Thursday, 17 September 2015

కృష్ణ భక్తుడనెడి కీర్తి నిజము


ఆ||  

శ్రీధర చరణాబ్జ సేవ సద్భాగ్యము.
మాధవజన కూర్మి మనెడి ధనము.
పార్ధహితుని గూర్చిపాడు జిహ్వ స్థిరము.
కృష్ణ భక్తుడనెడి కీర్తి నిజము



          మాధవుడి చరణాలనే పద్మాలని సేవించుకోవటం భాగ్యాల్లోకెల్లా మా మంచి భాగ్యం
          ఆయన జనాలుతో చేసే స్నేహమే ఎల్లప్పుడూ ఉండే ( మన్నే ) ధనం
          అర్జున హితుని గురించి పాడుకునే పదములే ( నాలుకలే ) స్థిరము 

           అందుకే కృష్ణ భక్తుడనెడి కీర్తి నిజము




సీస || 

పాపచయము దాటి ప్రారబ్ధముల దాటి
మోహమాయను దాటి ముదిమి దాటి

బుధుల మెప్పును దాటి పుడమి సంపద దాటి
సుజనసంగముదెచ్చు శోభ దాటి

షడరిబంధము దాటి సకలసిద్ధుల దాటి
కాలవ్యవధి దాటి కర్మదాటి 

సర్వసాక్షిగ మారి సర్వేశునిజపాద 
ధ్యానజనిత యాత్మజ్ఞాన ధను(కి 

బిరుదులేవి నెరపు పెద్దసత్కారంబు
భూషలేవి దెచ్చు భూరిసొగసు
సర్వ వర్జితునకు శాశ్వతాభరణము 
కృష్ణ భక్తుడనెడి కీర్తి నిజము 


              పాపాలూ , కష్టాలూ , మోహాలూ , ముసలితనాలూ , 
              బుధుల మెప్పు ( గొప్ప వారి మెప్పు ) , భూమి మీద సంపద
              సుజనసంగము ( మంచి వారి జట్టు )
              షడరిబంధము ( కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాల బంధం ) 
              సిద్ధులు , కర్మ , కాలము ...
              ఇవన్నీ దాటుకుని  వచ్చిన యోగికి సరైన ఆభరణం వంటి పేరు కృష్ణ భక్తుడని ...


తప్పులన్నీ నావి ... దయ మా కృష్ణుడిది
అదన్నమాట మరి .....మళ్లీ కలుద్దాం

Friday, 11 September 2015

రైతు వధ





చం ||

నిరతపు వహ్నియై రుణము నీ హృదయాంతరమున్ దహింప, సు
స్థిరముగ వర్షలేమి జన జీవ వనంబు దహించుచుండ నా
వరుణుడు రాడు తాపఝరి పంటల నంతము చేయ , రైతు సో
దర ! కను జారు నీరునిక దాచు క్షుధార్తిని దీర్చు నద్దియే


"నిరతపు వహ్నియై రుణము నీ హృదయాంతరమున్ దహింప" == చేసిన అప్పు నిత్యమూ మనసులో మంటగా మారి కాలుస్తూ,
"సుస్థిరముగ వర్షలేమి జన జీవ వనంబు దహించుచుండ" == ఏది స్థిరంగా ఉన్నా లేకపోయినా వర్షలేమి మాత్రం స్థిరంగా , జనారణ్యాన్ని కాలుస్తూంటే
"వరుణుడు రాడు తాపఝరి పంటల నంతము చేయ" == వర్షం రాదు , వేడి ఇంకొకపక్క వేసిన విత్తులని చంపేస్తూ
" క్షుధార్తిని " == ఆకలి

జూలై ఆగష్టులలో వర్షాలు పడాలి , కాని పడవు...
వ్యవ'సాయా'న్ని నమ్ముకుని బ్రతకాల్సిన రైతులు , ప్రభుత్వ 'సాయా'న్ని అర్ధిస్తూ ...
విత్తనాలని పురుగుమందులని అప్పులు చేసిన రైతులు అప్పు ఎలా కట్టాలో తెలియక ఆత్మహత్యలని ఆశ్రయిస్తున్నారు.
అన్నదాతలే అన్నార్తులై , తాము దున్నిన పొలాల్లోనే కూర్చుని పురుగుమందులు తాగి చచ్చిపోతున్నారు

ఇది ఈరోజు కొత్తగా మొదలైంది కాదు..

