Showing posts with label వచన కవితలు. Show all posts
Showing posts with label వచన కవితలు. Show all posts

Thursday, 12 November 2015

శివ ఝరి

నేల నచ్చదన్నట్టు
ఆకాశాంలోనే ఉండిపోయిన గంగమ్మా
ఏ భగీరథుడు పిలిచాడో
ఏ భీష్ముడు గుర్తొచ్చాడో
ఒక్కసారిగా ఒడలు మరిచి 
ఊరి గడపలు తడిపేస్తున్నావు
దిక్కులన్నీ తరిచి తరిచి 
చినుకు సంద్రాలు మధిస్తున్నావు

ఆ ...తెలిసింది లే ...

భక్తుడి అరుపో .. బిడ్డ పిలుపో కాదు 
ఆ మూడు కళ్ళ నీ పెనిమిటి వలపులే  

ఎండి పోయిన నేలని
ఇంకి పోయిన ఆశని 
నీ కార్తీక అభిషేక రూపమై 
మరో గంగావతరణమై 
మళ్ళీ బ్రతికిస్తున్నావా .. 
ఎంత దయ నీది శివా 

( ఈ మధ్య పడిన వానలు , కార్తీక మాసం ... అంతా శివమయమే.. అందరం శివ పరివారమే ) 

Tuesday, 6 October 2015

ప్రభవ

లెక్కకు అందనంత అంతరం
నీకు నాకు మధ్య అల్లుకుపొతున్నా

ఒక్క మనసులోని నిశ్శబ్ద ప్రవాహం
వేల చినుకులై ప్రభవిస్తున్నా

వెళ్తాను , నాకై నియమించిన పనికి 
నీ పనిముట్టై వెళ్తాను ...
నీ ఉనికి ,దిక్కులకి చాటడానికి 
నా ఉనికి విడిచి వెళ్తాను ...
నీ జ్ఞానం పరిఢవిల్లటానికి 
నేను  అజ్ఞానమై వెళ్తాను ....

నే నడిచే దారుల్లో
పూలు పరిచినా , రాళ్లు విడిచినా 
నా ఖాతాలో జమ చేసిన రోజుల్లో 
వెలుగు నింపినా , చీకట్లు పంపినా 
నీ ఇష్టాన్ని కాదంటానా 

నేనే నువ్వన్న నిజం నుంచి,
"నేను" అనే అబద్దంగా 
నీ ఆజ్ఞ మహత్యం చుసావా , అప్పుడే మారిపోయాను     

Friday, 19 July 2013

ఆకాశం అద్దెకొచ్చింది

నీలాకాశమనే నిలువుటద్దంలోంచి
వానై వచ్చిన వాగు పలకరింపులు
చిన్ని చినుకు కురిపించిన స్నేహితంతో
విరబూసిన పొలం పులకరింపులు

తోపుడు బళ్ళమీద వాన చినుకు టపటపలు
బొగ్గుల మీద కాలుతూ జొన్నపొత్తుల చిటపటలు
గుప్పిళ్ళు నిండిన కారం పల్లీలు
స్వర్గం చూపించే వేడి పకోడీలు


చూరువారగా చుట్ట కాల్చుతూ ,
తాత చూపుల ప్రశ్నార్ధకాలు  ..
పాత పత్రికల బూజు దులుపుతూ
బామ్మలు  చేసే కాగితపు పడవలు 






ఆకాశంలో రోజూ చూసే
చందమమే కరిగి వస్తున్నాడంటూ
అందుకుందామని దోసిళ్ళు చాచే
అల్లరి బుడతల అమాయకత్వం 

యెల్లలు లేని వారి ఆనందానికి
' జలబు ' ' జ్వరం ' అని కళ్లెంవేస్తూ
అలిసిపోయే అమ్మల ఆత్రం

మొన్నటిదాకా మండుటెండతో
ముడుచుకుపోయిన ఊరు
ముసురుతెచ్చిన కొత్త ఊసులతో
మళ్ళీ పల్లవించింది
అలసి పోయిన సూరీడికి సెలవిచ్చి
ఆకాశం నేలపై అద్దెకొచ్చింది   


Thursday, 2 August 2012

వేగుచుక్క

అవినీతి ,అరాచకత్వపు
గంజాయి మొక్కల వ్యవసాయంలో 
స్వచ్ఛమైన  ప్రజస్వామ్యమనే 
తులసి మొక్కే కలుపు మొక్క


