Tuesday, 21 June 2011

ఎలక్షన్స్ మేస్త్రీ

ఎప్పటిలానే సాయంత్రం చల్లబడేసరికి గట్టు మీదున్న చెట్టు కిందకి చేరుకున్నాడు లింగ రాజు..ఎదురుగా పెద్ద కలకలం , అంతా హడావిడిగా వస్తూపోతూన్న జనాలతో సందడిగా ఉంది గోదారి గట్టు.. పుష్కరాలకి ఏర్పాట్లేమో అనుకుందామంటే మొన్నామధ్యే అయ్యాయి ... సుబ్రహ్మణ్య షష్టి జాతరకి లేదా దీపావళి అమావాసకి ఏర్పాట్లా అంటే అదీకాదు ... " సినేమా వాళ్ళు షూటింగ్ కోసం వచ్చారేమో " అనుకుంటూ ఆత్రంగా ఎదురుగా వచ్చే రంగయ్య తాతని "హీరో ఎవరు " అని అడిగాడు లింగ రాజు ...

 
"అప్పుడే చుక్కేసేసావా" అని విసుక్కుంటూ వెళ్ళిపొయాడు రంగయ్య తాత ...

 
"ఇంకోసారి చుట్టలు తెమ్మని అడుగు చెప్తాను " అని మనసులో అనుకుంటూ .. దూరంగా పోతున్న రత్తమ్మత్త తో .."అత్తో ! హీరోఇన్ వచ్చిందా ?" అని కేకవేసి అడిగాడు ..

 "మీ అమ్మమ్మ వచ్చిందిరా సచ్చినోడా !" అని ఇంకా ఎవోతిట్టి వెళ్ళిపొయింది.. "దీని కూతురిని మొన్న కెలికినది ఇంకా మనసులో పెట్టుకుందేమో " అనుకుంటూ అసలు ఏం జరుగుతోందో సొంతంగా చూద్దామని వెళ్ళాడు లింగరాజు
 

ఎదురుగా ఎత్తైన గద్దెమీద నుంచి సింగరాజు అందరికి ఏవో పురమాయిస్తున్నాడు ...

 
సింగ :- " సోమవారం అందరూ వచ్చేయండి , మర్చిపోకండి , పార్టీ పేరు గుర్తుందిగా .. చప్పట్లు ఎఫ్ఫుడు కొట్టాలో , ఈలలు ఎప్పుడు వేయ్యాలో మనవాళ్ళు చూపిస్తారు మీరు వాళ్ళని ఫాలో అయిపోండి .. బాగా అరిచినవాళ్ళకి సాయంత్రం మందు ఫ్రీ అని పార్టీ వాళ్ళు చెప్పారు , మరి చూసుకోండి ... పసుపు బట్టలు కాదు , తెల్ల బట్టలు వేసుకురండి ... మర్చిపొయి మొన్నట్లా గులాబీ రంగు వేసుకొచ్చేరు , అది ఇప్పుడు కాదు ముందు ముందు వస్తది " అంటూ ఇంకా ఎవేవో చెప్తున్నాడూ


లింగరాజు ఈ తతంగం అంతా చూసి , అవాక్కయ్యాడు , కొంచెం తేరుకుని


లింగ :- "ఏమిరా సింగా ! రాజకీయ్యాలలోకి వెళ్ళిపోయావా , ఏం పార్టీ ఏంటి ?" అని వ్యంగ్యం నిండిన స్వరంతో అడిగాడు


సింగ :- "ఏడవకు రా , నేనేమీ రాజకీయ్యాలలోకి వెళ్ళలే ! అయినా అక్కడ మన లాంటివాళ్ళకి చోటు లేదు .. అన్నీ నాయకులూ , వారి బంధువులూ పంచేసుకున్నారు
 
లింగ :- " అయితే ఇదంతా?"


సింగ :- "వ్యాపారం , నేను మేస్త్రీని వాళ్ళు కూలీలు , వ్యత్యాసమల్లా మేము ఇల్లు కట్టము , "జై జై" లు కొడతాం అంతే ,నాయకుడెవడో మాకు అనవసరం , డబ్బులిస్తే జై కొడతాం , ఇంకా ఎక్కువిస్తే వాడ్ని ఊరంతా తిప్పుతాం ... పనికి డబ్బు తీసుకునే ప్రొఫెషనల్ అభిమానులం "


లింగ :- "బాగుందిరా నీ యాపారం ! మరి ఓటు కూడా అలానే వేస్తారా ? మీలాంటి వాళ్ళ వల్లే ఇలాంటి నాయకులు తయారవుతున్నారు.."


