Monday, 30 January 2012

పశువుల కాపరి ఆత్మతత్త్వం

సూర్యోదయానికి ముందు గాఢమైన చీకట్లు మెల్లగా కరుగుతున్న సమయం.
గోదావరి  ఒడ్డు దగ్గర ఉదయపు సంధ్యావందనం పూర్తిచేసుకుని , శిష్యులతో వేదవిధానాల గురించి , ఆత్మతత్త్వాన్ని గురించి చర్చిస్తూ వస్తున్నాడు ఒక గురువు .

'గురువుగారు , ఆత్మ అంటే ఏంటి అండి ? ' అంటూ ఒక శిష్యుడు ఆతృతగా అడిగిన ప్రశ్నకి సమాధనంగా వివరణ ఇస్తూ ..

' సర్వాన్ని సాక్షిగా వీక్షిస్తూ , మాయకీ , మార్పుకీ అందనిదే ఆత్మ ' అని చెబుతున్నాడు గురువు . 

వారి సంభాషణ ఈ విధంగా సాగుతూండగా ,ఎదురుగా ఒక పశువులకాపరి అప్పుడేలేచి తన  విధులకి తయారవుతూ వీరి సంభాషణ విన్నాడు.

ఆ రోజు రోజంతా అదే విషయం అలోచిస్తూ గడిపాడు ,' సర్వాన్ని సాక్షిగా వీక్షించటం ' అనేది వాడి మనస్సుకి బాగా హత్తుకుపోయింది . అసలు అలా ఉండటం కుదురుతుందా అనే ఆలోచన వాడి మనస్సులో మొలకెత్తింది . ఇదేదో ప్రయత్నిస్తేగాని అర్ధం అవ్వదనుకుని , అప్పటినుండీ అన్నిటినీ కేవలం సాక్షిగా చూడటం మొదలు పెట్టాడు .

మొదట్లో అలా ఉండటం అస్సలు కుదరలేదు. మరీ ముఖ్యంగా భావోద్వేగాల విషయంలోనూ , ఆకలి దప్పుల విషయంలోనూ ఇది అసలు సాధ్యం కాలేదు. ఒక పక్షం రోజుల తర్వాత ఇది మన వల్ల కాదు వదిలేద్దామనుకుని , కర్ర భుజమ్మీద వేసుకుని ఇన్నాళ్ళ తన ప్రయోగం గురించి పునరాలోచన చేస్తూ అల నది వడ్డున కూర్చున్నాడు .



ఎదురుగా ప్రవహిస్తున్న గోదారి అలలు , మెల్లగా వీస్తున్న తెమ్మరలు , నది అలలమీద నుండి వీచే గాలి చప్పుడు అన్నీ ఒక రకమైన ధ్యానానుగుణమైన వాతవరణం కల్పిస్తూ ఉండగా , ఆ పశువుల కాపరి దృష్టి ప్రవహిస్తూన్న నదిమీద పడింది . ఈ క్షణం కనపడిన అల , మరునిముషం అక్కడ ఉండట్లేదు . ఈ క్షణం తనను స్పృశించిన  గాలి , మరునిముషం ఎక్కడకి వెళ్తోందో  తెలియట్లేదు. కొత్త కొత్త అలలు పుడుతూనే ఉన్నాయి , కొత్త కొత్త అనుభూతులను  గాలి కలిగిస్తూనే ఉంది  . కాని ఆ నది స్వరూపం , ఆ గాలి స్వరూపం మటుకు మారట్లేదు. అల కొత్తదైనా పాతదైనా , నదికి ప్రవహించటమే లక్షణం , ఇదంతా ఎదో విశ్వరచనకు లోబడి సాగుతూన్నట్టుగా తోచింది ఆ పశువుల కాపరికి.

' గురువుగారు అన్న ఆ ఆత్మ తత్త్వానికి , గోదారి తల్లి బోధిస్తున్న ఈ విశ్వరచనకి ఎమైనా సంబంధం   ఉందా ?'  అంటూ మళ్ళీ వాడి మదిలో ఒక ప్రశ్న మొలకెత్తింది .

దీర్ఘాలోచనలోన చేస్తూ వాడు సమాధి స్థితిలోనికి జారుకున్నాడు . ఒక 20 సంవత్సరాలు అలా గడిచిపోయాయి. ఆ పశువుల కాపరి  చుట్టూ పుట్టలొచ్చేశాయి .