స్వలాభం , దోపిడీ భావమనే
ఉత్తుంగ తరంగ మహార్ణవంలో
ఎంత వెతికినా దొరకనిదే
చిత్తశుధ్ధి అనే చిన్ని కెరటం


విలువల వలువల ద్రౌపదీ పర్వంలో
వింత చూస్తున్న అందరం కౌరవులమే
అవినీతి  చరిత్రలు గల  కసాయిలను,
అనుసరించే వారందరం వెర్రి గొర్రెలమే


ఇంత చిక్కని విషసంద్రంలో
అంతు చిక్కని అల్లకల్లోలంలో
కాస్త ఇంగితమే అమృతపు చుక్క
అనంతమైన చీకట్లను తరిమేది
ఆలోచన అనే వేగుచుక్క 


- Copyright@2012 Kalyan

Wednesday, 1 February 2012

స్నేహం

నిర్జీవపు నిశీధి నిండిన హృదయంలో
మరణించిన మనశ్శాంతికి సంజీవని స్నేహం

వెంటనడిచే నీడ కూడా వెక్కిరించే వేళల్లో
కంటతడిని కాచేటి ఓదార్పు స్నేహం

కన్నూ మిన్నూ కానని అహంకారంలో
నిన్ను నీకు తెలియజేసే గుణపాఠం , స్నేహం

పసితనపు ఆటలనుండీ
పండుముదుసలి బోసినవ్వులవరకూ
పంచుకునే చెరిసగమే స్నేహం

ప్రేగు బంధం కాదిది ,
ప్రేమ ఆకర్షణ కానిది

తన నిరుపేద సఖుని పిడికెడు ప్రేమకి
నిలువెల్ల కరిగిన జగన్నాధుని హృదయమిది .



                                                                      --కాపీరైటు @2012 కళ్యాణ్

Tuesday, 13 December 2011

వెతుకుతున్నాను ..



వేల అడుగుల నీడల నడుమ,
వేల ఊపిరుల జాడల మధ్య ,
వెన్నంటి వచ్చే నీ వ్యక్తిత్వాన్ని
ఒంటరిగా వెతుకుతున్నాను ..

ఆశల  శిఖరపు అంచుల చివర
నిరాశల అగాధపు లోతుల లోపల 
విస్తరించిన నీ విశ్వరూపాన్ని
గుర్తుపట్టలేక వెతుకుతున్నను  ..

నా ఊపిరి అలలను మోసే కడలివై 
నా ఊహల మెరుపులను భరించే మిన్నువై
నా ఇంట్లోనే ఉన్న నిన్ను
ఊరంతా వెతుకుతున్నాను ... 

విరహం తొలగి
నిరీక్షణ కరిగి
నిన్ను చూసే ఒక్క క్షణం కోసం
లక్షల యేళ్ళుగా  వెతుకుతున్నాను   

Wednesday, 23 November 2011

ఎదురీత..


దుడుకు అడుగుల శిశిర గాడ్పులకి ,
తల్లి ఒడి నుండి వేరు పడి ..
కొండలనకా , గుట్టలనకా ...
పిల్లగాలులతో కలిసి తిరిగి ....
దుమ్ము ధూళిలో కలిసిపోయి ,
వేల అలజడుల బరువు మోసి,
వేల అడుగుల కింద నలిగి ,
ఇల్లుని విడిచి , తల్లిని మరిచి
ఒక నిర్జీవ కుడ్యపు సన్నని బీటలో చేరి
సేదతీరింది ఒక చిన్ని విత్తనం.


హితులు కరువై , భవిత బరువై
బ్రతికే దారిని ,
ఆ బీటలో పరుచుకున్న నిశీధిలో వెతుక్కుంటూ ..
చిట్టి చేతులతో ఆ గట్టి గోడను
తవ్వుకుంటూ ...
సాగిపోతున్న ఆ విత్తుని
హత్తుకుంది
ఒక ఉదయపు అనాధ మంచుకణం.  


బ్రతుకు దొరికింది ..
భవిత నిలిచింది ...
వెతుక్కుంటూ ఒక సూర్య కిరణం
ఆ విత్తనాన్ని పలకరించింది ...
కలిసిరాని కాలంతోనే సాగుతూ
వెక్కిరించిన విధినీడనే  మెలుగుతూ , వెలుగుతూ
కొన్నాళ్ళకి ..
గుండెలేని ఆ గోడ పైన
పచ్చని హరితం , వసంతాన్ని స్వాగతించింది .. 