సింగ:- " అంతలేదురో ! 65 % ఓట్లు పోల్ అయితే అవన్ని మేము వేసేవే .. వెయ్యనిదల్లా చదువుకున్న ప్రబుద్దులే



Tuesday, 10 May 2011

పయనం

ఏ ఎండ మావులకై అర్రులుచాస్తున్నావు

ఏ శూన్యరాగాలకి నీ గొంతు అరువిచ్చావు

ఏ గాఢచీకట్లకి నీ ఉదయం అమ్ముకుంటున్నావు

ఏ వ్యర్ధవాదనలకి నీ కాలం వెచ్చిస్తున్నావు


లెక్కలేనన్ని దారుల మధ్య , దిక్కు తోచక తిరుగుతున్నా

ఆ దారులు చేర్చే గమ్యం ఒకటే అని తెలుసుకోలేకున్నావు


భయం సంద్రంలో , ఆకలి కెరటాలపై

అసూయా ద్వేషం అను జంట నావలతో

సాగిపొయే నిత్యాన్వేషీ , ఓ మనిషీ

ఎటువైపు నీ పయనం? !!

Monday, 24 January 2011

"స్కాము"రాజ్యం

లింగ :- ఉందిలే మంచి కాలం ముందూ ముందూనా ! స్కాములూ చేసెయ్యొచ్చూ నందా నందానా !

సింగ :- ఎంట్రో ! మంచి హుషారుగా ఉన్నావ్ ? ఆ స్కాములు చేయటం ఏమిటి ?

లింగ :- నీకు ఇంకా తెలీదా ? నేను రాజకీయ్యాల్లోకి వెళ్దామనుకుంటున్నా!

సింగ :- అయితే?

లింగ :- ఇక డబ్బులే డబ్బులూ !

సింగ :- ఏంటి రా నీ వాలకం ? రాజకీయ్యాలకి , డబ్బులకి , స్కాములకి సంబంధం ఏంటి? పవిత్రమైన ప్రజాసేవా పధం లోకి వెళ్తానంటూ , ఈ స్కాములు గోల ఏంటెహై !

లింగ :- ఏ ఊరు రా మీది ? గ్రహాంతరవాసి లా మాట్లాడుతున్నావ్ .. ప్రజా సేవా ! జోకులెయ్యకురో , ఆ పదానికి అర్ధంకూడా తెలీదు మన నాయకులకి ! ఏది దొరికితే దానితో స్కాములు చేసెయ్యటం తప్ప , ఇలాంటి కఠిన పదాలని కనీసం నేర్చుకోనైన నేర్చుకోరు ..

సింగ :- మరి మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు , ఇలాంటి వారందరు కూడా రాజకీయ్యాల్లో ఉండిన వారే గా , వారు మరి కడిగిన ముత్యం లా స్వచ్చంగానే బ్రతికారు గా ?

లింగ :- అందుకే వాళ్ళ విగ్రహాలు గాని , ఫొటోలు గాని మనకి పెద్దగా కనపడవు ఎక్కడా ! జనం కూడ వాళ్ళ పుట్టిన రొజులని పెద్దగా పట్టించుకోరు ! అసలు వారు హిస్టరీ పుస్తకాలలో తప్ప ఇంకెక్కడా మచ్చుక్కైనా కనపడరు

సింగ :- ఆపు నీ వెటకారం ! అలా అయితే మరి గాంధీ గారు అన్ని చోట్ల కనపడతారు , ఆయన మరి మహాత్ముడెలా అయ్యారు ?

లింగ :- నీకింకా అర్ధం కావట్లేదు ! గాంధీ గారు ఇప్పుడు మహాత్ముడో , లేక జాతిపిత గానో కంటే ఒక బ్రాండ్ నేముగా మిగిలిపోయారు .. పేరు చివర తగిలించుకుంటే వారసత్వం గా పదవులు వస్తున్నై , గోడకి తగిలించుకుంటే పవరొస్తోంది ... ఆఖరికి పెన్నులకి ఆయన పేరు పెట్టుకుని లక్షలకి అమ్ముకున్నారు .. అది బాబు నేటి రాజకీయం !

సింగ :- మరి స్కాములంటున్నావ్ , ఎం చేస్తావేంటి ?