అంతకుముందు ఆత్మ గురించి చెప్పిన గురువు పరమపదించారు ,  ఆత్మ గురించి అడిగిన శిష్యుడు ఆ గురువు మఠానికి ఆచార్యుడయ్యాడు.

అలా ఒకనాటి సాయంకాలం , ఆ పశువుల కాపరి సమాధి నుండి మేల్కొని తన స్థితిని గమనించుకుని అక్కడ నుండి  లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.

ఈ రెండు దశాబ్దాలుగా , ఏ భావోద్వేగాలూ , ఏ రసస్పందనలు , ఏ ఆకలి దప్పులు లేని స్థితిలో తనను నడిపించిన చైతన్యం ఎదైతే ఉందో , ఆ చైతన్యపు విశ్వరచన యొక్క లిపి కొంత అవగతమయ్యేసరికి తనను తాను మర్చిపోయి ఆ తత్త్వం యొక్క ఆద్యంతాలను నిరంతరం దర్శించాలని తపిస్తూ ముందుకు సాగిపోతున్న అ పశువుల కాపరికి , దూరంగా మైకు నుంచి వినపడుతున్న ఒక పండితుడి మాటలు వినిపించాయి .

' సర్వాన్ని సాక్షిగా వీక్షిస్తూ , మాయకీ , మార్పుకీ అందనిదే ఆత్మ ' అని చెబుతున్నాడు ఆ వక్త .  ఆ వక్త ఎవ్వరో కాదు , పూర్వం ఆత్మ గురించి అడిగిన శిష్యుడు మరియు  నేటి ఆచార్యుడు .

తనకు ఆత్మ బోధ చేసిన ఆ గురువు ఙ్ఞాపకం వచ్చి ఒక సారి చూసివద్దామని  అటువైపు వెళ్ళాడు ఆ పశువులకాపరి .

ఆ ప్రవచనం వినపడుతున్న సభాప్రాంగణం అంతా  విద్యుద్దీపాలతో , మైకుల హోరుతో , భక్తుల వరుసలతో కిట కిటలాడిపోతోంది . అంత మంది లో చినిగిన బట్టలతో , జడలు కట్టేసి , వికృతంగా ఉన్న ఆ పశువులకాపరిని చూసి , ఆ ఆచార్యుని శిష్యవర్గం తరిమివేసింది .

' ఛీ ! శౌచంలేని వాడా , ఇటు రాకు .. పవిత్రమైన ఈ ప్రాంగణం పాడుచెయ్యకు ' అంటూ ఆ ప్రవచనానికి వచ్చిన వారందరూ ఆ పశువులకాపరిని తన్ని తరిమివేసారు .

'నైనం ఛిందంతి శస్త్రాణి ...' అంటూ భగవద్గీతనుండి  శ్లోకం మైకు నుంది వినపడుతూంది .

ఒక చిరునవ్వు నవ్వి అక్కడ నుంచి నిష్క్రమించాడు ఆ పశువుల కాపరి . 

Tuesday, 13 December 2011

వెతుకుతున్నాను ..



వేల అడుగుల నీడల నడుమ,
వేల ఊపిరుల జాడల మధ్య ,
వెన్నంటి వచ్చే నీ వ్యక్తిత్వాన్ని
ఒంటరిగా వెతుకుతున్నాను ..

ఆశల  శిఖరపు అంచుల చివర
నిరాశల అగాధపు లోతుల లోపల 
విస్తరించిన నీ విశ్వరూపాన్ని
గుర్తుపట్టలేక వెతుకుతున్నను  ..

నా ఊపిరి అలలను మోసే కడలివై 
నా ఊహల మెరుపులను భరించే మిన్నువై
నా ఇంట్లోనే ఉన్న నిన్ను
ఊరంతా వెతుకుతున్నాను ... 