Tuesday, 22 November 2011

రిక్త హస్తాలతో...





నాకు నచ్చిన ముళ్ళ దారిని వదిలి ..
నలుగురూ నడిచే రాజ మార్గం లో అడుగులు వేసాను ..
దారి అనువుగా ఉందో లేదో చూసానే గాని ..
గమ్యం చేరుస్తుందో లేదో అడగడం మరిచాను ..

సాటివారి పై బురదజల్లాలని ..
ఆలోచిస్తూ కాలం గడిపాను ..
వాళ్ళని తిట్టే తాపత్రయంలో ..
నా చేతులకి  నేనే బురద చేసుకున్నాను ...

మళ్ళీ ఎదగమని నువ్వు ఇచ్చిన ..
ఎన్నో ఉదయాలని వ్యర్ధం చేసుకుని ...
మళ్ళి బ్రతకమని నువ్వు విదిల్చిన ..
ఎన్నో ఊపిరులని గాలికి వదిలేసి ..
రిక్త హస్తాలతో నీ ముంగిట..
యాచిస్తూ నిలిచున్నాను ..

కొత్త ఉదయం ప్రసాదించమని ..
కాస్త ఇంగితం ప్రచోదించమని .



కాపీరైట్@కళ్యాణ్  2011

Wednesday, 2 November 2011

ఆత్మవిశ్వాసం

ఎదురొచ్చే కష్టాలని ,
ఎదిరించడంలోనే ఉంది విజయం ...
కదిలొచ్చే  కెరటాలని
చీల్చుకుంటూ పోయేదే పయనం ...



కలిసి రాని కాలపు బలాన్ని తిట్టుకుంటూ వదిలేస్తామా ?
నిబ్బరంగా సంకల్పంతో తట్టుకుని నిలబడలేమా ?


వెన్నుచూపే వారిని , వారి నీడకూడ వెక్కిరిస్తుంది  ...
నిన్ను నువ్వే నమ్ముకుంటే , ఆ మిన్ను కూడా వంగి వస్తుంది ...

సమస్యల చీకటి లో ఇంక కన్నీరు తో మిగిలిపోదామా?
గెలుపనే వెలుతురు వెతుకుతూ , చిరునవ్వుతో సాగలేమా ?

Saturday, 29 October 2011

అవ్యక్తం

ఒక ఉదయం,


అటూ ఇటూ విచే అల్లరి గాలులకి,ఎగురుతూ సాగుతూన్న ఒక యెండుటాకు ,'చిటపటా' చప్పుడు చేసుకుంటూ , ఒక వృద్ధ వృక్షపు నీడలోకి వచ్చి ఆగింది ... ఒక సారి ఆ చెట్టుని ఎగా దిగా చూసి ఎదో గుర్తుకుతెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది ..


' మసక బారిన ఙ్ఞాపకాల గదుల్లారా !
  మరుపు నిండిన నా మస్తిష్కపు పొరల్లారా !
   ఏదో తెలియని అభిమానం ,
   ఈ నీడన నాలో చిగురిస్తోంది  
   ఎన్నో ఏళ్ళ ఒక పరిచయం ,
   మళ్ళీ ఇక్కడ పలకరిస్తోంది .
ఎక్కడిదర్రా , ఈ మధుర గానం , ఇంకా ఎదలో మోగుతోంది ..
ఎప్పటిదర్రా , ఈ  పులకింతల పరిచయం  , తలపుల్లో ఇంకా మెదులుతోంది ? '






అని ప్రశ్నించింది .. అది విని ఆ చెట్టుకి ఉన్న ఆకులు గల గలా నవ్వాయి , 'ఈ ముసలి ఆకుకి రాలిపొయినా ఇంకా మతిమరుపు పోలేదు ' అని కొన్ని పిల్ల గాలులు తమలో తాము  గుసగుసలాడుకున్నాయి .. అది విని ఆ ముసలి ఆకు మనసులో మొలిచిన చిన్న పౌరుషపు తాకిడికి తన స్వరం కాస్త హెచ్చించి ఇలా అంది ..
' నవ్వులాటలే  మీకు పిల్ల గాలుల్లారా ,
 దుడుకు నవ్వులే మీకు కొత్త ఆకుల్లారా ?
 ఉడుకు రక్తపు దుడుకు , ప్రాయముడుగినప్పుడు ఉండబోదు
 నేటి మీ సూర్యోదయం , నా రేపటి సంధ్య ముందు నిలువబోదు
అప్పుడు మీ బోసినోళ్ళతో వెర్రి నవ్వులు  నవ్వుదురులే
ఆనాడు మీ పలుకుల వాడి ఎంతో నేనూ చూస్తానులే '