లింగ :- అదేరా ఆలొచిస్తున్నా ! గడ్డి తో చెసేసారు, ఆటలతో చెసేసారు , ఆఖరికి కనిపించని తరంగాలతో కూడా కోట్లు దండుకున్నారు . నాకిక మిగిలింది ఎంటో ?

Sunday, 19 September 2010

సింగ రాజు కోతలు - లింగ రాజు వాతలు

పాత పాటలు వింటూంటే ఆ సంగీతంతో పాటు సాహిత్యం కూడా మనసుకి ఆహ్లాదంగాను , ఆనాటి పరిస్థితులకి ప్రతిబింబంగాను ఉంటాయి. కామెడీ పాటల్లో కూడా ఎంతో నీతి ఉండేది , అలాంటి పాటల్లో ఒకటైన పాట
"కాశీకి పోయాను రామా హరీ ,
గంగ తీర్థంబు తెచ్చాను రామా హరీ " అనేది.

రేలంగి గారు సన్యాసి వేషంలో వారికి నచినట్టు కోస్తూ ఉంటే , వారి గాలి తీసేసే పాట ఇది ..



అలాగే మన సింగ రాజు గారు కూడా ఒక సాయంకాలం పూట, గట్టు మీద చెట్టు కింద గుమిగూడిన "పిచ్చాపాటి" మేళం ముందు కోతలు కొయ్యడానికి పూనుకున్నారు ..
మన లింగ రాజు చుస్తూ ఊరుకుంటాడా? ఇలాంటి అవకాసం కోసమే ఎదురుచూస్తున్నాడాయె..

సింగ :- ఢిల్లీకి వెళ్ళాను రామా హరీ

           సోనియా గాంధీని కలిశాను రామా హరీ
            దేశ ప్రగతి చర్చించాను రామా హరీ...
(తందాన తందాన తందానతానా..)

లింగ :- ఢిల్లీకి పోలేదు రామా హరీ
           ఇంటి గడప దాటే లేదు రామా హరీ
           ముసుగు తన్ని పడుకున్నాడు రామా హరీ ..
(తందాన తందాన తందానతానా..)

ఆయ్ !! మాటకి మాట అన్నట్టు , పాటకి పాట అప్పచెప్తున్నాడనుకుని , ఒళ్ళుమండి , ఇలా మొదలెట్టాడు ..

సింగ :- అమెరికా వెళ్ళాను రామా హరీ

           ఆంధ్ర సంతతిని కలిశాను రామా హరీ
           ఆయిల్ లీకునాపొచ్చాను రామా హరీ...
(తందాన తందాన తందానతానా..)

లింగ :- బస్సు టిక్కట్టుకే రామా హరీ
           చెంత చిల్లిగవ్వా లేదు రామా హరీ
           ఇంక లోకసంచారమా రామా హరీ ..
(తందాన తందాన తందానతానా..)
 
సింగ :- ముఖ్యమంత్రీ పదవి రామా హరీ
            వద్దు వద్దు వదిలేశాను రామా హరీ
            ప్రజాసేవకంకితమైతి రామా హరీ...
(తందాన తందాన తందానతానా..)

లింగ :- పదవి కోరీ వెడితె రామా హరీ
           చాచి తన్ని తరిమేశారు రామా హరీ
           ప్రజాసేవ వట్టీ మాట రామా హరీ ..
(తందాన తందాన తందానతానా..)
 
సింగ :- నిజము చెబుతానండి రామా హరీ

           నేను దేశభక్తుడనండి రామా హరీ
           నన్ను పూర్తిగా నమ్మండి రామా హరీ...
(తందాన తందాన తందానతానా..)

లింగ :- రాజకీయము లెండి రామా హరీ
           ఓట్లపాట్లండి ఈ సంత రామా హరీ
           నమ్మి చెడుటేల ? జాగ్రత్త రామా హరీ ..
(తందాన తందాన తందానతానా..)
 
సింగ :- న్యాయమూ ధర్మమూ రామా హరీ

          నాకు అన్నపానీయాలు రామా హరీ
           ప్రజలు కన్నబిడ్డాలింక రామా హరీ...
(తందాన తందాన తందానతానా..)


లింగ :- మద్యమూ లంచమూ రామా హరీ
           పరమప్రీతిపాత్రములండి రామా హరీ
            ప్రజలబ్రతుకులేలెక్కింక? రామా హరీ ..
(తందాన తందాన తందానతానా..)
 
సింగ :- మా మతము చేరండి రామా హరీ

           చాల డబ్బులిస్తామండి రామా హరీ
           డాలర్లు రాశిపోస్తామండి రామా హరీ...
(తందాన తందాన తందానతానా..)