ఒక దశాబ్దానికి పూర్వం నుంచే అన్నదాతలు బలవన్మరణాలకి పాల్పడుతున్నారు .. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ( తెలంగాణ తో కలిపి ) , మహారాష్ట్రలో ఎక్కువ మంది ..

2004 లో 18,241 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు
2010 లో 15,963 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు
2011 లో 14,207 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు
2012 లో 13,754 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు  ( Source : wikipedia )

1995 నుంచి మహారాష్ట్రలో రోజుకి పది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ( National Crime Records Bureau statistics )

Indian Meteorological department అంచనాల ప్రకారం , 2000-2013 మధ్య కేవలం నాలుగు సంవత్సరాలే జూన్-సెప్టెంబరు మధ్య పడాల్సిన వర్షాలు సరిగ్గా పడ్డాయి

మధ్యలో బిటి పత్తి అని GM Crops అని వచ్చి విత్తనాల రేట్లు పెంచి , తద్వారా రైతు అప్పులు పెంచి, ఆత్మహత్యలకి పరోక్షంగా సహాయపడ్డాయి...

ఇన్ని పద్మవ్యూహాల మధ్య , మన రైతు అభిమన్యుడై యుద్ధం చేస్తున్నాడు..
అప్పటి భారతం అభిమన్యుడిని కోల్పోయింది .. ఇప్పటి భారతమైనా జాగ్రత్త పడి మన అభిమన్యులని కాపాడుకుందాం..




      

Friday, 4 September 2015

మాధవుడు - మాష్టారు

మాతృదేవోభవ , పితృదేవోభవ , ఆచార్యదేవోభవ ..

గోలోకంలో మాధవుడితో సరదాగా మాట్లాడుతూ , ఖాళీ చల్దిమూటలు వీపున పెట్టుకుని , మందలని తోలుకుంటూ ఇళ్ళకి వస్తున్న గోపాలురకి భూలోకం లోని భరత ఖండం లోనుంచి ' ఆచార్యదేవోభవ ' అని గట్టిగా వినబడుతోంది 

గోపాలురు : కృష్ణయ్యా ! ఏంటీ అందరూ ఆచార్యదేవోభవ అని ఈ రోజు గట్టిగా అంటున్నారు ? నువ్వు తప్ప మాకు ఎవ్వరూ తెలియరు , నువ్వో జగదాచర్యుడివయ్యె .. అంటే ఆచార్యదేవోభవ అని నిన్ను పిలుస్తున్నారా ?  పని గట్టుకుని నిన్ను పొగడటానికి కారణం ఏంటట ?




మాధవుడు : అదా ! ఈ రోజు భారతవనిలో  ఆచార్య దినోత్సవం అని , పిల్లల నుంచి పెద్దల దాకా వాళ్ళకి పాఠాలు చెప్పిన మాష్టార్లని తల్చుకుంటారు , గౌరవంగా పూజిస్తారు .. ఇది ప్రతీ సంవత్సరం జరిగే తంతే గా , కొత్తగా అడుగుతారేంటి ?

గోపాలురు : ప్రతీ సంవత్సరం జరిగేదే అనుకో .. కానీ ఆచార్యదేవోభవ అని ఈ సారి గట్టిగా వినపడుతూంటే ... సందేహం వచ్చింది ..

మాధవుడు : అదా !  'గురుపూజోత్సవం ' అని పిలుచుకుందాం అని ఆలోచన చేసుకున్నారు వారు .. పర భాష కాకుండా సొంత భాష లో పిలుచుకుందాం అనే ఆలోచనకే ప్రకృతి కూడా పులకరించి ప్రతిధ్వనిస్తోంది ...అంతే  ...