విరహం తొలగి
నిరీక్షణ కరిగి
నిన్ను చూసే ఒక్క క్షణం కోసం
లక్షల యేళ్ళుగా  వెతుకుతున్నాను   

Wednesday, 7 December 2011

నా మొదటి శతకం - కొన్ని పద్యాలు

తెలిసె నేఁడు నాకు తెలుగులో మాధుర్య
మందమైన భావమంకురింప
తెలుగు తరచి చూడఁ దేనె ధారలు జారు
చక్రి పలుకు వినుఁడు సత్య వాక్కు

అంబరంబునంటు హర్మ్యాళి  నిర్మించె
విశ్వమంత నిలిచి విస్తుబోవ
మనిషి మింటికేగె మరిచి తన భువిని
చక్రి పలుకు వినుఁడు సత్య వాక్కు

వింతగొలుపుఁ జూడ విత్తు మొలచు తీరు
నెదుగు నేల గుణముకెదురు నిలిచి
స్థితులు గతులు వెతలు స్థిరచిత్తునాపునే ?
 చక్రి పలుకు వినుఁడు సత్య వాక్కు

తాతలిడిన  యాస్తి తమగొప్పగన్ జూపి
విర్రవీగు చుంద్రు వింత గాను
తెలిసికొనఁగవారు తెలివైన సోమరుల్
చక్రి పలుకు వినుఁడు సత్య వాక్కు

కులము పేర ఖలులు కూడఁగట్టు బలిమి
మానవత్మమెదుట మనఁగఁబోదు
తిమిరచయము తొలఁగు దినకరద్యుతి సోక
చక్రి పలుకు వినుఁడు సత్య వాక్కు 

Wednesday, 23 November 2011

ఎదురీత..


దుడుకు అడుగుల శిశిర గాడ్పులకి ,
తల్లి ఒడి నుండి వేరు పడి ..
కొండలనకా , గుట్టలనకా ...
పిల్లగాలులతో కలిసి తిరిగి ....
దుమ్ము ధూళిలో కలిసిపోయి ,
వేల అలజడుల బరువు మోసి,
వేల అడుగుల కింద నలిగి ,
ఇల్లుని విడిచి , తల్లిని మరిచి
ఒక నిర్జీవ కుడ్యపు సన్నని బీటలో చేరి
సేదతీరింది ఒక చిన్ని విత్తనం.


హితులు కరువై , భవిత బరువై
బ్రతికే దారిని ,
ఆ బీటలో పరుచుకున్న నిశీధిలో వెతుక్కుంటూ ..
చిట్టి చేతులతో ఆ గట్టి గోడను
తవ్వుకుంటూ ...
సాగిపోతున్న ఆ విత్తుని
హత్తుకుంది
ఒక ఉదయపు అనాధ మంచుకణం.  


బ్రతుకు దొరికింది ..
భవిత నిలిచింది ...
వెతుక్కుంటూ ఒక సూర్య కిరణం
ఆ విత్తనాన్ని పలకరించింది ...
కలిసిరాని కాలంతోనే సాగుతూ
వెక్కిరించిన విధినీడనే  మెలుగుతూ , వెలుగుతూ
కొన్నాళ్ళకి ..
గుండెలేని ఆ గోడ పైన
పచ్చని హరితం , వసంతాన్ని స్వాగతించింది .. 

Tuesday, 22 November 2011

రిక్త హస్తాలతో...





నాకు నచ్చిన ముళ్ళ దారిని వదిలి ..
నలుగురూ నడిచే రాజ మార్గం లో అడుగులు వేసాను ..
దారి అనువుగా ఉందో లేదో చూసానే గాని ..
గమ్యం చేరుస్తుందో లేదో అడగడం మరిచాను ..

సాటివారి పై బురదజల్లాలని ..
ఆలోచిస్తూ కాలం గడిపాను ..
వాళ్ళని తిట్టే తాపత్రయంలో ..
నా చేతులకి  నేనే బురద చేసుకున్నాను ...

మళ్ళీ ఎదగమని నువ్వు ఇచ్చిన ..
ఎన్నో ఉదయాలని వ్యర్ధం చేసుకుని ...
మళ్ళి బ్రతకమని నువ్వు విదిల్చిన ..
ఎన్నో ఊపిరులని గాలికి వదిలేసి ..
రిక్త హస్తాలతో నీ ముంగిట..
యాచిస్తూ నిలిచున్నాను ..

కొత్త ఉదయం ప్రసాదించమని ..
కాస్త ఇంగితం ప్రచోదించమని .



కాపీరైట్@కళ్యాణ్  2011