లింగ :- వెర్రిగొర్రెల రీతి రామా హరీ
           కసాయివార్ల నమ్మావద్దు రామా హరీ
           నేటి బానిసత్వమ్మిదే రామా హరీ ..
(తందాన తందాన తందానతానా..)
 
సింగ :- చేత కానీ వారు రామా హరీ

           మీ దేవతలు, రాళ్ళు , రామా హరీ
           పుచ్చు వంకాయ మీ భక్తి రామా హరీ...
(తందాన తందాన తందానతానా..)

లింగ :- సహనశీలురమేము రామా హరీ
          చేతకాక వదలాలేదు రామా హరీ
           తాటతీసివేస్తామింక రామా హరీ ..
(తందాన తందాన తందానతానా..)


ఇంత కోతలు కోసి , రాముడు , కృష్ణుడు , ఎవరూ లేరు , అదంతా ఛాదస్తమని ఎక్కడో ఎవడో పనికిమాలిన పనీపాటా లేనివాడు , ఇండియాని , ఇండియన్ దేవుళ్ళని , ఆ ఆచరాలనీ తిట్టడమే జీవనోపాధిగా ఉన్నవాడు రాసిన చెత్త చదివీ పాడైన బుర్రతో వాదించేశాడు సింగరాజు ..


కాని లింగరాజు & మిగతా జనం కోపం చూసి , సన్నగా వెన్నులో చిన్న ఒణుకు పుట్టేసరికి .. ఈ ఒక్కసారి తనని రక్షిస్తే .. గట్టుమీదున్న శివుడికి  గోదారి నీళ్ళతో అభిషేకం చెయిస్తానంటూ మొక్కుకుని , మెల్లగా జారుకున్నాడు మన సింగరాజు ..



అంతా విష్ణు మాయ !!

Wednesday, 1 September 2010

చిరిగిన నోటు - సింగరాజు పాట్లు

జగన్నాటక సూత్రధారి కంసవధ కోసం , కురుక్షేత్ర సంగ్రామంలో పార్ధసారధిగా పరమార్ధం బోధించటం కోసం , దేవకీ గర్భాన, కారగారంలో,రాక్షసులు తిరిగే నిశా సమయంలో , తనని తానే సృజించుకున్న శ్రీకృష్ణాష్టమి పర్వదినాన ..

తమ వీధిలో పెట్టిన ఉట్టి కొట్టొచిన ఆనందం లో లింగరాజు ఉంటే , మొహం వేలాడేసుకుని కూర్చున్నాడు సింగ రాజు ..

లింగ :- ఏరో ! ఎమైందేంటి , మొహం రాజమండ్రి బ్రిడ్జి గతుకులలో , డొక్కు ఆటో లో కుక్కుకుని వచ్చిన వాడిమల్లే పెట్టావ్ , ఏంది కథ ?


సింగ రాజు భారంగా నిట్టూర్చాడు ..


లింగ :- ఏంటి నిరాశే? అయితే నీకు రెండు ఇసుక రేణువుల కధ చెప్తా నిరాశ పోతుంది , పూర్వం బ్రహ్మా...


సింగ :- రే ! ఆపరా , అది నేనే నేకు చెప్పాను..


లింగ :- ఓహో! నువ్వు చెప్పిందేనా అది , మర్చిపొయా :-)

సింగ :- అయినా సందర్భం ఏంటో తెలియకుండా అన్నిటికీ ఆ కధే చెప్పేస్తావా ?



లింగ :- ఏమో , నువ్వు కూడా ఆత్మనూన్యతతో ఉన్నావేమో అని అనుకున్నా .. మరెందుకిలా ఉన్నావ్? ఆ కరణం గారి అమ్మాయి, నీ ప్రేమ తిరస్కరించిందా?


సింగ :- ఊహూ ..


లింగ :- మరైతే , వాళ్ళ నాన్నకి చెప్పేసిందా? చెప్పరా బాబు కొన్నాళ్ళు  నీతో తిరగడం మానేస్తాను.. తిక్కచచ్చినోడు నన్ను పట్టుకుని వాయించేస్తాడు..

సింగ :- కాదెహై !



లింగ :- కొంప తీసి ఒప్పేసుకుందా ఏంటి , ఇంత బాధ పడుతున్నావ్..