అని ఉక్రోషంగా పలికింది , ఆ పలుకులకి నొచ్చుకుని కొన్ని పిల్లగాలులు గట్టిగా వీచాయి , ఆ గాలికి , చెట్టు నుంచి మరొక ఆకు రాలి ,కింద ఈ ఆకు పక్కనే పడింది , పడీ పడగానే తన నేస్తమైన ఈ ఎండుటాకుని చూసి ఆనందంతో హత్తుకుంది ,  


'  బాధల కెరటాలు , సంతోషపు ముత్యాలు
   గంభీరంగా మోసే కడలే ఈ కాలం
  కలిసీ కలువని  భూమీ ఆకాశపు 
  సరిహద్దు రాజ్యమే ఈ కాలం
ఆయువయ్యిందని , ఊపిరాగిందని , రాలిపొయిన నా మనసుకు
మరునిముషం లోనే నిన్ను చూపించి చిగురింపజేసింది ఈ కాలం  '


అని మురిసిపోతూ తను ఎవ్వరో ఆ ఎండుటాకుకి ఙ్ఞాపకం చేసింది , దూరంగా ఎప్పుడో తను రాలిపొయినప్పుడు ఏర్పడిన గుర్తుని చూపించింది .అప్పుడు గుర్తొచింది ఆ ముసలికి , అది తన ఇల్లని , ఆ చెట్టు తన అమ్మని ... తను రాలిపోయినా  ఇంకా తను వదిలి వెళ్ళిన గుర్తులని మోస్తున్న తన తల్లి ని చూసి ..
'గుండె తడి అయినా
మనసు చెమ్మగిల్లినా
చుక్క కన్నీరయినా మిగలని
అలసిపొయిన ఎండుటాకుని  '


అని బాధ పడుతూంటే , చెట్టు మీదున్న మంచు కరిగి , ఆ తల్లి వృక్షపు కన్నీటి బిందువై ఆ ఎండుటాకుని తడిపింది ..

Thursday, 27 October 2011

నా (పగటి)కలల సుందరికి ..

(సినెమాలు చుస్తూ , ఎవేవో ఊహించుకుంటూ పగటి కలలు కనే , ఆ అమాయకత్వం , కాలక్రమేణా కనుమరుగవుతుంది , కాని ఆ ఙ్ఞాపకాలు మాత్రం మిగిలిపొతాయి ..  )



కలవై కనులకు కనిపించావు
చిరునగవై పెదవికి పరిచయమయ్యావు


ఊహల అలపై ఊయలలూపి
కొత్త తీరాలని మనసుకి చూపి


ఏ ఆవిరి తెరల మాటుకు మాయమయ్యావు?
ఒక మంచుశిల్పానివై మిగిలిపొయావు ..


పగటికలల నీ ధ్యానం లో , నా ప్రాయం
మధుర ఙ్ఞాపకమై మిగిలిపొయింది
పరిణితి అనే మౌనంలో , నా కర్తవ్యం
ఒక చేదు నిజంగా ఎగసి వచ్చింది .

Tuesday, 10 May 2011

పయనం

ఏ ఎండ మావులకై అర్రులుచాస్తున్నావు

ఏ శూన్యరాగాలకి నీ గొంతు అరువిచ్చావు

ఏ గాఢచీకట్లకి నీ ఉదయం అమ్ముకుంటున్నావు

ఏ వ్యర్ధవాదనలకి నీ కాలం వెచ్చిస్తున్నావు


లెక్కలేనన్ని దారుల మధ్య , దిక్కు తోచక తిరుగుతున్నా

ఆ దారులు చేర్చే గమ్యం ఒకటే అని తెలుసుకోలేకున్నావు


భయం సంద్రంలో , ఆకలి కెరటాలపై

అసూయా ద్వేషం అను జంట నావలతో

సాగిపొయే నిత్యాన్వేషీ , ఓ మనిషీ

ఎటువైపు నీ పయనం? !!