాలి ...
ఈ లోపు కొన్ని కంద పద్యాలు ' మేమున్నాం ' అని ముందుకొచ్చాయి ...
రవి అస్తమించని ప్రజకు
జవ సత్త్వ విహీన సభ్య సంఘము చేదై
అవనిన్ పాలిత పాలక
నివహంబుకు భ్రాంతి కూర్చి నిలిచెను వేరై
మా కుంపటి మా సొంతము
మీ కూటమి గాదు మేము మేలు దలుపగన్
లోకంబును పాలించిన
మాకేలా పరుల గోల మనకు విడాకుల్
ధాటిగ తమ గతి వేరని
చాటిన యాంగ్లేయులింక సత్యము నరయన్
కోటలు లోటును దీర్చవు
యేటికి యెదురీత భవిత యెరుగుదు రేమో
పరదేశ కాందిశీకుల
పరమై దేశము చెడునని భయపడు వారా
పరులన్ బానిస జేసుకు
చెర పట్టిన నాటి వీరశేఖరు లకటా !
విరిగెను మొదట కుటుంబము
విరిగెను మనసులు కులమత విద్వేషంబున్
విరిగెను దేశము తదుపరి
విరుగుట ఖండంబు జేరె విష సంస్కృతియై
No comments:
Post a Comment