సింగ :- అదేమి కాదు రా బాబు .. ఈ రోజు పొద్దున్నే ఎవరి మొహం చూసానో ఏంటో .. ఒక బొండం తాగి వందిస్తే , ఇచ్చిన చిల్లరలో ఒక పది నోటు చిరిగిపోయిందొచ్చింది ..


లింగ :- ఆరి పిసినారోడా ! ఒక్క చిరిగిన నోటుకి ఇంత నిరాశా ?ఎవడు మన బొండాంసత్తిగాడేనా ఇచ్చింది, వాడినే అడుగు ఇంకోటి ఇవ్వమని ..


సింగ :- వాడు కాదు , వీడెవడో కొత్తోడు ,ఆనక బాబాయి హోటల్లో టిఫిన్ తిని బిల్లు కడుతూంటే అప్పుడు గమనించా .. ఆ బొండాలోడి కోసం ఊరంతా తిరిగా , లాభం లేదు దొరకలేదు..


లింగ :- మరేం చెసావ్?


సింగ :- అది మారుద్దమని మన శెట్టి కొట్లో అవసరం లేకపొయినా , పప్పు , ఉప్పు కొనేసి , తెలివిగా , మిగతా నోట్లతో పాటూ ఇది కలిపేసి ఇచ్చేసాను .. కాని ఆ శెట్టిగాడు పట్టేసాడు ...

లింగ :- డబ్బువిషయంలో వాడంతేగా .. ఆ తర్వాతా?



సింగ :- ఇంకో రెండు మూడు కొట్లలో ఇలా అవసరం లేక పొయినా ఎదో ఒకటి కొని ఇది మారుద్దమనుకున్నా , కాని లాభం లేదు , ఎవ్వడూ తీస్కోలేదు ..


లింగ :- మరి ?


సింగ :- ఇంక ఉక్రోషం ఎక్కువైపోయి , ఎలాగోలా దాన్ని వదిలించుకోవాలని చెప్పి , మన బస్ స్టాండ్లో ఎవరు చుడకుండా పడేసా..


లింగ :- పొన్లే , ఒదిలిపోయిందిగా..


సింగ :- ఏంటి పోయేది , వెనకాలే ఎవడో పరిగెత్తుకుని వచ్చి మరీ "సార్ మీ నోటు పడిపొయింది సార్" అని ఇచ్చి వెళ్ళాడు .. బహుశా దొంగలకి కూడా ఆ చిరిగిన నోటు అక్కర్లేదేమో ..

లింగ :- ఒరినీ ఇదా నీ ప్రాబ్లం .. నోటుని గోదాట్లో వేసెయ్యి.. సరిపోతుందిగా ..



సింగ :- అదే అనుకున్నాను , కాని మన గోదారి గట్టున ఉన్న కృష్ణుడి గుడి గంట వినపడే సరికి ఒక ఐడియా వచ్చింది .. మెల్లగా వెళ్ళి , హుండీ లో వేసేసి ప్రసాదం కడుపునిండా తినొచ్చాను


లింగ :- బాగుంది రా .. మరేం , అది ఒదిలిపోయింది గా , ఇంకెందుకు ఈ దిగులు ..


సింగ :- అసలు గొడవ ఇక్కడే మొదలయింది


లింగ :- పశ్చాత్తాపమా ?

సింగ :- అంతలేద్రో ! అలా హుండీలో వేసొచ్చానో లేదో , ఇలా మన పోస్టుమాన్ వచ్చి , మా మవయ్య పంపిన పదివేల మనీ ఆర్డర్ ఇచ్చి పోయాడు .. పూర్వం , మా నాన్న దగ్గర అప్పు తీసుకున్నాడంట , ఇప్పుడది వడ్డీతో కలిపి పదివేలయ్యిందని , ఆలస్యమయినందుకు క్షమించమని రాసి పంపాడు..



లింగ :- వార్నీ ! మరేమనుకున్నవ్ కృష్ణుడంటే .. అటుకులిస్తేనే పొంగిపోయి ఐశ్వర్యమిచ్చాడంటే నమ్మలేదు నువ్వు .. ఇప్పుడు చూడు .. ఐనా సంతోషించకుండా , ఇంకా ఏడుపు మొహం ఏంటిరా?


సింగ :- చిరిగిన నోటేస్తేనే పదివేలిచ్చాడంతే .. మామూలు నోటు వేసి ఉంటే ఇంకెంత వచ్చి ఉండేదో అని .. ఛాన్స్ పొయిందే అని బాధ..


లింగ :- ఓరి నీ ఆశ !! కృష్ణ కృష్ణ !!