గోపాలురు : అదన్నమాట సంగతి , బాగు బాగు ... సరేగాని చాలా చోట్ల ఆ తలపాగా పెద్దాయన చిత్రాలు పెట్టుకున్నారు ఈ రోజు విశేషంగా ! ఎవరాయన ?

మాధవుడు :  ఆయనే , శ్రీ సర్వేపల్లి రాధాక్రిష్ణన్ .. తమిళ దేశంలో పెరిగిన తెలుగాయన .

ఆ వేదాంత 'శార్దూల వృత్తాం'తం టూకీగా ఇలా చెప్తా వినండి

|| వేదాంతంబును బోధ జేయు నతడో విద్వాంసుడై భూరి వి
ద్యాదానంబులు జేసె చిత్తమున యద్వైతంబు నే నిల్పె హిం
దూ దేశాన ద్వితీయ రాష్ట్ర పతి యై ద్యోతించె వేదాంత వి
ద్యా దేశాభ్యుదయంబు యూపిరిగ రాధాకృష్ణుడుండెన్ ధరన్ ||




20యవ శతాబ్దం తొలినాళ్ళ నుంచీ ,హిందూ మతంపై , భారత దేశ అధ్యాత్మికత పై విమర్సలు గుప్పించటం మొదలైంది . ఆ విమర్శలకి వివేకానందుడు మొట్టమొదటి  అడ్డుకట్ట వేస్తే , శ్రీ సర్వేపల్లి రాధాక్రిష్ణన్ ఆ అడ్డుకట్టని మరింత పరిపుష్టం చేసారు.

ఆయన ప్రాక్పశ్చిమ దృక్కోణాలకి వారధి లాంటి వారు , మన వారే.


గోపాలురు : ఓహో మంచి మాష్టారన్నమాట . ఐతే సరే మాష్టారు దేవోభవ , అదే అదే ఆచార్యదేవోభవ. మళ్ళీ అంతటి మంచి మాష్టారు ఈ మధ్యే మన దగ్గరకి వచ్చారు గా , ఎవరో తెల్లజుట్టాయన 'కలాం ' అని , మన గోలోకం లోని పిల్లలందరిని కూర్చో పెట్టి కాగితం రాకెట్లు తయారు చేయిస్తున్నారు .




మాధవుడు : ఆయనా మన వారే . మాష్టార్లందరూ నా రూపాలే గా..


గోపాలురు : అవును అవును , కృష్ణం వందే జగద్గురుం

Monday, 1 September 2014

మాధవుని శిఖిపింఛం -- బాపు

(నిన్న పరమపదించిన బాపూ గారిని స్మరించుకుంటూ)

గోలోకంలో పిల్లనగ్రోవి ఊదుతూ , యమునా నదీ తీరాన విహరిస్తున్న మా మాధవుడితో సాటి గొల్లవారు ఇలా చెప్తున్నారు 



మిత్రులు : " నిన్న సాయంత్రం భూలోకం నుంచి తెల్ల లాల్చీ వేసుకున్న ఒక పెద్దాయన ఇప్పుడే వచాడు .. "

మాధవుడు : " ఏడీ  , ఎక్కడున్నాడు .. వచ్చిన వాడు కనపడడేమి  ? "




మిత్రులు : " అదిగో ఆ పొన్నచెట్టు నీడన కళ్ళజోడు పెట్టుకుని , అస్తమాను ఎదో రాసుకుంటూ కూర్చునో ఇంకో తెల్ల లాల్చీ పెద్దాయన పక్కనే కూర్చుని , తులసాకు , గోపీ చందనపు రాయి ఇలా కనపడినదానిమీదల్లా రాములోరి బొమ్మలు గీసేస్తున్నాడు  " అని చూపించారు ...

మాధవుడు : " ఓహా ఆయనా .. నాకు తెలుసులెండి ..
నేనే పంపాను .. పని ఐపొయిందని నేనే రమ్మన్నాను " అని ఇలా అన్నాడు ..


|| శ్రీ రామ చారిత్ర చిత్రార్చనల్ జేయ
       నా శిరః పింఛమున్ నరుని జేసి
   నవరసంబులనల్లి నటులపై చిత్రింప
       నా లీలలన్ వాని నడక జేసి 
   లిపికి వంపులు నేర్పి లేత సోయగ మద్ద
       తెనుగు జాతిన వాని స్థిరము జేసి
   రమణీయ సాహిత్య  రస భావ కూర్మియై
       భాసిల్ల నా మర్త్యు 'బాపు ' జేసి

   పుడమి 'సాక్షి' జేసి 'బుడుగు'గా నే మారి
   'రామ రాజ్య' శోభ రసన పొగుడ
   అవతరింప జేసె నవనిపై 'బాపు ' ని
    సత్తిరాజు వంశ చరిత మెరువ  ||





 మిత్రులు : " ఒహో ! అదా సంగతి , సర్లే .. మరి ఆ ఇంకో తెల్ల లాల్చీ పక్కన కూర్చున్నాడేంటి ? "

మధవుడు : " వాళ్లిద్దరూ కూడా , పాలూ వెన్నలా , పిల్లనగ్రోవి లేగదూడలా , మీరూ నేను లా ఒక జట్టు లెండి " 

అని చెప్పి చిద్విలాసంగా నవ్వుతూ  , అమ్మ యశోద కి ఈ విషయం చెప్పాలని అనుకుంటూ ఇంటికి పయనమయ్యాడు

Sunday, 17 August 2014

శ్రీ కృష్ణ జననం -- పారమార్ధిక సత్యం

జీవం పుట్టుక ఒక వింత !

పుట్టుక యే లేని పరమాత్మ పుట్టడం వింతలలోకెల్లా వింత ! అది కూడా అర్ధ రాత్రి , చెరసాలలో భయంకరమైన రాక్షసుల మధ్య , మాధవ జననం ఒక మహాద్భుతం ..


ఆ అద్భుతం తలుచుకుంటేనే మనసు ఆశువుగా చంపకమాల వృత్తంలోని ఒక చంగల్వ పూదండని స్వామికి ఆర్పించింది .. ఇదిగో అదే ఈ క్రింది పద్యం 


|| సాధక చిత్తమన్న చెరసాల నిశీథిన చిన్ని కుర్రవై
  దీధితి దప్పి యున్న వసుదేవుని వంశ నిధానమై  భవాం
  బోధి యగస్త్యుడీవు ధరబుట్టితి వాత్మ నిబోధ నార్ధమై
  మాధవ నీ భవంబు నిజ మార్గము మోక్ష విధాన పాఠికిన్ ||



శ్రీ కృష్ణ జననం పారమార్ధిక మైన ఎన్నో రహస్యాలకి ఆలవాలం

శ్రీ కృష్ణుడు దేవకీ దేవి అష్టమ గర్భం -- ముందు యేడు గర్భాలు దాటుకుని పుట్టిన ఎనిమిదో గర్భం , పరాత్పర సత్యం..

అష్టాంగ యోగంలో మొదటి ఏడు దశలను ( ఏడు గర్భాలు ) దాటాకా సాధకునికి కలిగే ఆఖరి దశ , ఎనిమిదో దశ -- సమాధి .. ఇక ఇంతే దీనితో యోగి కుండలిని సహస్రారకం చేరుకుంటుంది , విరాట్స్వరూపం  అవగతమవుతుంది .. అదే కృష్ణ జననం ...

ఆహా ! కేవలం పుట్టుకతోనే ఎంత పరమార్ధం బోధించాడో  ఆ జగద్గురువు .. తలుచుకుంటేనే రోమాంచితమవుతుంది , ఆది శంకరాచర్యులవారి ' దక్షిణాముర్తి  స్తోత్రం ' గుర్తుకువస్తుంది

' మౌన వ్యాఖ్యా పరబ్రహ్మ తత్త్వం '  -- పరబ్రహ్మ తత్త్వాన్ని మౌనంతోనే వ్యాఖ్య చేశారు ఆ ఆదిగురువు ... అదే పరబ్రహ్మ తత్త్వాన్ని పుట్టుకతోనే వ్యాఖ్య చేసారు ఈ జగద్గురువు